అంధుల అక్షర శిల్పి | World Braille Day is observed every year on January 4 | Sakshi
Sakshi News home page

అంధుల అక్షర శిల్పి

Jan 4 2025 12:18 PM | Updated on Jan 4 2025 12:18 PM

World Braille Day is observed every year on January 4

అంధులు సైతం సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందేనన్న ఆశయంతో వారి విద్యార్జన కోసం ప్రత్యేక లిపిని రూపొందించిన అక్షర శిల్పి లూయీ బ్రెయిలీ. ఫ్రాన్స్‌లో ఒక మారుమూల గ్రామమైన కూప్‌వ్రేలో సైమన్, మోనిక్‌ దంపతులకు 1809 జనవరి 4న ఆయన జన్మించాడు. నలుగురు సంతానంలో చివరివాడు బ్రెయిలీ. ఆయన తల్లిదండ్రులు వృత్తి రీత్యా చర్మకారులు.

 లూయీ తన తండ్రితో కలిసి ఒక రోజు గుర్రపు జీన్లు తయారు చేసే దుకాణానికి వెళ్లాడు. అక్కడున్న పదునైన చువ్వ, కత్తులతో తండ్రిని అనుకరిస్తూ ఉండగా చువ్వ ఎగిరి వచ్చి లూయీ కంటిలో గుచ్చుకుంది. పేదరికం కారణంగా మంచి వైద్యం అందించలేక పోవటంతో కంటిచూపు మొత్తం పోయింది. తర్వాత  కొంతకాలానికే ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువై రెండవ కంటిచూపు కూడా పోయింది. అప్పుడు పిల్లాడి వయసు ఐదేళ్లు. అయితే అందరిలాగానే తన కొడుకు చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులు తమ పెద్ద పిల్లలతో పాటుగా లూయీని గ్రామంలో ఉన్న పాఠశాలకు పంపించారు. అక్కడ కొడుకు కనబరిచిన అద్భుత ప్రతిభను గమనించిన తండ్రి... చెక్కపై మేకులను అక్షరాల రూపంలో బిగించి వాటిని తాకడం ద్వారా అక్షర జ్ఞానం కలిగించాడు. అతడిలోని చదువుకోవాలనే పట్టుదలను, తెలివితేటల్ని చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యానికి లోనయ్యేవారు.

1821లో చార్లెస్‌ బార్బియర్‌ అనే సైన్యాధికారి తన సైనికులకు 12 చుక్కలతో నిగూఢ లిపిలో శిక్షణ ఇచ్చేవాడు. దాన్ని లూయీ అభ్యసించాడు. దానితో సంతృప్తి చెందకుండా ఆ లిపిపై పరిశోధనలు ప్రారంభించాడు. దాదాపు 11 సంవత్సరాల కృషి అనంతరం 1832లో సరళమైన విధానంలో చుక్కల లిపిని కనుగొన్నాడు. దానికి ఆయన పేరుమీదనే తర్వాత బ్రెయిలీ లిపి అని పేరొచ్చింది. ఇది ప్రస్తుతమున్న కంప్యూటర్‌ భాషకు వీలుగా ఆనాడే రూపొందిందంటే ఆయన ముందుచూపు ఎంతో అర్థమవుతుంది. 

బ్రెయిలీని క్షయ మహమ్మారి పట్టి పీడించటంతో నాలుగు పదుల వయసులోనే 1852 జనవరి 6న కన్నుమూశారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన లిపి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎంతోమంది అంధ వికలాంగులను విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, పత్రికాధిపతులుగా, సంగీత కళాకారులుగా, చిత్ర కారులుగా అనేక రంగాల్లో బ్రెయిలీ లిపితో అగ్రభాగాన నిలిచేట్లు చేసిన లూయీ బ్రెయిలీ అంధుల అక్షర ప్రదాతగా ఎప్పటికీ వెలుగొందుతూనే ఉంటారు.

– పి. రాజశేఖర్‌ ‘ ఆలిండియా జనరల్‌ సెక్రెటరీ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిఫరెంట్లీ ఏబుల్డ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (నేడు లూయీ బ్రెయిలీ జయంతి; జనవరి 6న వర్ధంతి) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement