నగరంపాలెం: గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో సోమవారం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది విధినిర్వహణ తీరును జిల్లా ఎస్పీ పరిశీలించారు. పట్టాభిపురం పీఎస్ పరిధిలోని పట్టాభిపురం, కోబాల్డ్‌పేట మసీదులు, లాలాపేట పీఎస్ పరిధిలోని ఎత్తురోడ్డు మసీదు, పాతగుంటూరు పీఎస్ పరిధిలోని ఆంధ్ర ముస్లిం కళాశాల, నగరంపాలెం పీఎస్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సమీపంలోని ఈద్గాల వద్ద నెలకొల్పిన బందోబస్త్‌ను పరిశీలించారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రార్థనలు ముగిసే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ప్రార్థనలు ముగిశాక ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. రంజాన్ పర్వదిన సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసుకునేలా ఆయా ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట సీఐలు ఎ.అశోక్‌కుమార్ (తూర్పు ట్రాఫిక్ పీఎస్), సింగయ్య (పశ్చిమ ట్రాఫిక్ పీఎస్), వైవీ.సోమయ్య (పాతగుంటూరు పీఎస్), పోలీస్ అధికారులు ఉన్నారు.
నేడు యథావిధిగా టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష
గుంటూరు ఎడ్యుకేషన్ రంజాన్ పండుగ సెలవు కారణంగా వాయిదా పడిన 10వ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష మంగళవారం యథావిధిగా జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం మంగళవారం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించినప్పటికీ, టెన్త్ సోషల్ పరీక్ష జరుగుతుందని తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా వ్యాప్తంగా 150 కేంద్రాల పరిధిలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే సోషల్ స్టడీస్ పరీక్షకు విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలని ఆయా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సూచించారు.
జెస్సీరాజ్‌కు పతకాలు
మంగళగిరి: ఈనెల 26 నుంచి 31 వరకు తైవాన్‌లో జరిగిన తైవాన్ ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ స్కేటింగ్ పోటీలలో మంగళగిరికి చెందిన జెస్సీరాజ్ అద్భుత ప్రతిభ కనపరిచింది. సోలో డ్యాన్స్, కపుల్ డ్యాన్స్ విభాగాలలో రెండు గోల్డ్ మెడల్స్, పెయిర్ స్కేటింగ్‌లో సిల్వర్, ఇన్ లైఫ్ ఫ్రీ స్టాల్‌లో బ్రాంజ్ మెడల్ సాధించింది. సోమవారం జెస్సీరాజ్‌కు ఏషియన్ ఆర్టిస్ట్ స్కేటింగ్ చైర్మన్ అలెక్స్ వాంగ్ పతకాలు అందజేసి అభినందించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు
బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ
చినగంజాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా ఎస్పీ సోమవారం చినగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామంలో పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంగళవారం మొత్తం 904 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని వీరిలో ఒకరు అడిషనల్ ఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 27 మంది సీఐలు, 67 మంది ఎస్‌ఐలు ఉన్నారన్నారు.
మొత్తం బందోబస్తును 11 సెక్టార్లుగా విభజించామన్నారు. అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన ప్రదేశాలలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్, బాపట్ల, చీరాల, రేపల్లె సీసీఎస్ డీఎస్పీలు రామాంజనేయులు, మొయిన్,శ్రీనివాసరావు, జగదీష్ నాయక్‌లు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ నారాయణ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


