వైఎస్సార్‌ సీపీ పోరాట ఫలితమే సీఎం లేఖ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ పోరాట ఫలితమే సీఎం లేఖ

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర ధనార్జన

తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలి

తక్కువ ధరకు కొనుగోళ్ల ద్వారా రూ.30 కోట్లు ఆర్జించిన టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర

వైఎస్సార్‌ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపణ

గుంటూరు ఎడ్యుకేషన్‌: మొక్కజొన్న రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్‌ సీపీ ఒత్తిడి తెచ్చిన ఫలితంగానే రాష్ట్రంలో మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాశారని వైఎస్సార్‌ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర లభించక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాదిరిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు ప్రకటించిన మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 25న వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ‘మొక్కజొన్న రైతు పోరాట దీక్ష’కు అపూర్వ స్పందన వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఆందోళనలో ఉన్నారని, సుమారు 42.06 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న పంట దిగుబడి ఉందని, రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు స్వయంగా లేఖ రాశారని అన్నారు. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న దృష్ట్యా ప్రజలకు తగు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వంపై ఉందన్నారు.

దక్కని మద్దతు ధర

ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 10వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయగా, ఒక్క పొన్నూరు నియోజకవర్గంలోనే 40 వేల ఎకరాల్లో పంట పండించారని తెలిపారు. క్వింటాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400 సైతం రైతులకు అందడం లేదని, దళారులు రైతుల నుంచి రూ.1600 నుంచి రూ.1700 వరకు కొంటున్నారని స్వయంగా సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి కి రాసిన లేఖలో పేర్కొన్నారని చెప్పారు. దళారుల ప్రభావాన్ని అరికట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

పొన్నూరు నియోజకవర్గంలోనే 40వేల ఎకరాల్లో 18 లక్షల క్వింటాళ్ల మేరకు పంట దిగుబడి వచ్చిందని, ఇందులో ఇప్పటి వరకు నాలుగు లక్షల క్వింటాళ్ల పంటను రైతుల నుంచి టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అండ్‌ గ్యాంగ్‌ దళారుల రూపంలో కేవలం రూ.1650కే కొనుగోలు చేశారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేనే స్వయంగా మీడియా సమావేశంలో ప్రకటించారని అన్నారు. ఆ విధంగా ఎమ్మెల్యే నరేంద్ర అనుచరులు పొన్నూరు నియోజకవర్గంలోని రైతుల నుంచి నాలుగు లక్షల క్వింటాళ్లకు రూ.30 కోట్ల మేరకు లబ్ధి పొందారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర గ్యాంగ్‌ రైతుల నుంచి దోచుకున్న రూ.30 కోట్లను రికవరీ చేసి అన్నదాతలకు పంచాలన్నారు. దీంతో పాటు ఎమ్మెల్యే నరేంద్రపై చర్యలు తీసుకుని, రైతు పక్షపాతి ప్రభుత్వమని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement