అరాచకానికి అందలం! | - | Sakshi
Sakshi News home page

అరాచకానికి అందలం!

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

గుంటూరు రూరల్‌: ‘అరాచకాలు చెయ్‌.. అక్రమాలకు పాల్పడు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బందులు పెట్టు.. మంచి ఆదాయం వచ్చే పోస్టింగ్‌ పట్టు’ అన్నట్లుంది చంద్రబాబు ప్రభుత్వ తీరు. ఎన్నో ఆరోపణలు, మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తనలో వీఆర్‌కు పిలిచిన సీఐకి నెల రోజులు గడవక ముందే, విచారణ సైతం పూర్తి కాకుండానే నగరంలోనే అధిక ప్రాధాన్యం కలిగిన పోలీస్‌ స్టేషన్‌లో పోస్టింగ్‌ ఇచ్చి ప్రభుత్వం సత్కరిస్తోంది. నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో గతంలో సీఐగా పనిచేసిన సీఐ సైతం సెటిల్‌మెంట్‌లు, రియల్‌ దందాలు, బార్‌ల వద్ద అక్రమ వసూళ్లు, వై.జంక్షన్‌లో రాత్రి సమయాల్లో అనేక రాచకార్యాలు వెలగబెట్టి చివరికి జనసేన నాయకుల ఒత్తిడితో ఎట్టకేలకు వీఆర్‌కు వెళ్లారు.

● ఇప్పుడు అదే కోవకు చెందిన మరో సీఐ పి.భాస్కర్‌పై సైతం ఇటీవల కాలంలో భారీ ఆరోపణలు ఉన్నాయి. దాచేపల్లి స్టేషన్‌లో పనిచేస్తుండగా.. కేసు పరిష్కారం కోసం వచ్చిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని అధికారిక విచారణకోసం ఢిల్లీ వెళుతూ తనతోపాటు ఆ మహిళను సైతం తీసుకెళ్ళిన ఘటనలో మహిళ భర్త ఫిర్యాదు మేరకు సుమారు 20 రోజుల క్రితం వీఆర్‌కు పంపినట్లు సమాచారం. ఇదే కాకుండా సీఐకి గతంలో బేడీల భాస్కర్‌ అనే బిరుదును సైతం దాచేపల్లి ప్రజలు, మీడియా ఇచ్చారు. దాచేపల్లిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తను అక్రమంగా అరెస్ట్‌ చేసి అతనిని స్టేషన్‌లో కూర్చోబెట్టగా.. వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ ముట్టడిస్తారని భయంతో ఆయనే స్వయంగా తన పోలీస్‌ స్టేషన్‌ ప్రధాన గేటుకు బేడీలను తాళాలుగా వినియోగించి బేడీల భాస్కర్‌గా ప్రత్యేకత సాధించారు.

● ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి, అక్రమాలు చేసిన సీఐని వీఆర్‌కు పిలిచి రోజుల వ్యవధిలో మరోసారి అందలం ఎక్కించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచకాలు సృష్టించి, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, అక్రమాలు, దందాలు చేసే వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆదాయం వచ్చే పోస్టింగ్‌లను ఇస్తున్నారని పోలీస్‌ వర్గాల్లో గత రెండు రోజులుగా చర్చాంశనీయంగా మారింది.

● ఎటువంటి విచారణ పూర్తి కాకుండా అందులోనూ నగరంలో అధిక ప్రాధాన్యత గలిగిన, అధిక విస్తీర్ణత కలిగిన, అధిక కేసులు నమోదవుతున్న పోలీస్‌ స్టేషన్‌కు అటువంటి సీఐని పోస్టింగ్‌ ఇచ్చి పంపితే ఆ స్టేషన్‌ పరిధిలో ప్రజలు, శాంతి భద్రతల పరిస్థితి ఏవిధంగా ఉండబోతుందోనని పోలీస్‌ వర్గాల్లో, ప్రజల్లో చర్చాంశనీయంగా మారింది. రానున్న రోజుల్లో నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శాంతి భద్రతలు, ఏవిధంగా ఉండబోతున్నాయోనని ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం తీరిది

అక్రమాలు, మహిళలపై

అసభ్యప్రవర్తన చేసిన వారికి అండ

వీఆర్‌కు పిలిచిన నెల రోజుల్లోనే

నగరంలోని ప్రాధాన్యతగల

స్టేషన్‌లో పోస్టింగ్‌

విచారణ పూర్తికాకుండానే

పోస్టింగ్‌పై పోలీస్‌ వర్గాల్లోనే చర్చ

జనసేన వర్గాలు ఫిర్యాదు చేస్తే

తప్ప గత సీఐ వంశీని మార్చని వైనం

ఎక్కువ ఆరోపణలు ఉన్న

సీఐ భాస్కర్‌కు నల్లపాడులో పోస్టింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement