పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : గుంటూరు నగరంలో వస్త్ర దుకాణ కాంప్లెక్సులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖ అధికారులు, పాత గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకానిరోడ్డులోని వాసవి కాంప్లెక్సులో ఉన్న దుర్గా సిల్క్స్ సముదాయంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించాయి. గుంటూరు–2 అగ్నిమాపక శాఖ అధికారి పి.శ్రీనివాసరావుకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో వచ్చి మంటలు అదుపు చేశారు. వాసవి కాంప్లెక్సులో అన్నీ వస్త్ర దుకాణాలే ఉండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. మంటలు వ్యాప్తి చెందుతున్న సమయంలో దుకాణదారులు షాపు షట్టర్లు మూసివేయడంతో ప్రమాదం తప్పిది. దుకాణంలోని నాలుగు బ్లాకుల్లో మంటలు వ్యాపించడంతో వస్త్రాలు కాలిపోయాయి. సుమారు రూ. 40 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని షాపు యజమానులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


