శాస్త్రీయ వ్యవసాయ ప్రణాళిక ఏది? | Sakshi
Sakshi News home page

శాస్త్రీయ వ్యవసాయ ప్రణాళిక ఏది?

Published Sat, Feb 3 2024 3:47 AM

What is Scientific Agricultural Planning - Sakshi

గత ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళికలను తయారు చేయకుండా రైతుల ఇష్టా నిష్టాలపై వ్యవసాయ ఉత్ప త్తులను సాగించింది. అంత కుముందు ఉన్న వ్యవసాయ ప్రణాళికలను 2021 –22 నుండి పూర్తిగా ఎత్తి వేసింది. మార్కెట్‌ ధరలను బట్టి రైతులు పంటలు పండించడమే తప్ప ప్రణాళికా బద్ధంగా వ్యవసాయ ఉత్పత్తి జరగలేదు. వ్యవసాయ ప్రణాళిక ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు చేయాలని జరిపిన ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకోలేదు. వరి, పత్తి పంటలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇతర పంటలకు ఇవ్వలేదు. రాష్ట్రంలో సాగుభూమి 163 లక్షల ఎకరాలు కాగా, వాస్తవంగా సాగుచేసింది 123 లక్షల ఎకరాలు మాత్రమే. అందులో యాసంగి 70 లక్షల ఎకరాలు మాత్రమే సాగయింది. అనగా వానాకాలం, యాసంగి కలిసి 200 లక్షల ఎకరాలు మాత్రమే సాగయింది. 

చాలామంది రైతులు చవిటి భూములలో కూడా పత్తి లాంటి పంటలు వేసి నష్టపోతున్నారు. ఏ భూమిలో ఏ పంటలు వేయాలన్నది భూసార పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలి. భూసార పరీక్షలు జరిపి రైతులకు ‘సాయిల్‌ హెల్త్‌ కార్డు’ ఇవ్వాలి. భూసార పరీక్షలు జరపడం గత పదేళ్లుగా అమలు చేయనందున రైతులు తమకు తోచిన పంటలు పండిస్తున్నారు. పప్పులు, నూనెలు, ముతకధాన్యాల ఉత్పత్తులు హెచ్చుతగ్గులకు గురవు తున్నాయి. ముతక ధాన్యాల ఉప ఉత్పత్తులు (రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు) దిగుమతులు చేసుకుంటున్నాము. 

ఒకవైపున జనాభా 1.9 శాతం పెరుగుతుండగా వ్యవసాయ భూమి విస్తీర్ణం తగ్గుతున్నది. పెరుగు తున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలు నిరంతరం పెరగాలి. ఇందుకుపంటల పరిశోధనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. 2014 తర్వాత నుంచి వ్యవసాయ పరిశోధనా ఫలితాలను కూడా దిగుమతి చేసు కున్నాము. మోన్‌శాంటో, డ్యూపాంట్, కార్గిల్, సింజెంటా, బేయర్‌ లాంటి సంస్థలు వ్యవసాయ పరిశోధనలు చేసి లాభాలు సంపాదిస్తున్నాయి.  రాష్ట్ర వాతావారణానికి అనుకూలంగా ప్రాంతీయంగా వ్యవసాయ పరిశోధనలు జరగాలి. ఇతర దేశాలలోని పరిశోధనా ఫలితాలను వినియోగించడం ద్వారాపంటల ఉత్పత్తులు దెబ్బతిని రైతులు నష్ట పోతు న్నారు. 

ప్రతి మూడువేల ఎకరాలకు ఒక ఏఈఓను (వ్యవసాయ విస్తరణాధికారి) నియమించాలని రైతులు ఆందోళన నిర్వహించారు. అయినప్పటికీ నేటికీ తగినంతమంది వ్యవసాయ అధికారులను గత ప్రభుత్వం నియమించలేదు. హార్టికల్చర్‌ శాఖలో 2179 పోస్టులకు గాను 901 ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయ శాఖలో 2,800 పోస్టులు ఖాళీలున్నాయి. రాష్ట్రంలో 1,167 గోదాముల ద్వారా 24.74 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 2014 వరకు 710 గోదాములలో 7.39 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. ఆ తర్వాత ప్రకటించిన 457 గోదాముల నిర్మాణం నేటికీ పూర్తికాలేదు. వ్యవసాయ ఉత్పత్తులను గ్రేడింగ్‌ చేసి బాక్సులు లేదా సంచులలో నింపి గోదాములలో నిల్వ చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి అదనపు ఆదాయం వచ్చేవిధంగా ప్రణాళికను రూపొందించి ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి.

వ్యవసాయ ప్రణాళికలో పంట రుణాలుఅత్యంత కీలకమైనవి. రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం బ్యాంకుల వాణిజ్య వ్యాపారంలో 40 శాతం వ్యవసాయ రంగానికి రుణాలివ్వాలి. అందులో 18 శాతం పంటరుణాలు ఇవ్వాలి. అందుకు తగినవిధంగా ప్రతి ఏటా మే నెలలో వ్యవసాయ రుణ ప్రణాళికను తయారుచేయాలి. కానీ వ్యవసాయ శాఖ ఆగస్టులో రుణప్రణాళికను విడుదల చేస్తున్నది. వ్యవసాయ బడ్జెట్‌ తగినంత కేటాయించకపోవడం వల్ల వ్యవసాయా భివృద్ధికి, నూతన టెక్నాలజీని వినియోగించడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. 2023–24లో రూ. 18,370 కోట్లు కేటాయింపులు చూపారు. కానీఇందులో రైతుబంధు రూ. 11,704 కోట్లు, రైతు బీమా రూ. 1,167 కోట్లు, వ్యవసాయ రుణమాఫీ రూ. 4,692 కోట్లు, మ్తొతం రూ. 17,565 కోట్లు కేటాయించారు.

ఈ పథకా లను మినహాయిస్తే వ్యవసాయానికి కేటాయించింది రూ. 807 కోట్లు మాత్రమే. వ్యవసాయ ప్రణాళికను శాస్త్రీయంగా రూపొందించడం వలన వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి రాష్ట్రంలో వాతావరణ అనుకూలత ఉంది. సమ శీతోష్ణ వాతావరణం వలన రాష్ట్రంలో విత్తనోత్పత్తితో పాటు వాణిజ్య పంటలకు, హార్టికల్చర్‌ పంటలకు అవకాశాలున్నాయి. వాతావరణాన్ని బట్టిపంటలు పండించేందుకు తగిన శిక్షణనివ్వాలి. ప్రభుత్వ రంగంలోని పరిశోధనా కేంద్రాలకు శాస్త్ర వేత్తలను, నిధులను కేటాయించి అధికోత్పత్తికి దోహదం చేయాలి.

- వ్యాసకర్త రైతుసంఘం తెలంగాణ ఉపాధ్యక్షులు
- సారంపల్లి మల్లారెడ్డి

Advertisement
Advertisement