చాంపియన్ బుక్‌ఆఫ్ వరల్డ్ రికార్డు విజేతకు అభినందన
గుంటూరు రూరల్: పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి నిదర్శనం శ్యామల హరిహిణి అని రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ ఆయోధ్యరామిరెడ్డి తెలిపారు. ఆదివారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిన్నారి అభినందన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే జ్ఞాపక శక్తిలో అనితర సాధ్యమైన ఫలితాలు రాబట్టిన చిన్నారి హరిహిణిని అబినందించారు. గణిత శాస్త్రజ్ఞుల పేర్లను, వారు కనిపెట్టిన శాస్త్రాల పేర్లను మొత్తం 45 శాస్త్రాలను కేవలం 1 నిమిషం 19 సెకన్లలో చెప్పి రికార్డు సాధించటం గొప్ప విషయమన్నారు. ఏటుకూరు రోడ్డులోని సూర్యదేవరపేటకు చెందిన మౌనికశ్రీ అకాడమీ డైరెక్టర్ బోడెపూడి రామారావు మాట్లాడుతూ నల్లపాడు గ్రామానికి చెందిన శ్యామల రవికిషోర్‌రెడ్డి, సావత్రిల కుమార్తె హరిహిణి గత కొంతకాలంగా తమ అకాడమీలో మెమరి ట్రైనర్ బోడెపూడి నాగస్వప్న పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ పొందుతుందన్నారు. ఇటీవల చిన్నారి ప్రదర్శనలకు చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థ , మెడల్, దృవీకరణ పత్రాలను అందజేసిందన్నారు. రికార్డు సాధించిన చిన్నారిని పలువురు అభినందించారు.


