విద్యాశాఖలో వింత ధోరణి | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖలో వింత ధోరణి

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

విద్యాశాఖలో వింత ధోరణి

ఆర్నెల్లుగా పాఠశాలకు రాని ఉపాధ్యాయుడిపై చర్యల్లేవు విధులకు సక్రమంగా హాజరైన హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు పాఠశాలకు రాకుండా యాప్‌లో హాజరు నమోదు వ్యవస్థను పక్కదారి పట్టించిన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడి గైర్హాజరు విషయం తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంఈవో క్షేత్రస్థాయిలో విద్యాశాఖాధికారుల అండదండలతోనే మొత్తం వ్యవహారం సమగ్రమైన విచారణ జరిపించాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు విచారణ జరిపి దోషులెవరో తేలుస్తామంటున్న డీఈవో

విద్యాశాఖాధికారుల అండదండలతోనే..

గుంటూరు ఎడ్యుకేషన్‌: విద్యాశాఖలో వింత ధోరణి నెలకొంది. ఆర్నెల్లుగా పాఠశాలకు రాకుండా, పిల్లలకు పాఠాలు చెప్పకుండా తిరుగుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ప్రధానోపాధ్యాయురాలికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. గుంటూరు శివారు గోరంట్లలోని మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాల (ఎల్‌ఈ)లో గత ఆర్నెల్లుగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయుడి వ్యవహారాన్ని ఈనెల 24న సాక్షి వెలుగులోకి తెచ్చింది. ‘సాక్షి’ కథనంతో ఉలిక్కిపడిన అధికారులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి రెండు రోజుల కిందట షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ఆర్నెల్లుగా ఉపాధ్యాయుడు విధులకు హాజరు కావడం లేదనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఎంఈవో ద్వారా నోటీసు ఇచ్చి, సంజాయిషీ కోరారు.

పాఠశాలకు రాకుండా లీప్‌ యాప్‌లో హాజరు నమోదు

పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడు గతేడాది నవంబర్‌ నుంచి విధులకు హాజరు కావడం లేదు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో దీర్ఘకాలిక సెలవులో ఉన్నట్లుగా ప్రధానోపాధ్యాయురాలికి వాట్సాప్‌ ద్వారా సందేశాలను పంపుతూ, మరో వైపు విధుల్లో ఉన్నట్లుగా రికార్డుల్లో చూపించారు. పాఠశాలకు రాకుండా లీప్‌ యాప్‌లో హాజరు నమోదు చేసిన సదరు ఉపాధ్యాయుడు వ్యవస్థను పక్కదారి పట్టించారు. 62 మంది విద్యార్థులు ఉన్న ఐదు తరగతుల బోధనకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఇద్దరే బోధన చేస్తున్నారు. ముగ్గురు ఉపాధ్యాయుల్లో ఒకరు ఆర్నెల్లుగా గైర్హాజరు కావడంతో ఉన్న ఇద్దరు టీచర్లే ఐదు తరగతులను బోధిస్తున్నారు. దీంతో వారిపై అధిక పని భారం పడి సతమతమవుతున్నారు. నిత్యం పాఠశాలలో విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులతోపాటు డిప్యూటేషన్‌పై వెళ్లిన, దీర్ఘకాలిక సెలవులో ఉన్న ఉపాధ్యాయులు సైతం విద్యాసంవత్సరం చివరి పనిదినం రోజున పాఠశాలకు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉండగా, సదరు ఉపాధ్యాయుడు ఈనెల 23న విధులకు హాజరు కాలేదు.

సమగ్ర విచారణ జరిపించాలి

ఉపాధ్యాయుడి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డిని కలిసిన యూటీఎఫ్‌ బృందం ఈ వ్యవహారంలో పాఠశాల హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవడం తగదన్నారు. ఉపాధ్యాయుడిని కాపాడుతూ పాఠశాలకు సక్రమంగా హాజరై బోధనచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలుకి షాకాజ్‌ నోటీసు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు?. పాఠశాలలో రికార్డులు తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఫేషియల్‌ అటెండెన్స్‌, సర్వీస్‌ రిజిస్టర్‌, జీతాల బిల్లులను సమగ్ర పరిశీలన చేసి దోషులను శిక్షించాలని కోరారు. లేని పక్షంలో పోరాటానికి దిగుతామని స్పష్టం చేశారు.

తాను సెలవుల్లో ఉన్నట్లుగా హెచ్‌ఎంకు వాట్సాప్‌ ద్వారా సందేశాలను పంపి, లీ్‌ప్‌ యాప్‌లో హాజరు నమోదు చేసిన వ్యవహారంలో సంబంధిత ఉపాధ్యాయుడికి క్షేత్రస్థాయిలో విద్యాశాఖాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖను మోసగిస్తూ సాగించిన ఈ వ్యవహారం వెనుక పాఠశాల పరిధిలోకి వచ్చే గుంటూరును నగరానికి చెందిన ఒక ఎంఈవో ఉన్నారు. దీనిపై సమగ్రమైన విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. జరిగిన సంఘటనలో ప్రాథమికంగా సదరు పాఠశాల హెచ్‌ఎం తప్పుందని, అయితే లోతుగా విచారణ జరిపి దోషులెవరో తేలుస్తామని డీఈవో షేక్‌ సలీమ్‌ బాషా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement