నాటకం ద్వారా విజ్ఞానం, వికాసం
ముగిసిన గుంటూరు కళాపరిషత్ వార్షిక నాటకోత్సవాలు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : మనిషికి విజ్ఞానం, వికాసం నాటకం ద్వారా వస్తుందని విద్యావేత్త పీవీ.శంకరరావు అన్నారు. గుంటూరు మార్కెట్ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తోన్న గుంటూరు కళా పరిషత్ 28వ వార్షిక నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. సభకు అధ్యక్షత వహించిన పరిషత్ గౌరవ సలహాదారులు ఆలోకం పెద్దబ్బాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కళాపరిషత్‌ను ఆదరిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్ మాట్లాడుతూ ఎన్నో కళాపరిషత్‌లకు ఆదర్శంగా గుంటూరు కళాపరిషత్ ముందుకు వెళ్తుందని అన్నారు. టిక్కెట్ కొని నాటకం వీక్షించే ప్రేక్షకులు గుంటూరులోనే ఉన్నారని పరిషత్ ప్రధాన కార్యదర్శి బి.పూర్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ ఆడిటర్ ముప్పాళ్ళ సుబ్బారావు, సిటీ వాకర్స్ కార్యదర్శి నారదాసు కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు షేక్.సైదా పాల్గొన్నారు.
ఒక రాక్షసుడి కథ...
ఏపీ ప్రజానాట్యమండలి (విశాఖపట్నం) ఆధ్వర్యంలో ఒక రాక్షసుడి కథ నాటిక ప్రదర్శించారు. రచన, దర్శకత్వం కేకేఎల్.స్వామి చేయగా, సిటీ వాకర్స్ అసోసియేషన్ గుంటూరు వారు సమర్పించారు. మనిషి నాగరిక సమాజం ముసుగులో నేటికి అనాగరికంగా అజ్ఞానంగానే ఉన్నాడనే విమర్శనాస్త్రం ఈ నాటిక ద్వారా సంధించారు.
● ఎండమావుల్లాంటి బిడ్డల వల్ల ప్రయోజనం శూన్యం అంటూ పేరు రాసిన శాసనం అనే నాటికను ప్రదర్శించారు. గంగోత్రి పెదకాకాని ఆధ్వర్యంలో ప్రదర్శించగా, చింతకింది శ్రీనివాసరావు రచించగా, నాయుడు గోపీ దర్శకత్వం వహించగా, ఆకట్టుకుంది.


