గుంటూరు రూరల్: వివాహితను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలో నల్లపాడు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇంచార్జి సౌత్ డీఎస్పీ బివి.మధుసూదన్‌రావు తెలిపారు. సోమవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. తాడికొండ మండలంకు చెందిన మిక్కిలి అనిత (33)కు 2020 సంవత్సరంలో జొన్నలగడ్డ గ్రామానికి చెందిన నాలాది మల్లికార్జునరావుతో వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో ఆమె తల్లిదండ్రులు రూ.లక్షన్నర నగదు, 6 గ్రాముల బంగారం కట్నంగా ఇచ్చారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో గ్రామంలో స్థలాన్ని కొనాలని అందుకు అనితను తన తల్లిదండ్రుల నుంచి డబ్బులు తేవాలని మల్లిఖార్జునరావు, నాలాది శివశంకరరావు, నాలాది మాథంగిషైనీలు తరచూ వేధించారు. దీంతో అనిత మళ్లీ తల్లిదండ్రులనుంచి మరో రూ.లక్ష తీసుకురాగా స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా మల్లిఖార్జునరావు తన మరదలైన మాథంగి షైనితో వివాహేతర సంబంధం పెట్టుకుని అనితను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, డబ్బులు తీసుకురాకపోతే రెండో వివాహం చేసుకుంటానని బెదిరించేవాడు. దీంతో వేధింపులు భరించలేక అనిత ఈనెల 9వ తేదీన పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనపై మృతురాలి సోదరుడు మిక్కిలి ధర్మతేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితులు చేసిన నేరం ఒప్పుకోవటంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలిరూరల్: పరారీలో ఉన్న హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ ఎస్‌ఐ కె. ఆనంద్ సోమవారం వివరాలు వెల్లడించారు. మండలంలోకి కొలకలూరుకు చెందిన తిరుమలశెట్టి నాగరాజును 2020 అక్టోబరులో తన పిన్ని కొడుకు రాము మహేష్ చాకుతో పొడిచి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బెయిల్‌పై విడుదలైన మహేష్ తప్పించుకుని తిరుగుతూ కోర్టు వాయిదాలకూ రాకపోతుండడంతో ప్రొక్లెయిమ్డ్ అఫెండర్‌గా పరిగణించిన కోర్టు కేసు విచారణను నిలిపివేసింది. మహేష్ కడపలో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా, కేసును రీ–ఓపెన్ చేసిన న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు.


