నగర అభివృద్ధికి సమష్టి కృషి అవసరం | - | Sakshi
Sakshi News home page

నగర అభివృద్ధికి సమష్టి కృషి అవసరం

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని

గుంటూరు వెస్ట్‌: గుంటూరు నగరం రూపురేఖలు మారాలని, సుందరమైన, ఆకర్షణీయంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. గుంటూరు నగర పాలక సంస్థ ప్రగతిపై శుక్రవారం స్థానిక కలెక్టట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ, కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడాలన్నారు. సురక్షిత తాగునీరు, చక్కని పారిశుధ్యం, ఆహ్లాదాన్ని ఇచ్చే పార్కులు, మంచి రహదారులు, కాలువలు వంటి సౌకర్యాలు సమకూర్చి సుందరమైన పట్టణంగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఆసక్తిగల పౌరులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా వాణిజ్య సంస్థల నుంచి వచ్చే చెత్త నిర్మాణ పట్ల దృష్టి సారించాలన్నారు. పారిశుధ్యం నిర్వహణను ప్రాధాన్యతగా చేపట్టాలని అన్నారు. ప్రజా వినియోగం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. బొంగరాలబీడు వద్ద మంచి పార్కు అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. శంకర్‌ విలాస్‌ ఫ్లై ఓవర్‌ పనులు త్వరగా పూర్తి చేసేందుకు అవసరం మేరకు కార్మికులను పెంచాలని, 2027 నాటికి పూర్తి చేయాలని తెలిపారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వేగంగా పూర్తి చేసేందుకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలన్నారు. గోరంట్ల నీటి పథకం జూన్‌ మొదటి వారం నాటికి ప్రారంభం కావాలని ఆదేశించారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మానస సరోవరం అభివృద్ధి పనులను పి.పి.పి మోడ్‌లో చేపట్టే ఆలోచన ఉందన్నారు. అమృత్‌ 2.0 క్రింద చెరువు పునరుద్ధరణకు అవకాశం ఉందని చెప్పారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు శాసీ్త్రయ విశ్లేషణ చేసి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నసీర్‌ అహ్మద్‌, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, డీఆర్వో షేఖ్‌ ఖాజావలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement