సైద్ధాంతిక శూన్యతను పూరించేందుకే... | Sakshi
Sakshi News home page

సైద్ధాంతిక శూన్యతను పూరించేందుకే...

Published Sat, Sep 10 2022 2:15 PM

Puvvada Ajay Kumar Write On KCR National Political Entry, Ideological Void - Sakshi

నాడు తెలంగాణ ఉద్యమం లాగా నేడు దేశం సమర్థవంతమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నది. మోదీ–షా నేతృత్వం లోని బీజేపీ పాలనలో భారతదేశం తన మూలసూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకి కత్వం, సమాఖ్యతత్వాన్ని పోగొట్టుకునే దుర్దశలో ఉంది. దేశాన్ని కాపాడుకోవటం, మూసదోరణులను విడిచిపెట్టి నవ్య మార్గాన అభివృద్ధి చేయటం తక్షణ అవ సరం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఒక కొత్త ఎజెండాకు రూప కల్పన చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నాడు అడ్డుకోవటానికి చిట్టచివరి క్షణం వరకూ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించిన శక్తులు... ఆ తర్వాత కొత్త రాష్ట్రాన్ని ఎలా నగుబాటు చేయాలా అన్నదానిపై దృష్టి పెట్టాయి. తెలంగాణలోనే పుట్టినప్పటికీ, జన్మభూమి మీద ఎంతమాత్రం మమకారం లేని కిరాయి వ్యక్తులను ఉపయోగించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్రలు జరిపాయి. కరెంటు, సాగునీరు వంటి మౌలిక రంగాల్లో సహాయ నిరాకరణకు దిగాయి. ఇన్ని దాడులనూ అక్షరాలా ఒంటి చేత్తో ఎదుర్కొని, ఆ కుట్రలను బద్దలు చేశారు కేసీఆర్‌. ఇటీవల పలు సమావేశాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న భూమి, జల వనరులు, విద్యుత్తు, వ్యవసాయం, నిరుద్యోగం, జీడీపీ, స్వాతంత్య్రా నంతరం దేశాన్ని పాలించిన పార్టీల విధానాలు... మొదలైన అంశాలపై గణాంకాల సహితంగా వివరిస్తున్నప్పుడు కేసీఆర్‌ తెలంగాణ కోసం ఎంత లోతైన అధ్యయనం చేశారో దేశ పరిస్థి తుల గురించి కూడా అంతే సీరియస్‌గా ఆలోచిస్తున్నారని ఆయ నతో సన్నిహితంగా గడిపిన నాలాంటి వాళ్ళకు అర్థమయింది.

కేంద్రం కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతున్న విధానాలు, ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వంటి విషయాలపై సీఎం ఘాటుగా స్పందిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మరోరకంగా వ్యవహరిస్తున్న వివక్షను ఎండగడుతున్నారు. దేశానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న నాయకుడు నేతృత్వం వహించాల్సిన అవసరం ఏర్పడింది. మతం పేరిట యాగీ చేస్తూ సంక్షేమాన్నీ, అభివృద్ధినీ పట్టించుకోని బీజేపీ ద్వంద్వ నీతిని ప్రజలు గ్రహించారు. ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డను ప్రాధాన్యతగా పెట్టుకొని సేవ చేసే వ్యక్తులు దేశాన్ని పరిపాలించాలని జనమంతా కోరుకుంటున్నారు. (క్లిక్ చేయండి: విమోచన కాదు, సమైక్యత!)

కలగూర గంప వ్యవహారాలతో, రాజకీయ అధికారం వస్తుందేమో గానీ, దేశాన్ని మార్చటం సాధ్యపడదు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాల మీద, సనాతన ధర్మం మీద పూర్తి అవగాహన ఉన్న ఒకే ఒక్క  నాయకుడు కేసీఆర్‌. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆయనకున్న అసాధారణ ప్రతిభ, పట్టు, సమస్యల మీద పోరాడగల ధీర గుణం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయని పలువురి అభిప్రాయం. పరాజయాల పరంపరను పక్కన పెట్టినా, వేగంగా నిర్ణయాలు తీసుకోలేని కాంగ్రెస్‌ పార్టీ నిష్క్రియాపరత్వం, ఆ పార్టీ నాయకత్వం ఎవరి చేతిలో ఉన్నదో కూడా తెలియని విషాద పరిణామం ఆ పార్టీని బ్రెయిన్‌ డెడ్‌ స్థితికి చేర్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్‌ లాంటి నాయకుడి ప్రత్యామ్నాయ ఎజెండాను బలపరచి దేశ రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ, సైద్ధాంతిక శూన్యతను పూరించడం ఒక చారిత్రక అనివార్యత. (క్లిక్ చేయండి: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర)


- పువ్వాడ అజయ్‌ కుమార్‌ 
తెలంగాణ రవాణా శాఖ మంత్రి

Advertisement
 
Advertisement
 
Advertisement