పవన్‌ కల్యాన్‌ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో..

Telidevara Bhanumurthy Satire on Political Leaders Party Switchings in Telugu States - Sakshi

అట్లుంటది

లష్కర్ల రేల్‌ గాడి ఎక్కితె అద్ద గంటల మా వూర్కి బోవచ్చు. మా వూరు బోన్గిరి. బోన్గిరిల బాహర్‌పేటల మేము ఉండెటోల్లం. ఊల్లె నాకందరు సుట్టాలే. పొట్ట తిప్పలకు పట్న మొచ్చి యాభై ఏండ్లయితున్నది. బోన్గిరిల పోశమ్మ గుడి ఎదురుంగ మా ఇల్లున్నది. మా పక్కింట్ల యాద్గిరి మామ ఉన్నడు. మామ అంటె సంత మామ గాదు. వర్సకు మామ. పనిబడ్తె గాయిన పట్నమొచ్చిండు. పనంత అయినంక ఆనంద్‌ బాగ్ల ఉంటున్న మా ఇంటికొచ్చిండు. గాయినను సూడంగనే నాకు మా వూరును సూసినట్లనిపిచ్చింది. పట్నం మంచి చెడ్డ లర్సుకునే తంద్కు కుద్దు వూరే నడ్సుకుంట నాతాన్కి వొచ్చినట్లు గొట్టింది. ‘మామా! బాగున్నావె’ అని అడ్గిన. ‘బాగున్నర’ అని యాద్గిరి మామ అన్నడు. గా ముచ్చట గీ ముచ్చటైనంక గాయిన రాజకీయాలల్లకు దిగిండు.

‘ఏం మామా! ఎప్పుడు రాజకీయాలు మాట్లాడ్తవేందే?’
‘రాజకీయాలు గాన్ది ఏమన్న ఉన్నదా? రామాయనమంత రాజకీయమే. బారతమంత రాజకీయమే’ అన్కుంట యాద్గిరి మామ సిగిలేట్‌ ముట్టిచ్చిండు. ‘విబీషనుడు గోడ దుంకి రాముని దిక్కుకు వొచ్చిండు. గోడ దుంకె బట్కె అన్న జాగల లంకకు రాజైండు. గదే తీర్గ తెలుగు దేసం కెల్లి టీఆర్‌ఎస్లకు దుంకిన తలసాని, కాంగ్రెస్‌ కెల్లి దుంకిన సబితా ఇంద్రారెడ్డి అసుంటోల్లు మంత్రులయ్యిండ్రు. ఎలచ్చన్ల ముంగట గోడ దుంకుట్లు ఎక్వయితయి. గోడ దుంకె టోల్లందరు గల్సి విబీషనునికి గుడి గట్టియ్యాలె. గాయినకు మొక్కి నంకనే పార్టి ఫిరాయించాలె.’

‘బారతం సంగతేందే?’
‘గంత ఆత్రమైతే ఎట్లరా? కౌరవులు, పాండవుల నడ్మ జాగ పంచాతి అయింది. గా పంచాతిని తశ్వ జేసెతంద్కు కిష్నుడు ఒక్క తీర్గ కోషిస్‌ జేసిండు. గాయినెంత కోషిస్‌ జేసినా సూది మొనంత జాగ గుడ్క పాండవులకిచ్చే సవాల్లేదని దురియోదనుడన్నడు. దాంతోని పాలోల్ల నడ్మ విద్దమొచ్చింది. కర్నున్ని ఎవ్వలు లేని జాగలకు కిష్నుడు దీస్క బోయిండు. నువ్వు సూతుని కొడ్కువు గాదు. కుంతి కొడ్కువు. నువ్వు పాండవుల దిక్కుకొస్తివా అంటె పెద్దన్నా అన్కుంట గాల్లు నీ కాల్లు మొక్కుతరు. నిన్ను రాజును జేస్తరు అని కిష్నుడన్నడు. గాయిన ఎంత గనం జెప్పినా కర్నుడిన లేదు.

బీజేపీ దిక్కుకెల్లి ఇద్దరు సన్నాసి గాల్ల తోని ఇంకొకడు మొయినాబాద్‌ ఫాంహౌజ్‌కొచ్చిండ్రు. తలా నూరు కోట్ల రూపాయలే గాకుంట గనుల సుంటియి గుత్తకిప్పిస్తం అని ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతా రావు, హర్షవర్దన్‌ రెడ్డిలను బుద్గ రిచ్చినా గాల్లు గోడ దుంక లేదు. ఇక ముంగట ఎవలన్న గోడ దుంకుమని అంటె చెప్పుతోని కొడ్తమని అనుండ్రి అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లకు కేసీఆర్‌ జెప్పిండ్రు’ అన్కుంట యాద్గిరి మామ గిలాస్‌ నీల్లు దాగిండు.

‘ఆంద్ర సంగతేంది?’
‘ఆంద్రప్రదేస్ల పవన్‌ కల్యాన్‌ చెప్పు చేత్ల బట్కోని చెంగడ బింగడ ఎగురుతుండు. నాకు తిక్కుంది, గా దాన్కి లెక్క లేదు అన్కుంట శిగమూగుతుండు. విశాకపట్నం, చోళ హోటల్ల ప్రతాని మోదీని గల్సిండు. రొండు చేతులతోని చెప్పులు బట్కోని శిగమూగుత. ఒక చెప్పు మీరియ్యుండ్రి. ఇంకో చెప్పు చెంద్రబాబిస్తడు. చెప్పులను చేతులల్ల బట్టుకుంట. ముక్యమంత్రినైత అని అన్నడు.’

‘శానేండ్ల కింద ముక్యమంత్రి కుర్సి కోసం చిరంజీవి ప్రజా రాజ్జెం బెట్టిండు. గప్పుడు గాయిన పార్టి గుర్తు సూర్యుడు. అరచేతి నడ్డుపెట్టి సూర్య కాంతి నాపలేరన్నడు. గని గా అరచెయ్యే సూర్యున్ని మాయం జేసింది. ప్రజా రాజ్జెంను దీస్కబోయి కాంగ్రెస్ల గల్పిండు. గాయిన తీర్గనే పవన్‌ కల్యాన్‌ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో మామా’

‘కల్పినా కల్పొచ్చురా. పవన్‌ అనేటి పతంగిని చెంద్రబాబు ఎక్కిస్తున్నడు. వైఎస్సార్‌సీపీ మోదీ కాల్లు మొక్కుతున్నదని జనసేన లీడర్‌ బొలివేటి అంటె మల్లీ పారి అంటివా చెప్పు తెగుతది అని మల్లాది విష్ను అన్నడు. వారీ! నువ్వు కొల్వు ఇడ్సి పెట్టి పాత చెప్పుల దుక్నం బెట్టురా! రేల్‌ గాడికి సైమమైంది. వొస్తరా!’ అన్కుంట మామ బోయిండు. (క్లిక్ చేయండి: నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..)

తోక: మొన్న చాచా నెహ్రూ జయంతి అయ్యింది. ‘బాల్‌ దివస్‌ శుభాకాంక్షలు’ అని ఒక లీడర్‌కు జెబ్తె – ‘నా బాల్‌ (జుట్టు) నల్ల గున్నది’ అని గాయిన అన్నడు.


- తెలిదేవర భానుమూర్తి 
సీనియర్‌ జర్నలిస్ట్‌

Election 2024

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top