జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు వెస్ట్: జిల్లాలోని 195 పెట్రోల్ బంకుల్లో పూర్తిస్థాయిలో డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. హెచ్‌పీసీఎల్, ఐ.ఓ.సి.ఎల్, బీపీసీఎల్ కంపెనీల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం భేటీ అయ్యారు. కొండపల్లి ఇంధన నిల్వల ప్రదేశాన్ని జేసీ సందర్శించారు. ఇంధన నిల్వలు అందుబాటు పరిస్థితిని ఆరా తీశారు. జేసీ మాట్లాడుతూ ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు అపోహలకు లోనుకావద్దని కోరారు. బంకుల్లో సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త చెప్పారు. జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీంబాషా, అధికారులు పాల్గొన్నారు.


