Varsha Adusumilli: మహిళల వద్దకే ఉద్యోగాలు

Wonder Girls Varsha Adusumilli: Field Observation oF Women Employment, Key Facts - Sakshi

పదహారు శాతం అంటే... ప్రపం చంలో ఏ దేశంతో పోల్చి చూసినా భారతదేశంలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం అత్యల్పమనే! ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కోవిడ్‌కు ముందు ఈ శాతం 21గా ఉండేది. ఇందులో ఉన్న మరింత ప్రతికూలత ఏమిటంటే... ఉద్యోగాలలో మహిళల భాగస్వామ్యం ప్రాంత, వర్గ తారతమ్యం లేకుండా రెండిటిలోనూ ఒకే విధమైన అనిమిత్తతతో ఉండటం. గ్రామీణ ప్రాంతాల్లో కొంత నయం. పట్టణాల్లోనైతే ఉద్యోగ పంతం పట్టింపు లేనట్లే ఉంటుంది. ఇక సంపన్న స్థాయిలో వివాహిత మహిళల్లో 6.5 శాతం మాత్రమే ఉద్యోగాలలో కనిపిస్తుండగా ఈ శాతం అవివాహిత మహిళల్లో 15 శాతంగా ఉంది. ఈ స్వల్పశాతాలకు అనేకానేక కారణాలు దోహదం చేస్తుండవచ్చు. అందుకే దీన్నొక సమష్టి సమస్యగా చూడాలి తప్ప వ్యక్తిగత స్థాయిలో పరిష్కారానికి ప్రయత్నించలేం. 

ఎవరో కొంతమంది ప్రతిభావంతులైన, అవకాశాలున్న మహిళలు ఉద్యోగాలలోకి రావడం వల్ల మహిళా ఉద్యోగ భాగస్వామ్యంలో మెరుగుదల, పెరుగుదల ఏమీ కనిపించవు. సాధారణంగా ఉద్యోగ రంగంలో మహిళలు తక్కువగా కనిపించడానికి వ్యక్తిగత, సామాజిక, కుటుంబపరమైన కారణాలు అనేకం అవరోధంగా ఉంటాయి. మహిళలకు ఉద్యోగావకాశాలను, అనుకూలతలను కల్పించేందుకు పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు జరిగినప్పటికీ... పైన పేర్కొన్న అవరోధాల వల్ల వీటి ప్రభావం తక్కువగానే ఉంటుంది. మరేం చేయాలి? ‘వండర్‌ గర్ల్స్‌’ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ పరిస్థితిని మార్చగల కొన్ని పరిష్కార మార్గాలైతే కనిపించాయి. 

మొదటిది, ఉద్యోగాల ఉన్నతస్థాయిలలో ఆదర్శ ప్రాయంగా వెలుగొందుతున్న మహిళల నుంచి సమాజానికి ప్రేరణను అందించడం. అంటే వారి గురించి విస్తృతంగా తెలియబరచడం. సామర్థ్యాలను నిరూపించుకుంటూ విజయ పథంలో దూసుకువెళుతున్న మహిళామణుల గురించి పాఠశాల స్థాయి బాలికలకు, బాలురకు తెలిసే అవకాశం తక్కువ. పాఠ్యాంశాలలోనే ఆ మహిళల గురించి తెలియజేయడం వల్ల పిల్లల్లో లక్ష్యాలు ఏర్పడతాయి. ఈ విషయంలో తల్లిదండ్రుల చేయూత కూడా ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థినులలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అబ్బాయిలకు మహిళపట్ల గౌరవ భావం ఏర్పడుతుంది. అమ్మాయిల్ని ఉద్యోగాలకు ప్రోత్సహించే వాతావరణం కుటుంబాలలో ప్రారంభం అవు తుంది.

రెండోది, సంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను నిర్మించడం. సంరక్షణ అనే ప్రాథమిక మూలస్తంభం మీదనే మన ఆర్థికవ్యవస్థ నిలబడి ఉంది. శిశు సంరక్షణ, వృద్ధుల సంరక్షణ అనేవి శ్రమ, ప్రయాసలతో కూడినవి కనుక ఆ రంగం సహజంగానే మహిళలపై ఆధారపడవలసి వస్తుంది. డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ నాలుగు కోట్ల మంది భారతీయ మహిళలు సంరక్షణ రంగంలోనే పనిచేస్తున్నారు. సంరక్షణ రంగం ఆధునికం అయితే... ఇతర రంగాలలో మహిళల ఉద్యోగ భాగస్వామ్యం మెరుగయ్యే అవకాశం తప్పక ఉంటుంది.

మూడు, విధాన నిర్ణయాలు అనేవి స్త్రీ పురుష సమానత్వ దృక్కోణంలో మాత్రమే జరగాలి. దేశంలో మహిళల, ఆర్థిక రంగ స్థితిగతులపై సామాజిక శాస్త్రవేత్త దీపా నారాయణ్, భట్టాచార్య కలిసి ఇటీవల ఒక నివేదికను వెలువరించారు. సామాజిక అధ్యయనాలపై విస్తృత చర్చ, అవగాహన కల్పన జరగాలని ఆ నివేదికలో వారు సూచించారు. విధాన నిర్ణయాలు చేసేటప్పుడు అధికారంలో ఉన్నవారు... చర్చల్లో వెల్లడైన అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసు కోవాలని పేర్కొన్నారు. 

నాలుగోది, ఇంజనీరింగ్‌ విద్యలో ప్రస్తుతం ఉన్న లింగ వ్యత్యాసాన్ని తగ్గించేలా ఒక సమానత్వ వారధిని నిర్మించడం. పాఠశాల స్థాయిలో విద్యార్థినులు గణితం, సైన్సు సబ్జెక్టులలో ప్రతిభను కనబరుస్తున్న వాస్తవాన్ని విస్మరించకుండా... ఉన్నతస్థాయి ఇంజనీరింగ్‌ విద్య కోసం వారికి అవసరమైన ఆర్థిక వనరులను కల్పిస్తే సమానత్వ వారధి నిర్మాణానికి ఎంతో కాలం పట్టదు. ఐఐటీ సీట్ల కోసం లక్షల మందితో పోటీ పడాలి. తల్లిదండ్రులు లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. ఆడపిల్ల దగ్గరికి వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా ఆమెకు ఎంత ప్రతిభ ఉన్నా ఐఐటీకి వెళ్లే దారిలో వెనుకబడిపోతోంది. తనయుళ్లతో సమానంగా కూతుళ్లకూ డబ్బును ధారపోసి కోచింగ్‌ ఇప్పించే తల్లిదండ్రులెందరు?! అమ్మాయిని, అబ్బాయిని సమానంగా చూసినప్పుడు, చదివించినప్పుడు దీర్ఘకాలంలోనే అయినా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తప్పక కుదుట పడతాయి. 

ఐదు, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా పట్టణ ప్రాంత సదుపాయాలను వృద్ధి చేయడం. కార్యాలయాలు నగరానికి దూరంగా ఎక్కడో శివార్లలో ఉంటే అంత దూరం వెళ్లలేని యువతులు తమలో ఎంత నైపుణ్యం ఉన్నా దగ్గరల్లోని ఉద్యోగానికే మొగ్గు చూపుతారు. ఈ కారణంగా శివార్ల ఉద్యోగ కేంద్రాలకు నైపుణ్యాల కొరత ఏర్పడటమే కాకుండా, అక్కడికి వెళ్లలేని మహిళల సామర్థ్యాలు తక్కువ ప్రతిఫలంతో వృధా అయే ప్రమాదం ఉంటుంది. (క్లిక్‌: జాతీయ సంక్షోభంగా నిరుద్యోగం)

ఆరు, ఉద్యోగాలకు అవసరమైన డిజిటల్‌ శిక్షణను పొందేందుకూ మహిళలకు భద్రమైన వాతావరణం కల్పించాలి. డిజిటల్‌ విద్యను నేర్పించే వారు మహిళా అధ్యాపకులై ఉండటం అత్యవసరం. పెద్ద ఎత్తున్న శిక్షణ తీసుకోవడానికి మహిళలు ముందుకు వచ్చేందుకు అవసరమైన ‘సేఫ్‌ డిజిటల్‌ స్పేస్‌’ను నగరాలు అందుబాటులోకి తేవాలి. (క్లిక్‌: ‘ఫ్యామిలీ డాక్టర్‌’ అవసరం)

స్వీడన్‌ సంగీత పరిశ్రమకు ప్రసిద్ధి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గేయ రచయితలకు, ఆల్బమ్‌ నిర్మాతలకు నెలవు. ఆ ప్రాముఖ్యాన్ని నిలుపుకోవడం కోసం అక్కడి ప్రభుత్వం... సామాన్యులు కూడా సంగీతం వైపు ఉత్సాహంగా అడుగులు వేసేందుకు అవసరమైన సబ్సీడీలను ఇవ్వడమే కాకుండా, పాఠశాల విద్య తర్వాత సంగీత సాధనకు ఉచిత ప్రభుత్వ సంగీత పాఠశాలను నిర్మించింది. ఇక్కడ మనం స్వీడన్‌ను ఆదర్శంగా తీసుకోవచ్చు. ఉద్యోగ రంగానికి చేరువవడంలో భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సమస్యలకు పరిష్కారాలను అన్వేషించవచ్చు. ప్రజల్ని, ఫలితాల్ని మలిచేది వ్యవస్థే కదా! (క్లిక్‌: బాధ్యత అనుకుంటేనే ఫలం, ఫలితం!)

- వర్ష అడుసుమిల్లి 
‘వండర్‌ గర్ల్స్‌’ వ్యవస్థాపకురాలు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top