అపూర్వం... హనుమాన్‌ ఘటాభిషేకం | - | Sakshi
Sakshi News home page

అపూర్వం... హనుమాన్‌ ఘటాభిషేకం

Apr 29 2026 8:12 AM | Updated on Apr 29 2026 8:12 AM

నాజ్‌సెంటర్‌లోని ఆంజనేయస్వామి ప్రత్యేకత ఆలయంలో ఏళ్లుగా కొనసాగుతున్న సద్ది కార్యక్రమం

పట్నంబజారు: ఏ ఆపద వచ్చినా.. మనసులో భయం ఆవరించినా.. చిన్నారుల నుంచి పెద్దల వరకు తలుచుకునే ఏకై క నామస్మరణం ‘శ్రీ ఆంజనేయం’. భక్తుల పాలిట అభయాంజనేయుడై.. కొండంత మనోధైర్యాన్ని ఆయన నామస్మరణతో కల్పించే శక్తి ఆ అంజనీసుతుడికే ఉందనేది భక్తుల నమ్మకం. గుంటూరు నాజ్‌ సెంటర్‌లోని వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామి కూడా భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. సుమారు 300 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన విగ్రహం కలిగిన ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా వెలుగొందుతోంది. వందల ఏళ్ల క్రితం సాధువులు ఇక్కడకు వచ్చి సాధన, యజ్ఞయాగాదులు చేసేవారని నానుడి. సాక్షాత్తూ ఆంజనేయస్వామి శ్యామలాదాస్‌ బావాజీకి కలలో కనిపించారని ప్రతీతి. తాను నాజ్‌సెంటర్‌లోని ప్రాంతంలో ఉన్న ఒక గుంటలో ఉన్నానని.. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారని పురాణాలు పేర్కొంటున్నాయి. చెరువులో ఉన్న ధ్యాన ఆంజనేయస్వామి.. భక్తులకు మాత్రం అభయాంజనేయస్వామి రూపంలో దర్శనమిస్తారు. సుమారు మూడు శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ పవిత్ర క్షేత్రం కాలగమనంలో ఎన్నో మార్పులకు లోనైంది. తన ఆధ్యాత్మిక వెలుగును మాత్రం ఏమాత్రం కోల్పోలేదు. పూర్వకాలంలోనే ఈ ప్రదేశం సాధువులు, సన్యాసులు తమ తపోసాధనలకు వేదికగా ఎంచుకున్నారని స్థానికంగా వినిపించే నానుడి. ఇక్కడికి విచ్చేసిన ఋషులు, యోగులు జపాలు చేసి, ఆధ్యాత్మిక శక్తిని ఆవాహన చేసి వెళ్లేవారని భక్తుల విశ్వాసం.

దశాబ్దాలుగా సద్ది కార్యక్రమం

1987 సంవత్సరం నుంచి అప్పటి ఆలయ అర్చకులు ప్రసాద్‌ (పాపాచార్యులు), రవికిరణ్‌ రాజ్‌, టీవీ సుబ్బారావులు హనుమాన్‌ మాలల కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1989 నుంచి హనుమాన్‌ దీక్ష సమాజం గౌరవాధ్యక్షుడిగా ఉన్న టీవీ సుబ్బారావు, అర్చకులు పాపాచార్యులు, రవికిరణ్‌రాజ్‌లతో కలిసి స్వాములకు సద్ది కార్యక్రమాన్ని చేపట్టారు. కొంత మంది దాతలు, ఆంజనేయ భక్తుల సహకారంలో నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఆంజనేయస్వామి విజయోత్సవ యాగకాలం రోజు నుంచి దీక్షలు ప్రారంభిస్తారు. హనుమాన్‌ జయంతి వరకు 41 రోజుల పాటు కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. మిగతా ఇద్దరూ శివైక్యం చెందడంతో ప్రస్తుతం టీవీ సుబ్బారావు మాత్రమే కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నారు. గత ఆరు సంవత్సరాలుగా రాత్రి సమయాల్లో సైతం దీక్షాపరులకు ఫలహారాన్ని అందజేస్తున్నారు. గుంటూరులో వందల ఏళ్ల క్రితం కరువు కాటకాలు వచ్చిన సమయంలో సహస్ర ఘటాభిషేకం నిర్వహించారని పూర్వీకులు ద్వారా తెలుస్తోంది. అప్పటి నుండి స్వామి వారికి హనుమత్‌ జయంతి రోజున సహస్ర ఘటాభిషేకం చేయడం ఆనవాయితీ వస్తోంది.

కనుల పండువగా వేడుక

దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలో ఉన్న నాజ్‌ సెంటర్‌ ఆంజనేయ స్వామికి సంబంధించి ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఏటా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రస్తుత శ్రీ వెంకటేశ్వరస్వామి గ్రూప్‌ ఆలయాల అసిస్టెంట్‌ కమిషనర్‌ టి. సుభద్ర ఆధ్యర్యంలో హనుమాన్‌ దీక్షా సమాజం సభ్యులు కార్యక్రమాలు చేపడుతున్నారు. మే 8వ తేదీన అంకుర్పాణ అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ, 9న లక్ష తులసీదళ పూజ, పంచామృత స్నపన, 10న లక్ష మల్లెల పూజ, 11న లక్ష ఆకుల పూజ, హనుమాన్‌ చాలీసా నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటలకు గ్రామోత్సవంతో స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు కనుల పండువగా జరగనుంది. 12న సహస్ర ఘటాభిషేకం, స్వామి వారి కల్యాణం ఉంటాయి. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement