● మున్సిపల్ చట్టాలకు తూట్లు ● కమిషనర్ పులి శ్రీనివాసులు తీరుపై వైఎస్సార్ సీపీ సభ్యుల ధ్వజం ● మేయర్ రాజీనామా ఆమోదంపై కౌన్సిల్ నిర్వహణ! ● అసలు రాజీనామా ఫార్మెటే సరికాదు ● వైఎస్సార్ సీపీ సభ్యుల వాకౌట్ ● మెజార్టీ సభ్యుల మద్దతుతో మేయర్ రాజీనామా ఆమోదం
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి
నెహ్రూనగర్ (గుంటూరుఈస్ట్) : గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు రాజీనామాపై మున్సిపల్ చట్టాలను కాదని కమిషనర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) దుయ్యబట్టారు. ఈనెల 15న మేయర్ కావటి మనోహర్‌నాయుడు తన పదవికి రాజీనామా చేసి కలెక్టర్‌కు పంపిన విషయం తెలిసిందే. మేయర్ రాజీనామా ఆమోదం కోసం మంగళవారం కౌన్సిల్ హాల్‌లో అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. ముందుగా తాత్కాలిక మేయర్‌గా షేక్ సజీల తన నియామకానికి కారణమైన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆ తరువాత మేయర్ రాజీనామా ఆమోదానికి సభ్యుల అభిప్రాయాలు తెలియజేయాలని సజీల కోరారు. వెంటనే డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ మే యర్ రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపితే.. ఆ లేఖ ఆధారంగా కౌన్సిల్ ఎలా నిర్వహిస్తారు? అస లు కలెక్టర్ నగరపాలక సంస్థకు మేయర్ రాజీనామాపై ఏమని రాశారో చెప్పాలని సెక్రటరీని కోరారు.
మౌనం వహించిన సెక్రటరీ
డెప్యూటీ మేయర్ అడిగిన ప్రశ్నపై కౌన్సిల్ సెక్రటరీ మౌనం వహించారు. దీంతో వెంటనే కమిషనర్ పులిశ్రీనివాసులు అందుకుని సమాధానం చెప్పే యత్నం చేశారు. మేయర్ పదవికి మనోహర్ రాజీనామా చేస్తూ లేఖను మెయిల్ ద్వారా కలెక్టర్‌కు, కమిషనర్‌కు పంపారని, దీనిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారని కమిషనర్ వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మేయర్ రాజీనామాపై అత్యవసర కౌన్సిల్ నిర్వహణకు ఉన్న ఇద్దరు డెప్యూటీ మేయర్లలో ఒకరిని మేయర్‌గా ఎంపిక చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 17న మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఎంఏయూడీ శాఖకు లేఖ రాశామని, ఈ నెల 21న డెప్యూటీ మేయర్ షేక్ సజీలను తాత్కాలిక మేయర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. దీని ప్రకారం అత్యవసరం కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
మేయర్ రాజీనామా ఫార్మెట్ సరైంది కాదు
‘‘మున్సిపల్ చట్టం 92 (1) మేయర్ తన పదవికి రాజీనామా చేయాలంటే కౌన్సిల్ నిర్వహించి కౌన్సిల్‌లో రాజీనామాకు గల కారణాలను చర్చించిన తరువాత సభ్యుల ఆమోదంతో రాజీనామాను ఆమోదించాలి. లేదా కౌన్సిల్ సెక్రటరీకి రాజీనామాను పంపితే ఆ రాజీనామాకు అనుగుణంగా సెక్రటరీ అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ తరువాత రాజీనామాను ఆమోదించాలి. కానీ ఇక్కడ నగర కమిషనర్ కలెక్టర్‌కు పంపిన రాజీనామాను ఆధారం చేసుకుని కమిషనర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రభుత్వానికి లేఖ రాయడమేమిటి’’ అని డెప్యూటీ మేయర్ వజ్రబాబు ప్రశ్నించారు. దీనిపై తాము లీగల్ ఓపీనీయన్‌న్ తీసుకుంటామని.. అప్పటి వరకు మేయర్ రాజీనామా ఆమోదం కోసం ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ కౌన్సిల్ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం సభ నుంచి వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తరువాత తాత్కాలిక మేయర్ షేక్ సజీల మెజార్టీ సభ్యుల ఆమోదంతో మేయర్ మనోహర్ రాజీనామాను ఆమోదించారు.
అధికారపార్టీకి కమిషనర్ కొమ్ముకాస్తున్నారు మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు మేయర్ రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపడం ఆమోదయోగ్యం కాదు డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు ధ్వజం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు ధ్వజమెత్తారు. కౌన్సిల్ నుంచి వాకౌట్ చేసిన ఆనంతరం విలేకరులతో డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు మాట్లాడారు. కమిసనర్ అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని మేయర్లు, డెప్యూటీ మేయర్లను, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లను టీడీపీ కూటమి భయభ్రాంతులకు గురిచేస్తోందని, పచ్చజెండా పట్టుకుంటేనే పదవిలో కొనసాగుతారని ప్రలోభాలకు గురిచేస్తోందని విమర్శించారు. నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ సభ్యులు 46 మంది ఉంటే మెజార్టీ సభ్యులను తమ వైపునకు తిప్పుకుందని ధ్వజమెత్తారు. కమిషనర్ కూడా మున్సిపల్ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. మేయర్ తన రాజీనామాను కలెక్టర్‌కు పంపడం ఆమోదం యోగ్యం కాదని పేర్కొన్నారు. దీనిపై లీగల్ ఓపీనియన్ తీసుకుంటామని కౌన్సిల్ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చినట్టు పేర్కొన్నారు.
సొంత రాజ్యాంగం పులిమేసి!