గుంటూరులో ఏఐ డ్రోన్ల సహాయంతో దోమల లార్వా నియంత్రణ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమంటూ అధికారుల హడావుడి సుమారు 26 ప్రధాన చెరువులు, మురుగునీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాలు లక్ష్యం చాలా ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మురుగునీరు పారుదల వ్యవస్థ కొన్ని చోట్ల అసలు కాలువలు కూడా దిక్కు లేకపోవడంతో మురుగు నిల్వ
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో దోమల నియంత్రణకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డ్రోన్‌ల సహాయంతో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారు. దోమల లార్వా నియంత్రణకు చేపట్టిన ఈ కార్యక్రమాలు కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతున్నాయని, అసలు సమస్యకు మూల కారణాలపై దృష్టి పెట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుంటూరు నగరంతో పాటు విలీన గ్రామాల్లోని 26 ప్రధాన చెరువుల్లో, మురుగు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతల్లో 174 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ ఆపరేషనన్ చేసేందుకు నగరపాలక సంస్థ కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే సదరు డ్రోన్ ఆపరేషన్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు లేకపోవడంతో అక్కడే మురుగునీరు నిల్వ ఉండి దోమల వృద్ధికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని శివారు ప్రాంతాలతోపాటు విలీన గ్రామాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో దోమల వృద్ధి మరింత పెరిగిపోతోందని చెప్పుకోవచ్చు.
శుభ్రం చేసే వారే కరువు
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 3,129.45 కిలోమీటర్ల పొడవైన డ్రైనేజీ వ్యవస్థ ఉంది. నగర పరిధిలో ప్రజారోగ్య విభాగంలో సుమారు 2 వేల మంది సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొంతమంది డెప్యూటేషన్‌పై నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారుల వద్ద, మరి కొంతమంది అధికారుల ఇళ్లల్లో పనులు చేసుకుంటూ గడిపేస్తున్నారు. మిగిలిన కొంతమందితో నగరం అంతా డ్రైనేజీ వ్యవస్థ శుభ్రం చేయడం కష్టంగా మారిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో పారిశుద్ద్య కార్మికులు డ్రైయిన్లు శుభ్రం చేసే పరిస్థితి లేదని నగరవాసులు చెబుతున్నారు. అదే విధంగా మలేరియా విభాగంలో పనిచేసే వారు ఫాగింగ్ మిషన్లను ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లోనే ఎక్కువగా తిప్పుతున్నారు. మిగిలిన ప్రాంతాలకు అసలు వెళ్లడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.. దీంతో రాత్రి వేళల్లో నగర వాసులు దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శివారు ప్రాంతాలలో అధ్వానం
గుంటూరు నగరంలో విలీనమైన 10 గ్రామాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కచ్చా డ్రైనేజీలు దర్శనమిస్తూ.. ఆ డ్రైనేజీలో మురుగు అంతా ఇళ్ల ముందే నిలిచిపోయి దుర్వాసనతోపాటు దోమల వృద్ధికి కారణం అవుతోంది. అదే విధంగా నగరంలో ఖాళీ స్థలాలు 10 వేలకుపైగా ఉన్నాయి. వీటిల్లో చాలా చోట్ల పిచ్చి మొక్కలు, చెట్లు పెరగడంతోపాటు కొన్ని స్థలాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో అవి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. నగరపాలక సంస్థ అధికారులు సాధారణంగా చెరువుల్లో దట్టంగా పెరిగిన గురప్రుడెక్క, తూటికాడను తొలగింపజేస్తారు. జీఎంసీ మలేరియా విభాగ సిబ్బంది నేరుగా లోపలికి వెళ్లి మందు చల్లడం ప్రమాదకరంగా మారడంతో ఏఐ డ్రోన్లను వాడుతున్నారు. కానీ డ్రైయిన్లు లేని చోట నిర్మించడంతోపాటు ఉన్నవాటిని సక్రమంగా శుభ్రం చేయించడం ముఖ్యమనే విషయం కూడా అధికారులు మర్చిపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని శుభ్రం చేయించడంతోపాటు ఫాగింగ్ వంటివి కూడా పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తుచేస్తున్నారు. అప్పుడే కొంతలో కొంతైన దోమల నివారణ సాధ్యమవుతుందని నగర వాసులు పేర్కొంటున్నారు. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


