బ్లాక్ స్పాట్లపై దృష్టి సారించిన ఎస్పీ వకుల్ జిందాల్ కాజా, వెంకటాయపాలెం టోల్ ప్లాజాలు, బైపాస్ రోడ్ల పరిశీలన
తాడికొండ/మంగళగిరిటౌన్:మంగళగిరి– తుళ్లూరు మండలాల పరిధిలో జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఇతర అధికారులతో కలిసి కీలక ప్రమాద ప్రదేశాలను మంగళవారం పరిశీలించారు. కాజా టోల్ ప్లాజా, వెస్ట్ బైపాస్‌లోని మురుగన్ హోటల్ సమీప ప్రాంతం, వెంకటాయపాలెం టోల్‌ప్లాజా, సీడ్ యాక్సెస్ రోడ్లను సందర్శించి, అక్కడి రోడ్డు పరిస్థితులు, వాహన రాకపోకలు, ప్రమాదాలకు దారితీసే అంశాలను సమగ్రంగా అధ్యయనం చేశారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రాత్రివేళల్లో తగినంత లైటింగ్ లేకపోవడం, రోడ్డు నిర్మాణంలో కొన్ని లోపాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారి అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు వేగాన్ని తగ్గించేలా అవసరమైన ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ముందస్తు హెచ్చరికగా ప్రతిబింబించే (రిఫ్లెక్టివ్) సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలను నివారించేందుకు హైమాస్ట్ లైటింగ్, స్ట్రీట్ లైటింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని, టోల్ ప్లాజాలు, బైపాస్ రోడ్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేసి, అధిక వేగంతో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్పీడ్ గన్‌న్స్, సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని తెలిపారు. ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందిని కీలక ప్రాంతాల్లో నియమించాలని, అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన స్పందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంగళగిరి గ్రామీణ సీఐ ఏవీ బ్రహ్మం, గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్, పోలీస్ సిబ్బంది, హైవే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయండి
తాడికొండ : అమరావతి రాజధానిలో రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో అమలవుతున్న భద్రతా చర్యలపై మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తుళ్లూరు డీఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో అమలవుతున్న భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, రాత్రి వేళల్లో పెట్రోలింగ్, చెక్‌పోస్టుల పనితీరు, డ్రోన్ నిఘా తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని పోలీసు అధికారులను సూచించారు. చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీని సమర్థవంతంగా చేపట్టాలన్నారు. డ్రోన్ నిఘాను సమర్థవంతంగా వినియోగించి సున్నిత ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎ.హనుమంతు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఎస్‌బీ డీఎస్పీ అలహారి శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ సంకురయ్య, తుళ్లూరు సీఐ శ్రీనివాసరావు, తుళ్లూరు ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు, తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, మంగళగిరి రూరల్ సీఐ బ్రహ్మం, ఆర్‌ఐ (అడ్మిన్) శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


