● ఫూలింగ్‌కి ఇచ్చిన భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు ● జేబులు నింపుకుంటున్న తమ్ముళ్లు ● పట్టించుకోని మైనింగ్ ఇతర అధికారులు
తాడికొండ: రాజధాని ప్రాంతంలోని అనంతవరం గ్రామంలో అధికార పార్టీ నాయకులు అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. కొండ వెనుక ఉన్న ఫూలింగ్ భూముల్లో రాత్రివేళ గ్రావెల్ తవ్వకాలు చేసి అక్రమంగా తరలించడంతో సదరు రైతు లబోదిబోమంటున్నాడు. రాజధానిలో గ్రావెల్‌కు తీవ్ర డిమాండ్ ఉండటంతో అధికార పార్టీకి చెందిన నాయకులు రాత్రివేళ పొక్లెయిన్‌లు, ట్రాక్టర్లు, లారీలతో భారీగా మట్టి దందా కొనసాగిస్తున్నారు. ఈ గ్రావెల్‌ను అమరావతి మండలం వైకుంఠపురం ఇతర గ్రామాలకు తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. దీనిపై అటు మైనింగ్, రెవెన్యూ ఇటు పోలీసులు కూడా తొంగిచూసిన దాఖలాలు లేకపోవడంతో యఽథేచ్ఛగా ప్రభుత్వ సంపద తరలిపోతోంది. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


