మనుగడకు మరపు మంచిదే! | Sakshi
Sakshi News home page

మనుగడకు మరపు మంచిదే!

Published Wed, Aug 9 2023 12:38 AM

Sakshi Guest Column On Mewat Nuh clashes in Haryana

దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటంటే... మతం పేరుతో రెచ్చగొట్టేవారు, లేదా ఒక మతానికి చెందినవారికి అన్యాయం జరుగుతోందని వాదించేవారు మాత్రమే కనిపిస్తున్నారు. ఒక మతానికి సంబంధించిన చెడును కప్పిపెట్టేందుకు, లేదా ఇంకో మతంలోని చెడును ఎత్తిచూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల ఫలితం శూన్యం. కొన్ని తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నంలో చరిత్ర పుస్తకాలను తిరగరాయడం, లేదంటే ఎక్కువ చేసి చూపడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఊహించుకున్న తప్పులను మళ్లీ మళ్లీ తవ్వుకోవాలనుకునేవారు... మునుపటి తరాల తాలూకు కక్షలను కొనసాగించే అవకాశాలే ఎక్కువ. గతంలోని కొన్ని గుర్తుంచుకోవడం, కొన్నింటిని వదిలేయడం ద్వారా మాత్రమే దేశాల నిర్మాణం జరుగుతుంది.

హరియాణాలోని మేవాత్, నూహ్‌లో జరుగుతున్న ఘర్షణలు చూస్తూంటే... పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్‌ సింగ్‌ ఖైరాన్  గుర్తుకొస్తారు. 1950లలో ఖైరాన్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్‌ నుంచి వస్తున్న ముస్లిం కుటుంబాలను మేవాత్‌లోకి రానివ్వమని సూచనప్రాయంగా చెప్పిన వారిని ఉద్దేశిస్తూ చేసిన హెచ్చరిక అది. దేశ విభజన నేపథ్యంలో ఈ కుటుంబాలు పాక్‌కు వెళ్లాయి. 1950ల మధ్య కాలానికి చాలామంది మళ్లీ తమ స్వస్థలాలకు వచ్చేశారు. వేలమంది మేవాతీ ముస్లిం కుటుంబాలకు తమ సొంత ఆస్తులు మళ్లీ దక్కేలా ఖైరాన్ చర్యలు తీసు కున్నారు. ‘‘గతం తాలూకు శత్రుత్వాన్ని మరచిపోండి. మీ బాధలపై ఆధారపడి బతక్కండి’’ అని విభజన కారణంగా చెలరేగిన విద్వేష బాధితులైన సిక్కులు, హిందువులకు ఖైరాన్  పదే పదే చెప్పేవారు.

కొన్ని గుర్తుంచుకోవడం, కొన్నింటిని వదిలేయడం ద్వారా మాత్రమే దేశాల నిర్మాణం జరుగుతుంది. గతాన్ని గుర్తుంచుకోలేని వారు ఆధారం లేనివారవుతారు. బానిస బతుకులు బతికినవారు కూడా ఉజ్వల భవిష్యత్తును కాంక్షించే సందర్భంలో తమ మూలాలను తరచిచూస్తారు. లేదంటే మూలాలను కల్పించుకుంటారు. అదే సమ యంలో గతాన్ని ఏమాత్రం మరచిపోనివారు లేదా ఊహించుకున్న తప్పులను మళ్లీ మళ్లీ తవ్వుకోవాలనుకునేవారు... మునుపటి తరాల తాలూకూ కక్షలను కొనసాగించే అవకాశాలే ఎక్కువ.

మన పాత తరాలు నిర్దిష్ట సామాజిక కూర్పుల్లో బతికాయి. ఈ కూర్పులు సాధారణంగా చాలా చిన్నస్థాయిలో ఉండేవి. ముఖాముఖి పరిచయాలు, ఒకరంటే ఇంకొకరికి నమ్మకం వంటివి ఈ కూర్పు తాలూకూ లక్షణాలు. చాలా ప్రాథమిక గుర్తింపుల ఆధారంగా ఈ నిర్మాణం జరిగింది. ఈ కూర్పులో లేనివారితో వ్యవహారం ప్రమాద కరమన్నది వారి అవగాహన. రూపురేఖల్లేని ఆధునికత ఆస్తిత్వంలోకి రావడంతో ఈ అవగాహనలన్నీ మారిపోయాయి. 

ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధం ఏర్పడేందుకు చాలా సులువైన మార్గం ముఖాముఖి మాటలు, వ్యవహారాలే. ఇలాంటి బంధాలు, తద్వారా ఏర్పడ్డ సామాజిక వర్గాలు సహజంగానే చిన్న సమూహా లుగానే ఉంటాయి. ఇతరులపై వీరి ప్రభావమూ పెద్దగా కనిపించదు. అయితే జాతి, రాష్ట్రమన్న భావనలు ఆవిర్భవించిన తరువాత, ఆధు నిక సమాజం తన మునుపటి దానికంటే విస్తృత స్థాయికి చేరేందుకు అవకాశం కల్పించిన ప్రాథమిక బంధాల విలువ తగ్గిపోయింది.

ఆధునిక ప్రపంచ చరిత్ర మొత్తం గతకాలపు అస్తిత్వాలను అణచి పెట్టడం, రూపురేఖల్లేని వ్యవస్థల నిర్మాణమనే చెప్పాలి. ఈ వ్యవస్థలే వ్యక్తులు తమ ప్రాథమిక అస్తిత్వాల బంధాలను తెంచుకుని స్వేచ్ఛగా ఉండేందుకు వీలు కల్పించాయి. అలాగే పాతకాలపు సామాజిక కట్టు బాట్లు మనుషులను తమ బానిసలుగా చేసుకోకుండా నిలువరించాయి. ఈ వ్యవస్థలన్నింటికీ ఆధారం ‘నేషన్  స్టేట్‌’. (క్లుప్తత కోసం ప్రభుత్వం అనుకుందాం.) పాతకాలపు సామాజిక ఏర్పాట్లకు కాకుండా ప్రభుత్వ వ్యవస్థకు లొంగిన వ్యక్తులు నేషన్  స్టేట్‌లో ప్రాథ మిక భాగస్వాములు. బల ప్రయోగంతో నేషన్ స్టేట్‌ను ఏర్పాటు చేయడం అసాధ్యం. 

ఇది మనదన్న భావన కల్పించడం బలం వల్ల సాధ్యం కాదు. సహజసిద్ధంగా మనుషుల అంతరాంతరాళాల నుంచి పుట్టుకు రావాల్సిన ఫీలింగ్‌ అది. ఆసక్తికరమైన ఇంకో విషయం ఏమిటంటే, నేషన్  స్టేట్‌కు, వ్యక్తికి మధ్య బంధం బలపడటంలో వ్యక్తులు కనుమ రుగు అవుతారన్న భయముంటుంది. ఈ భయంతోనే చాలామంది ఉదార వాదులు కూడా అందరి మంచిని పణంగా పెట్టి మరీ పాత కాలపు సామాజిక కూర్పులవైపు మొగ్గు చూపుతూంటారు. పాతకాలపు సామాజిక ఏర్పాట్లలో శక్తిమంతమైనది మతం అన్నది మరచిపోరాదు.

ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు వ్యవస్థీకృతమైన మతం ఉపయోగపడుతుంది. ఒక పరమార్థం, ఒక నమ్మకాన్ని కూడా ప్రజలకు ఇచ్చే మతం ఎప్పుడూ ప్రభుత్వం తదితర వ్యవస్థలకు గట్టి పోటీ దారు. భారత్‌లో ప్రభుత్వ వ్యవస్థలకు సవాళ్లు రాజకీయపరమైన ఇస్లాంతో ముడిపడి ఉన్నాయి. ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్లలో దేశంలోని ఇస్లామిస్టులు స్వయం పాలన పొందాలంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల మాదిరిగానే మతం ఆధారంగా దేశాల నిర్మాణం జరగాలని కాంక్షించారు.

ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అసలు చదవనే లేదని గర్వంగా చెప్పుకొనే మౌలానా మొహమ్మద్‌ అలీ ‘ద కామ్రేడ్‌’ వార్తా పత్రికలో ఒక కథనం రాస్తూ ఇదే అంశాన్ని ప్రతిపాదించారు. అయితే ఇది దేశ విభజనకు దారితీసే స్థాయిలో ముస్లింలలో వేర్పాటువాదాన్ని సృష్టిస్తుందని ఆయన ఊహించలేకపోయారు. 

వాస్తవం ఏమిటంటే, భారత్‌లో ఇష్టమైన మతాన్ని ఆచరించే స్వేచ్ఛపై ఎప్పుడూ నియంత్రణ లేదు. విభజన ఘర్షణల తరువాత కూడా రాజ్యాంగ మండలి చర్చల్లో మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దేశం అందరిదీ కాబట్టి మత స్వేచ్ఛ కూడా దానంతట అదే వచ్చినట్లేనని అనుకున్నారు. మత ప్రచారమన్న విషయానికి వస్తే మండలి సభ్యులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

హిందూ మతంలో మతమార్పిడన్న భావన లేదనీ, మత ప్రచారానికి అనుమతిస్తే హిందూమతం అంతమైపోతుందనీ వాదించారు. దీనిపై ఇతర సభ్యులు పాకిస్తాన్  ఏర్పాటును ఉదాహరణగా చూపుతూ, ఇండియాలో ముస్లింలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వంపై ఉన్న అపోహలను తొలగించాలంటే మత ప్రచార హక్కును కల్పించవచ్చునని అభి ప్రాయపడ్డారు. చివరకు ఇదే కార్యాచరణకు వచ్చింది. 

దేశంలో ప్రస్తుతం, మతం పేరుతో రెచ్చ గొట్టేవారు లేదా ఒక మతానికి చెందినవారికి అన్యాయం జరుగుతోందని వాదించేవారు మాత్రమే కనిపిస్తున్నారు. ఒక మతానికి సంబంధించిన చెడును కప్పి పెట్టేందుకు లేదా ఇంకో మతంలోని చెడును ఎత్తి చూపేందుకు ప్రయ త్నాలు జరిగాయి. కొన్ని తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నంలో చరిత్ర పుస్తకాలను తిరగరాయడం లేదా ఎక్కువ చేసి చూపడం వల్ల ఒరిగిందేమీ లేదు. ఒక్కసారి ప్రజలు నిర్ణయించుకుంటే... వాస్తవాలను మరు గున బెట్టి లేదా అబద్ధాలు చెప్పడం ద్వారా వారిని మార్చలేము. 

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యూరప్‌ చరిత్రను అర్థం చేసుకుని భారతదేశం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. దేశంలోని వైవిధ్యతపై విపరీతమైన నిబద్ధత కలిగి ఉండటం గురించి ముందుగా అర్థం చేసు కోవడం మంచిది. వైవిధ్యత మనకు మాత్రమే సొంతమని అనుకుంటూ ఉంటాం. కానీ చరిత్ర మొత్తమ్మీద ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఈ వైవిధ్యత ఉందన్నది మరచిపోతూంటాం. మనకు ఇది నమ్మబుద్ధి కాకపోవచ్చు. కానీ యూరప్‌లో చాలా శతాబ్దాలపాటు తమ మతగ్రంథాలను సొంతంగా చదివే స్వేచ్ఛ ఉండాలా, వద్దా? అన్న విషయంపైనే గొడవలు జరిగేవి.

మతగురువులు మత గ్రంథాలపై ఇచ్చే వివరణ సరిపోతుందన్నది ఒక వర్గం వాదన. ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకోవడం, సమాజ స్థాయి విస్తరించడంతో యూరోపియన్లు ఇలాంటి గొడవల నుంచి దూరం జరిగేందుకు కొన్ని దారులు వెతుక్కున్నారు. మరి యుగాల కాలం కొనసాగిన పగలేమ య్యాయి? ఒక వర్గం మరోదానిపై చేసిన చారిత్రక తప్పిదాల మాటే మిటి? ఆధునిక దేశం ఒకటి ఏర్పడిన తరువాత వాటన్నింటిని పట్టించుకోలేదు లేదా మరచిపోయారు. ఇలా అన్ని తెలిసి కూడా వాటిని మరచిపోవడం లేకపోతే ఇరు వర్గాలకు అనువైన మార్గంలో ముందుకు పోయేందుకు మరో దారి లేనేలేదు!

ఎం. రాజీవ్‌ లోచన్  
వ్యాసకర్త చరిత్రకారులు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement
Advertisement