డిసెంబరు 31వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలి
గుంటూరు, వెస్ట్: సీలింగ్ భూములు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ భూ పరిమితులు చట్టం, 1976 ప్రకారం ప్రభుత్వ పరిధిలోనికి వచ్చిన సీలింగ్ భూములు, మిగులు భూములు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిందన్నారు. తమ ఆధీనంలో ఉన్న భూములకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువున, ఎగువున ఉన్న అందరు నిబంధనల మేరకు అర్హత కలిగి ఉంటారన్నారు. సీలింగు భూములను క్రమబద్ధీకరించుకోవడానికి ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ 241 జి.ఓను జారీ చేసిందని చెప్పారు. ఈ ఉత్తర్వుల మేరకు సీలింగ్ భూములను క్రమబద్ధీకరించుకొనుటకు అర్హులైన వ్యక్తులు డిసెంబరు 31వ తేదీలోగా జాయింట్ కలెక్టర్, కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సిలింగ్స్, గుంటూరు వారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన మొత్తాన్ని రెండు దఫాలుగా – దరఖాస్తు సమయంలో 50 శాతం, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తేదీ నుంచి ఒక నెల గడువు లోపల మిగిలిన 50 శాతం చెల్లించాలని వివరించారు. 150 చదరపు గజాల వరకు అన్ని అర్హతలు గల వారికి ఉచితంగా డి – పట్టా మంజూరు చేస్తారని, 150 నుండి 300 చదరపు గజాల వరకు ప్రాథమిక (బేసిక్) విలువలో 15 శాతం చెల్లించాలని, 300 నుండి 500 చదరపు గజాల వరకు బేసిక్ విలువలో 30 శాతం, 5 వందల చదరపు గజాలకు పైబడి ఉంటే బేసిక్ విలువ శత శాతం చెల్లించాలని వివరించారు. క్రమబద్ధీకరించుకొను అర్హులకు కన్వేయన్స్ డీడ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 2019 మే 1వ తేదీకి ముందు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. క్రమబద్దీకరణ విలువ చెల్లించిన వారి భూములను వారి సొంత ఖర్చులతో వారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు అవకాశం కల్పించడమే కాకుండా ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా నుండి తొలగించుటకు తగు చర్యలు తీసుకుంటారన్నారు. డి – పట్టా పొందిన వారికి, గతంలో 10 సంవత్సరాల తరువాత మాత్రమే బదలాయింపు చేసే అవకాశం ఉండేదని, ప్రస్తుతం 2 సంవత్సరాలకు బదలాయింపు చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు.


