నగరంపాలెం: మహిళను హత్య చేసిన న్యాయవాది, అతని స్నేహితుడ్ని పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. పాతగుంటూరు యాదవబజార్ 1/4వ అడ్డరోడ్డులో ఉంటున్న ఆకుల రమాదేవి (45) శ్రీనివాసరావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. 12 సంవత్సరాల కిందట అనారోగ్యంతో శ్రీనివాసరావు మృతిచెందాడు. రమాదేవికి చేబ్రోలు మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన న్యాయవాది ఎనుమల సురేష్‌బాబుతో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఇంటి నుంచి బయటకెళ్లి తిరిగి రాలేదు. ఆమె తల్లి కలుకోలను వెంకాయ్య పాతగుంటూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసుగా నమోదు చేసి సీఐ వెంకటప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. రమాదేవి సెల్‌ఫోన్ ఆధారంగా విచారించగా, చివరి కాల్ సురేష్‌బాబు మొబైల్ నుంచి వచ్చినట్లు గుర్తించి ఆ దిశగా విచారించారు. రమాదేవితో అతనికి రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అదిగాక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె వద్ద రూ.18 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సురేష్‌బాబు గుంటూరు కోర్టులో ప్రాక్టీస్ చేసేవాడని, హైకోర్టులోనూ కొన్ని కేసులున్నాయి. ఆమె వద్ద తీసుకున్న డబ్బులు ఇటీవల జరిగిన గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ ఖర్చు చేసినట్లు గుర్తించారు. రమాదేవిని డబ్బులు విషయమై పిల్లలు అడగడంతో ఆమె సురేష్‌బాబుపై ఒత్తిడి తీసుకొచ్చేది.ఈ క్రమంలో ఆమెతో శ్రీశైలం వెళ్దామని సురేష్‌బాబు నమ్మించి, తెనాలి రూరల్ సంగంజాగర్లమూడి గ్రామ వాసి ఆటోడ్రైవర్ కోపల్లి శేఖర్ సాయంతో ఫిబ్రవరి 21 అర్ధరాత్రి శ్రీరంగపురం వెళ్లే డొంకరోడ్డులోని సంగంజాగర్లమూడి కాలువ వద్దకి తీసుకెళ్లారు. అనంతరం కర్రతో ఆమెను కొట్టి ఇద్దరు కల్సి ఆమె జుట్టు పట్టుకుని కాల్వలోకి తోసేయగా, ఆమె పైకి వచ్చేందుకు ప్రయత్నించగా మళ్లీ కర్రతో కొట్టి నీటి ప్రవాహంలోకి తోసేశారు. రమాదేవి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి సుమారు రెండు నెలలైంది. మృతదేహం జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు. మృతదేహన్ని గుర్తించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు. లాక్‌ల వద్ద కూడా నిశితంగా పరిశీలన చేస్తున్నారని అన్నారు. కేసుని ఛేదించిన తూర్పు డీఎస్పీ ఎస్‌కే అబ్దుల్‌అజీజ్, సీఐ కె.వెంకటప్రసాద్, ఎస్‌ఐ ఎస్‌కే.అబ్దుల్ రహమాన్, హెడ్ కానిస్టేబుళ్లు వి.రామారావు, ఎండీ.నూరుద్దీన్, ఎ.మోహన్‌బాబు, కానిస్టేబుల్ పి.మురళిని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు.
నిందితులకు రిమాండ్
గుంటూరు లీగల్: మహిళా హత్య కేసులో న్యాయవాది ఎనుముల సురేష్ బాబుతో పాటు మరోకరికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి మహమ్మద్ గౌస్ తీర్పునిచ్చారు. జిల్లా జైలుకు తరలించారు.
మరొకరి అరెస్ట్
కర్రలతో కొట్టి నీటి ప్రవాహంలోకి
తోసేశారు..
సుమారు రెండు నెలలైనా మృతదేహం జాడలేదు..
ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు వేగవంతం
వివరాలు వెల్లడించిన
ఎస్పీ వకుల్ జిందాల్


