వాదోపవాదాల విషాదం

Sakshi Guest Column On Odisha Train Accident

రెండో మాట

రైల్వే సిగ్నల్స్‌ నిర్వహణ వ్యవస్థపై నిరంతరం కన్నువేసి, ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండకపోతే రైలు ప్రమాదాలు తరచూ సంభవించే అవకాశం ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నైరుతి రైల్వే ప్రధాన అధికారి హెచ్చరించారు! అలాగే, రైలు ప్రయాణికుల భద్రత గురించి ‘కాగ్‌’, పార్లమెంటరీ స్థాయీ సంఘం అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత కేంద్ర కమిటీలు, ఉన్నతస్థాయి విచారణ సంఘాల నివేదికలను అధికారులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? రైళ్లు ఢీకొనకుండా ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థను రూపొందించినా, బ్రాడ్‌గేజ్‌ రైల్వే మార్గాల్లో కాపలా లేని లెవెల్‌ క్రాసింగ్స్‌ను కూడా తొలగించినా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపాల్ని పరిష్కరించడానికి ప్రయత్నించే బదులు.. మంత్రులు రాజీనామాలు చేయాలని, కాదు కాదు... కింది తరగతి రైల్వే ఉద్యోగుల్ని, కార్మికుల్ని శిక్షించాలని వాదోపవాదాలకు దిగడం కూడా విషాదమే!

‘‘వందలాదిమంది ప్రయాణికుల దుర్మరణానికి దారి తీసిన ఒడిశా రైలు ప్రమాదానికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ శతాబ్దంలోనే ఇది అతి పెద్ద ప్రమాదం.’’
– ప్రధాని నరేంద్ర మోదీ (4.6.2023)

‘‘చాలాకాలంగా భారత రైల్వేలోని సిగ్నలింగ్‌ వ్యవస్థ నిర్వహణలో ఉన్న తీవ్రమైన లోపాల గురించీ, వైఫల్యాల గురించీ,  రైళ్ల రాకపోకలను తెలియజేసే గుర్తులను సూచించే సరైన పద్ధతుల గురించీ; రైలు బయలుదేరిన తరువాత, రైలు వెళ్లే దిశను మార్చవలసి వస్తే ఆ మార్పును సూచించే గుర్తును తెలిపే విధానం గురించీ స్పష్టంగా ఉంది. కానీ నిర్దిష్టమైన సిగ్నల్స్‌ను అనుసరిస్తూ లోపాల్ని తక్షణం సవరించకపోతే – రైలు దుర్ఘటనలు అనివార్యమవుతాయి...’’ అని కూడా నైరుతి రైల్వే ప్రధాన అధికారి ఈ ఏడాది ఫిబ్రవరి 9 న హెచ్చరించారు.

అంతేగాదు, రైల్వే సిగ్నల్స్‌ నిర్వహణ వ్యవస్థపై నిరంతరం కన్నువేసి, సరిదిద్దుకుంటూ ఉండకపోతే రైలు ప్రమాదాలు తరచూ సంభవించే అవకాశం ఉందని ఆ ఉన్నతాధికారి హెచ్చరించారు. అలాగే, రైలు ప్రయాణికుల భద్రత గురించి ‘కాగ్‌’, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదికల హెచ్చరికలను పాలకులు పెడచెవిన పెట్టడానికి కారకులెవరన్న ప్రశ్నలకూ సమాధానం లేదు!

ఈ పై కారణాలను పరిశీలించినప్పుడు ఎవరిని నిందించాలి? పాలకుల ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర కమిటీలు, దఫదఫాలుగా నియమించిన సాధికార ఉన్నతస్థాయి విచారణ సంఘాల నివేదికలను, వాటి సారాంశాన్ని అధికారులు ఎందుకు పాటించడం లేదన్నది అసలు ప్రశ్న. రైలు ప్రమాద ఘటన సందర్భంగా, మహబూబ్‌నగర్‌ వద్ద రైలు ప్రమాదంలో 112 మంది ప్రయాణికులు చనిపోయినందుకు విలవిలలాడిన నాటి కేంద్ర రైల్వే మంత్రి, గాంధేయవాది అయిన లాల్‌ బహ దూర్‌ శాస్త్రి తన పదవికి క్షణాలలో రాజీనామా చేసి ఆదర్శంగా నిలబడ్డారు. ప్రధాని పండిట్‌ నెహ్రూ ‘వద్దని’ వారించినా లాల్‌బహదూర్‌ రాజీనామాకే పట్టుబట్టారు! మహబూబ్‌నగర్‌ దుర్ఘటన తరువాత కొలది రోజులకే తమిళనాడులోని అరియలూర్‌ దుర్ఘటనలో 144 మంది చనిపోయారు. ఈ రెండు ఘటనలూ లాల్‌బహదూర్‌ను కుదిపేశాయి. 

68,100 కిలోమీటర్ల నిడివిగల రైల్వే లైన్లతో కూడిన భారత వ్యవస్థలో గత 15 ఏళ్లలో జరిగిన ప్రధాన దుర్ఘటనలు: జ్ఞానేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌ (మృతులు 148), ఉత్తర బంగా–వనాంచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ (63 మంది), ఛాప్రా–మథుర ఎక్స్‌ప్రెస్‌ (63 మంది), హుబ్లీ–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (25మంది), తమిళనాడు–ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ (30), యూపీ సంత్‌కబీర్‌–గోరఖ్‌ధామ్‌ ఎక్స్‌ప్రెస్‌ (25), డెహ్రాడూన్‌–వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్‌ (30), పాట్నా–ఇండోర్‌ ఎక్స్‌ప్రెస్‌ (150), బికనీర్‌– గౌహతి ఎక్స్‌ప్రెస్‌ (9 మంది), హౌరా–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ (140).

రైళ్లు ఢీకొనకుండా ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థను రూపొందించినా, బ్రాడ్‌గేజ్‌ రైల్వే మార్గాల్లో కాపలా లేని లెవెల్‌ క్రాసింగ్స్‌ను కూడా తొలగించినా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అదుపాజ్ఞల వ్యవస్థ పకడ్బందీగా లేనందున జరుగుతున్న ఈ వరస రైలు దుర్ఘటనల నివారణకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా అక్కరకు రావడం లేదు. అంటే సిబ్బందికి ఇచ్చే శిక్షణలో కూడా లోపం ఉందని పలువురు రైల్వే అధికారుల నోట కూడా వినవస్తోంది. కానీ ఈ తీవ్ర లోపాల్ని పరిష్కరించడానికి ప్రయత్నించే బదులు కింది తరగతి రైల్వే ఉద్యోగుల్నీ, కార్మికుల్నీ శిక్షించే మార్గాలను పాలకులు వెతకడానికి ప్రయత్నించడం సమంజసం కాదు. 

ఒకవైపున రైల్వేబోర్డే సిగ్నలింగ్‌లో లోపం వల్ల ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని చెబుతున్నప్పుడు, ప్రమాద కారణాల్ని కార్మిక సిబ్బందిపైకి నెట్టడానికి ప్రయత్నించడం సరి కాదు. ఆధునిక పరిజ్ఞానం ఆకళింపులో ఉన్నా మానవుల స్వయం పరిమితుల్ని కూడా గమనించుకోవాలి.

అక్కడికీ ఒక సీనియర్‌ రైల్వే అధికారి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు: ‘‘ఇంటర్‌ లాకింగ్‌లోని సాఫ్ట్‌ వేర్‌ లేదా హార్డ్‌ వేర్‌ పనిచేయడంలో సంభవించే లోపం వల్ల కూడా రైళ్లకు సూచించవలసిన లూప్‌లైన్, మెయిన్‌ లైన్‌ ఎంపికలో గందరగోళానికి అవకాశం ఉంది. అంటే సిగ్నల్‌ ఒకటై, స్విచ్‌ ఆపరేషన్‌ వేరైతే ఈ ప్రమాదానికి ఆస్కారం ఉంది (5.6.23). ఈ ఘోరానికి రైల్వేమంత్రి రాజీనామా పరిష్కారం కాకపోవచ్చుగాని, ఆ స్థానంలో మరొకర్ని విచారణ పేరిట తేలిగ్గా ఇరికించే అవకాశం ఉంది. ఇంతకూ మనిషి (మంత్రి కూడా మనిషే అయితే) స్వార్థం ఎలా పనిచేస్తుందో కవి ‘సినారె’కు బాగా తెలిసి నట్టుంది:
‘‘తోడుగ సాగే నీడను కూడా
వాడుకుంటుంది స్వార్థం
ఆపై వాణ్ణే పాచిక చేసే
ఆడుకుంటుంది స్వార్థం
మనిషిలోని ఆ చీకటి కోణం
మార్చే వేషాలెన్నో –
చిటికెడు పేరుకు నీతిని
నిలువున చీల్చేస్తుంది స్వార్థం
మూరెడు గద్దె కోసం
జాతి పరువునే ఆరవేస్తుంది స్వార్థం!’’

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top