రాష్ట్రస్థాయిలో 598 మార్కులు కై వసం భావి ఇంజినీర్లుగా ఎదగాలని ఆకాంక్ష
గుంటూరు ఎడ్యుకేషన్ : గురువారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకుగానూ గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 598 మార్కులను సాధించిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. టెన్త్‌లో టాప్ మార్కులు కై వసం చేసుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఇంజినీర్లుగా ఎదగాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు.
మా స్వస్థలం పాత గుంటూరులోని వినోభానగర్. నాన్న దుర్గారావు చిన్నతనంలోనే మరణించారు. అమ్మ స్వర్ణకుమారి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ చదివిస్తున్నారు. ఇంగ్లిషులో రెండు మార్కులు తగ్గాయి. మిగతా అన్ని సబ్జెక్టుల్లో వంద మార్కుల చొప్పున వచ్చాయి. పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనతో పాటు రోజువారీ పరీక్షల్లో ఎప్పటికప్పుడు తప్పులను సరిదిద్దుకుని మంచి ఫలితాల సాధన దిశగా ముందుకెళ్లాను. ముఖ్యంగా పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవడం ద్వారానే ఈ స్థాయిలో ఫలితాలు సాధించా. – జి.దినేష్ (598 మార్కులు)
మా స్వస్థలం గుంటూరు శివారులోని గోరంట్ల. నాన్న వెంకట్రావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అమ్మ నాగలక్ష్మి వార్డు సచివాయంలో ఉద్యోగి. ఇంగ్లిషు, ఫిజికల్ సైన్సులో ఒక్కో మార్కు చొప్పున తగ్గాయి. ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ గ్రూపులో చేరి, ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నా.
– పలకలూరి స్వేచ్ఛ ప్రియదర్శిని (598 మార్కులు)
మా స్వస్థలం అమరావతి. నాన్న శివప్రసాద్ వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ విమలాదేవి గృహిణి. ఇంగ్లిషు, హిందీలో ఒక్కొక్క మార్కు చొప్పున తగ్గాయి. ప్రణాళికాబద్ధంగా చదవడం, ఉపాధ్యాయుల సలహాలు పాటిస్తూ, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా అధిక మార్కుల సాధనకు దోహదపడింది.
– కె.ఇందువదన (598 మార్కులు)


