నగరంపాలెం (గుంటూరువెస్ట్): ఆంధ్రజ్యోతి దినపత్రికలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల కుటుంబ సభ్యుల గురించి సభ్య సమాజం తలదించుకునేలా ప్రసారమైన వార్తలు కార్యకర్తల మనసులను కలిచివేశాయని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. ఈనెల తొమ్మిదిన ఏబీఎన్ రాధాకృష్ణపై, ప్రచారం చేసిన వ్యక్తులపై చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, నియోజకవర్గాల సమన్వయకర్తలు షేక్ నూరి ఫాతిమా, అన్నాబత్తుని శివకుమార్, బాలవజ్రబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, బలసాని కిరణ్‌కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజానారాయణ, గులాం రసూల్, అనుబంధ నాయ విభాగాల కులు, కార్యకర్తలు, న్యాయవాదులు కలసి వినతిపత్రం అందించారు.
– మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వో (సీఐ)లకు వినతిపత్రాలు అందించామని తెలిపారు. రాజధాని విషయమై మాట్లాడితే జైల్లో నిర్భందించారని గుర్తు చేశారు. అధికార పార్టీ వారికి ఒక న్యాయం, మరో పార్టీ వారికి మరో న్యాయం జరుగుతుందా అని మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు రిజిస్ట్రర్ చేయలని రాష్ట్ర డీజీపీ, గుంటూరు రేంజ్ ఐజీ, గుంటూరు జిల్లా ఎస్పీని కోరుతున్నానని అన్నారు. కార్యకర్తలకు భార్య, చెల్లెలు తెలియదనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మా మానవత్వానికి మనసు చంపే విధంగా కామెంట్ చేశారని అన్నారు.
మానవ హక్కుల కమిటీకి..
రాధాకృష్ణపై కేసు నమోదు చేయకపోతే మానవహక్కుల కమిటీకి, న్యాయస్థానంలో పోరాడతామని అన్నారు. 2029లో ప్రతీకార చర్య ఉంటుందని అన్నారు. మీరు చెప్పకపోతే తమలో ప్రతీకార చర్య పెరుగుతుందని చెప్పారు. 2029లో ఏబీఎన్, ఆంధ్రజ్యోతికి పుల్‌స్టాఫ్ పెట్టే కార్యక్రమం చేస్తామని, ఇప్పటి వరకు కామాలు పెట్టుకుంటా వచ్చామని ఇక పుల్‌స్టాఫ్ ఉంటుందని స్పష్టం చేశారు. బ్యాన్ చేస్తామనే మాట గర్వంగా, ధైర్యంగా చెబుతామని మోదుగుల ఉద్ఘాటించారు.


