పదోన్నతులకు మోకాలడ్డు | - | Sakshi
Sakshi News home page

పదోన్నతులకు మోకాలడ్డు

Feb 8 2026 4:05 AM | Updated on Feb 8 2026 4:05 AM

పదోన్నతులకు మోకాలడ్డు

పదోన్నతులకు మోకాలడ్డు

ఇరువురు ఏడీలు ప్రమోషన్‌ల కోసం పోటీ పడ్డారు ...

నోటిఫికేషన్‌లు ఇచ్చి ప్రమోషన్లు

ఇవ్వడం లేదు

కింది స్థాయి ఉద్యోగుల

ప్రమోషన్‌లలో పక్షపాతం

ఏళ్ల తరబడి కొన్ని పోస్టులు

భర్తీ చేయటం లేదు

పరిపాలన అధికారుల తీరుతో

నష్టపోతున్న చిరు ఉద్యోగులు

జీజీహెచ్‌ ఏడీ, వైద్య కళాశాల

ఏడీ పనితీరుపై విమర్శలు

గుంటూరుమెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ (పెద్దాసుపత్రి)లో కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామని అధికారులు రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకే సీటులో పనిచేస్తూ ఆర్థికంగా నష్టపోతూ మానసికంగా కుంగిపోతున్నారు. గుంటూరు జీజీహెచ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పూసల శ్రీనివాసరావు, గుంటూరు వైద్య కళాశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.రాజేంద్రప్రసాద్‌లు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ కింది స్థాయి ఉద్యోగుల పదోన్నతులకు మోకాలడ్డుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

● గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఆస్పత్రి అధికారులు పక్షపాతం చూపిస్తున్నారని పలువురు ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఏడేళ్లుగా ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోయారు. ఆరేళ్లుగా రికార్డు అసిస్టెంట్‌ పోస్టు ఖాళీగా ఉన్నా, అర్హులైన అభ్యర్థులు ప్రమోషన్‌ కోసం ఎదురు చూస్తున్నా, ఆసుపత్రి అధికారులు వాటిని భర్తీ చేయకుండా కాలయాపన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పోస్టులు ఎగిరిపోయాయి

● గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో కొన్నింటిని ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్‌ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. సుమారు ఏడేళ్లుగా జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయకుండా ఆస్పత్రి అధికారులు మిన్నకుండి పోయారు. సదరు పోస్టులను అర్హత ఉండి తమకు ఇవ్వడం లేదని కొంత మంది ఉద్యోగులు కోర్టుకు వెళ్లడంతో ఖాళీ పోస్టు ఉన్నప్పుడు ఇస్తామని కోర్టుకు వివరణ ఇచ్చారు. తీరా నేడు ఖాళీగా ఉన్న మూడు జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు కనుమరుగైపోయాయని పోస్టులు ఖాళీ వస్తే భర్తీ చేస్తామని ఆసుపత్రి అధికారులు చెబుతున్న సమాధానాలతో కింది స్థాయి ఉద్యోగులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

అడ్మినిస్ట్రేటర్లు ఉండి కూడా ..

● గుంటూరు జీజీహెచ్‌లో పరిపాలనా పరమైన విషయాల్లో సలహాలు అందించి పరిపాలన సజావుగా సాగేందుకు పలువురు అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్‌ ప్రత్యేక కోర్సులు చదివి ఆసుపత్రిలో పనిచేస్తున్నా, కింది స్థాయి ఉద్యోగుల పదోన్నతుల ఫైల్‌ ఎందుకు ముందుకు కదలడం లేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

● జిల్లా కలెక్టర్‌, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ఎ.తమీమ్‌ అన్సారియా ఈ విషయంపై దృష్టి సారించి ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్‌ల విషయంలో న్యాయం చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

గుంటూరు జీజీహెచ్‌లో ప్రస్తుతం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పూసల శ్రీనివాసరావు, గుంటూరు వైద్య కళాశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్‌లు గతంలో గుంటూరు జిల్లాలో ఆఫీస్‌ సూపరింటెండెంట్లుగా, పరిపాలనా అధికారులుగా (ఏఓ)లుగా పనిచేశారు. వీరివురు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ల పదోన్నతుల కోసం పోటీ పడ్డారు. ఇరువురు కూడా పదోన్నతులు పొంది ఇతర జిల్లాలకు వెళ్లి తిరిగి గుంటూరు జీజీహెచ్‌కు, గుంటూరు వైద్య కళాశాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా వచ్చారు. వీరివురు ఏఓలుగా పనిచేస్తున్నప్పటి నుంచి రికార్డు అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ప్రమోషన్‌ల నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఏవో క్యాడర్‌లో ఉండి, ఏడీ క్యాడర్‌లో ఉండి కూడా కింది స్థాయి ఉద్యోగుల ప్రమోషన్‌లకు ఏమాత్రం చొరవ చూపించడం లేదనే విమర్శలు వీరిపై ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement