పొగాకు రైతులకు ఆత్మహత్యలే శరణ్యం
● ధరలు దారుణంగా పడిపోయాయి ● ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి ● సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు కల్లూరి శ్రీనివాసరావు ఆవేదన
ప్రత్తిపాడు: పొగాకు ధరలు దారుణంగా పడిపోయాయని, ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి పరిణమిస్తుందని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు కల్లూరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడులోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన తిమ్మాపురం సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కల్లూరి శ్రీనివాసరావు పొగాకు రైతుల దైన్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిరుడు పొగాకు ధర రూ 15 వేలు ఉందని, ఇప్పుడు ఆరు వేలు కూడా లేదని ప్రశ్నించారు. రైతుల దీనస్థిథిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పొగాకుకు గత ఏడాది భారీగా ధర వచ్చిందని, దీంతో ఈ ఏడాది సెంటు భూమి లేని రైతులు కూడా పొలాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశారని పేర్కొన్నారు. పత్తి, మిర్చి పంటలు తెగుళ్ళతో పోతున్నాయని, అందుచేత రైతులంతా పొగాకు మీదనే ఆధారపడ్డారని తెలిపారు. పొగాకు సాగుకు ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి అయ్యిందని, ధర చూస్తే రూ.ఆరువేలు కూడా పలకడం లేదని ఆవేదన చెందారు. పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రైతులను కాపాడలేకపోతే ఎందుకీ సమావేశాలని అసహనం వ్యక్తం చేశారు. శనగలకు కూడా సరైన గిట్టుబాటు ధర లేదని ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు.


