ఏఎన్‌యూ(పెదకాకాని): కళాశాల పాలన వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించే ప్రిన్సిపాళ్లు నిబద్ధతతో పాలనాపరమైన బాధ్యతలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా కోరారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం ప్రిన్సిపాల్స్ ఓరియంటేషన్ కార్యక్రమం, అడ్మిషన్లు, డిజిటల్ గవర్నెన్స్‌పై దిశానిర్దేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రంజిత్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధి పోర్టల్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలని, ప్రతి ఫైలు ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా జరగాలని సూచించారు.ప్రిన్సిపాల్స్ ఎదుర్కొంటున్న పరిపాలనాపరమైన సమస్యలపై చర్చించి, వాటి పరిష్కార మార్గాలను వివరించారు. వీసీ ఆచార్య కె.గంగాధర్‌రావు, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎ.కృష్ణసత్య మాట్లాడారు. ఓరియంటేషన్ ప్రోగ్రాం అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ డాక్టర్ జ్యోతిర్మయి, ఆయా కళాశాలల నుంచి వచ్చిన 111 మంది ప్రిన్సిపాళ్లు, అధికారులు పాల్గొన్నారు.


