
‘కొండవీటి కళారేఖ’ కావ్యావిష్కరణ
నరసరావుపేట ఈస్ట్: కొండవీడు పాలకుల సాహితీ సేవ, ప్రజారంజక పాలనను చారిత్రక పద్య కావ్యంగా తీసుకురావడం అభినందనీయమని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కల్లి శివారెడ్డి తెలిపారు. శ్రీనాథ సాహితీ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో విశ్రాంత ప్రిన్సిపాల్, పద్యకవి డాక్టర్ చేరెడ్డి మస్తాన్‌రెడ్డి రచించిన ‘కొండవీటి కళారేఖ’ చారిత్రక పద్య కావ్యాన్ని శివారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సాహితీలోకంలో డాక్టర్ చేరెడ్డి ధ్రువతారగా నిలిచిపోతారని కొనియాడారు. పుస్తక సమీక్షకులు డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి, డాక్టర్ మేళ్లచెర్వు భానుప్రసాదు మాట్లాడుతూ మస్తాన్‌రెడ్డి కలం పట్టి పద్యం రాయడం మొదలు పెట్టి 60 వసంతాలు నిండాయని తెలిపారు. ఆయన రచించిన ‘అఖండ యోగి’ పాఠకుల మన్ననలు పొందిందని పేర్కొన్నారు. కొండవీటి కావ్యరేఖ సైతం అందరి హృదయాలలో నిలిచిపోతుందని వివరించారు. అనంతరం గాయత్రీ పరివార్ సత్సంగ్, సంస్కృత సంధ్యా, సద్గురు కళాసమితి ఆధ్వర్యంలో డాక్టర్ చేరెడ్డి మస్తాన్‌రెడ్డిని పద్య కళానిధి బిరుదుతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శ్రీనాథ సాహితీ పరిషత్ కార్యదర్శి స్వర్ణ చినరామిరెడ్డి, ఆయా సంస్థల ప్రతినిధులు డాక్టర్ పోపూరి గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ వేదాంతం సత్య శ్రీనివాస అయ్యంగార్, పి.వి.ఎస్.ఆర్. ప్రసాదరావు పాల్గొన్నారు.