ఎంపీ స్థానానికి ఆరుగురు నామినేషన్‌ | Sakshi
Sakshi News home page

ఎంపీ స్థానానికి ఆరుగురు నామినేషన్‌

Published Tue, Apr 23 2024 8:30 AM

- - Sakshi

గుంటూరువెస్ట్‌: గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి సోమవారం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డికి టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌ పెమ్మసాని, రవిశంకర్‌ పెమ్మసాని నామినేషన్‌ పత్రాలు అందజేశారు. వీరితోపాటు బొమ్మసాని ముత్యాలరావు (ఆల్‌ పీపుల్స్‌ పార్టీ), షేక్‌ ఖాజావలి (ఇండిపెండెంట్‌), మొహమ్మద్‌ ఖాజా మొయినుద్దీన్‌ చిష్టి పాషా (ఏపీ రాష్ట్ర సమితి) విష్ణురెడ్డి(బెంగళూరు నవ నిర్మాణ పార్టీ)లు నామినేషన్లు దాఖలు చేశారు.

క్షమాపణలు చెప్పిన పెమ్మసాని

గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ నామినేషన్‌ సందర్భంగా ఆయన అనుచరులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. దీంతోపాటు టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనచోదకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నామినేషన్‌ దాఖలు చేసిన వెంటనే వాహనచోదకులకు కలిగిన అసౌకర్యానికి పెమ్మసాని విలేకరుల ముందు క్షమాపణలు కోరారు.

పోలీసులపై దురుసు ప్రవర్తన

పెమ్మసాని చంద్రశేఖర్‌ నామినేషన్‌ సందర్భంగా కలెక్టరేట్‌లోకి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలీసులు ఆయనతోపాటు మరో నలుగురిని పంపారు. వెనుకనే మాజీ శాసనసభ్యులు ధూళ్లిపాళ్లు నరేంద్ర, తెనాలి శ్రావణ్‌కుమార్‌లు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని సున్నితంగా అడ్డుకుని నచ్చజెప్పబోయారు. వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. మరో రెండు నెలలపాటే మీ ఆటలంటూ కోపంతో ఊగిపోయారు. అయితే పోలీసులు మాత్రం సంయమనం పాటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement