September 17th: విమోచన కాదు, సమైక్యత!

Celebrate September 17 As National Integration Day Not Liberation - Sakshi

ప్రతి ఏడాదీ సెప్టెంబర్‌ 17కు ముందు మొదలయ్యే చర్చ ఈసారి మరింత తీవ్రమైంది. హైదరాబాద్‌ విమోచనా దినంగా ఏడాది పొడవునా సంబరాలు జరుపుతామని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఐక్యతా విగ్రహం’ పేరిట భారీ సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాన్ని విముక్తి విగ్రహం అని ఎందుకు అనలేదు? సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరితో ముస్లిం జనాభాను రెచ్చగొట్టవచ్చు. కానీ పాత గాయాలను మర్చిపోవడంలో, రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. అందుకే విలీనమా, విమోచనా అనే ప్రశ్నలను దాటి సమైక్యత అనే సమాధానం దగ్గర స్థిరపడటమే ఇప్పుడు మనకు కావలసింది!

తెలంగాణలో సెప్టెంబర్‌ 17... ఆరెస్సెస్‌/ బీజేపీ చుట్టూ సమీకృతమవుతున్న హిందుత్వ శక్తులకూ, విస్తృతార్థంలో ఉదార ప్రజాస్వామ్య వాదులైన ఇతరులకూ మధ్య రాజకీయ వివాదం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజును హైదరాబాద్‌ విమోచనా దినంగా నిర్ణయించడంతో పాటు, 2023 సెప్టెంబర్‌ 17 వరకు ఏడాది పొడువునా సంబరాలు జరుపుతామనడంతో ఈసారి ఆరోజు మరింత స్పర్థాత్మకంగా మారింది. బహుశా ఆ పార్టీ చివరి నిజాం ఉస్మాన్‌ అలీ ఖాన్‌ రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన దినంగా భావిస్తూం డవచ్చు. అదే సమయంలో ఆరెస్సెస్‌/బీజేపీ జాతీయ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి, జాతీయ సమైక్యతా దినాన్ని సెప్టెంబర్‌ 16 నుంచి ఏడాదిపాటు జరుపుకోవాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

ఆరెస్సెస్‌/బీజేపీ తొలినుంచీ నిజాం పాలనను రాచరిక పాలనగా కాకుండా హిందువులపై ముస్లింల పాలనగా చూస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ దూకుడుతో కూడిన ముస్లిం వ్యతిరేక వైఖరి నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ రోజును జాతీయ సమైక్యతా దినంగా అధి కారికంగా జరపాలని నిర్ణయించింది. మోదీకి వ్యతిరేకంగా తనను తాను జాతీయ నేతగా కేసీఆర్‌ ప్రదర్శించుకుంటున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో సెప్టెంబర్‌ 17ను విద్రోహ దినంగా పిలుస్తున్న కమ్యూనిస్టులను పట్టించుకునే వారే లేరు.

జునాగఢ్‌ సంస్థానాన్ని అక్కడి ముస్లిం పాలకుడు మూడవ ముహమ్మద్‌ మహబత్‌ ఖాన్‌జీ పాకిస్తాన్‌లో కలిపేస్తున్నట్లు ప్రకటించి, చివరకు పాకిస్తాన్‌కు పారిపోయాడు. దీంతో భారతదేశంలో విలీన మైన చిట్టచివరి రాష్ట్రంగా జునాగఢ్‌ నిలిచింది. కానీ ఆరెస్సెస్‌/బీజేపీ కూటమి దీని గురించి ఎంతమాత్రమూ మాట్లాడటం లేదు. నాడు దేశ ఉప ప్రధానిగానూ, హోంమంత్రిగానూ ఉన్న సర్దార్‌ పటేల్‌ నిర్ణయా త్మకమైన నాయకత్వంలో హైదరాబాద్‌ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనం కావడంపై పూర్తి స్థాయి చర్చ జరగాల్సి ఉంది. కశ్మీర్‌ తర్వాత హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన నేపథ్యంలో జాతీయ సమైక్యత అంశంపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవ సరం ఉంది. దేశం నడిబొడ్డున భంగకరమైన సంస్థానాన్ని వదిలేయ కుండా భారతదేశం ప్రస్తుత రూపంలోని రాజ్యాంగబద్ధమైన యూని యన్‌గా 1948 సెప్టెంబర్‌ 17 నుంచి ఉనికిలోకి వచ్చింది.

భారత యూనియన్‌లో కశ్మీర్‌ 1947 అక్టోబర్‌ 27న చేరిందని అందరికీ తెలిసిన సత్యమే. వాస్తవానికి కశ్మీర్, హైదరాబాద్‌ సంస్థా నాలు స్వతంత్ర దేశాలుగా ఉండాలని అనుకోగా, జునాగఢ్‌ రాజు పాకిస్తాన్‌తో కలిసిపోవాలని నిశ్చయంగా కోరుకున్నాడు. సర్దార్‌ పటేల్, ఆనాడు హోంశాఖ కార్యదర్శిగా ఉన్న వీపీ మీనన్‌ నిర్వహిం చిన దౌత్య చర్చల ఫలితంగా మిగిలిన సంస్థానాలు భారత్‌లో విలీన మయ్యాయి. సంప్రదింపులు జరిపే సామర్థ్యంలో మీనన్‌ ప్రసిద్ధుడు.

కశ్మీర్‌ అనేది హిందూ రాజు ఏలుబడిలోని ముస్లింలు మెజా రిటీగా ఉన్న రాజ్యం. అదే హైదరాబాద్‌లో హిందువులు మెజారిటీగా ఉండగా, ముస్లిం రాజు పాలనలో ఉండేది. దేశ విభజన సందర్భంగా భారత్‌ నుంచి పశ్చిమ పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ విడిపోయిన తర్వాత కశ్మీర్, హైదరాబాద్‌లను భారత యూనియన్‌లో కలుపుకోవడంపై నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండేది. దేశం లోపల గానీ, సరిహద్దుల మీద గానీ ఇతర దేశాలు లేకుండా భారత్‌ ఒక సార్వభౌ మాధికార, స్వతంత్ర దేశంగా ఇలాంటి సమైక్యత ద్వారానే ఉనికిలో ఉండగలుగుతుంది. కశ్మీర్‌ భారత సరిహద్దులోని సమస్యాత్మక ప్రాంతంగా కనిపించగా, హైదరాబాద్‌ సంస్థానం కేంద్రానికి మరింత పెద్ద సమస్యగా ఉండేది. ఈ సమస్య పట్ల నెహ్రూ, పటేల్‌ చాలా తీవ్ర దృష్టితో ఉండేవారు. హైదరాబాద్‌ సంస్థానం విలీనం కాకపోయి నట్లయితే, భారతదేశానికి అర్థమే మారిపోయి ఉండేది.

ఆరెస్సెస్‌ కూడా హైదరాబాద్‌ సంస్థానానికి సంబంధించి అలాంటి విలీనమే జరగాలని కోరుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్‌ సంస్థానాన్ని తన సాయుధ పోరాటానికి ప్రయోగాత్మక స్థావరంగా చేసుకుంది. హైదరాబాద్‌ ముస్లిం సంస్థానం కాబట్టి ఆరెస్సెస్‌ దాని మనుగడకే వ్యతిరేకంగా ఉండేది. కానీ ఆరోజుల్లో ఆరెస్సెస్‌ గుర్తించదగిన శక్తిగా ఉండేది కాదు. ప్రారంభం నుంచీ వారి జాతీయవాదం ముస్లిం వ్యతిరేక ఎజెండా చుట్టూనే తిరుగుతుండేది. 

భౌగోళికంగా ఐక్యమైన, పాలనకు అనువైన దేశాన్ని పాలక పార్టీగా కాంగ్రెస్‌ కోరుకుంది. పోలీసు చర్య తర్వాత హైదరాబాద్‌ సంస్థానం విలీనమయ్యాకే అలాంటి దేశం ఏర్పడింది. కశ్మీర్, జునా గఢ్, హైదరాబాద్‌ సంస్థానాల్లో అనేక మరణాలు, హింసకు దారి తీసేటటువంటి బలప్రయోగం జరపడం కేంద్ర ప్రభుత్వానికి అవసర మైంది. అది పూర్తిగా మరొక గాథ!

ప్రతి సంవత్సరం ఈ అంశంపై ఆరెస్సెస్‌/బీజేపీ రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుండటంతో, చాలాకాలం ఊగిసలాట తర్వాత టీఆర్‌ఎస్‌ ఈసారి ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య పెరిగిన విభేదాలతో 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపును ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగిపోయింది. సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరిని చేపడితే తెలంగాణలోని 15 శాతం ముస్లిం జనాభాను రెచ్చగొట్టి, వారిని లక్ష్యంగా చేసుకుని వేధించవచ్చు. అయినా 1948 సెప్టెంబర్‌ 17న ఏం జరిగిందని? భారత యూనియన్‌లోకి మరో సంస్థానం విలీన మైంది. అంతే కదా!

‘ఐక్యతా విగ్రహం’ పేరిట గుజరాత్‌లో భారీ సర్దార్‌ పటేల్‌ విగ్ర హాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రతిష్టించారు. జునాగఢ్, హైదరా బాద్, కశ్మీర్‌లను విశాల భారత్‌లో ఐక్యం చేయడానికి బాధ్యుడు పటేల్‌. మరి ఆయన విగ్రహానికి విముక్తి విగ్రహం అని ఎందుకు పేరు పెట్టలేదు? మరే హోంమంత్రి అయినా ఇతర సంస్థానాలను సుల భంగా విలీనం చేసేవారు. కానీ ఈ మూడు సమస్యాత్మక సంస్థానా లను విలీనం చేయడంలోనే పటేల్‌ గొప్పతనం ఉంది. ఈ ఒక్క కారణం వల్లే కాంగ్రెస్‌ శిబిరం నుంచి సర్దార్‌ పటేల్‌ను లాగి, ఆయనను ఆరెస్సెస్‌/బీజేపీ తమ ఘన చిహ్నంగా రూపొందించు కున్నాయి. నెహ్రూ లాగా వంశపారంపర్య సమస్యలు ఏమీ లేని అతి పెద్ద శూద్ర వ్యవసాయ నేపథ్యం కలిగిన వాడు కాబట్టే పటేల్‌ చుట్టూ రాజకీయ, ఆర్థిక పెట్టుబడిని ఆరెస్సెస్‌/బీజేపీ ఖర్చు చేస్తున్నాయి.

తెలంగాణ ప్రజలు, ఇతర పార్టీలు ఒక సామూహిక సంక ల్పంతో సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపు కోవడమే సరైనది. అప్పుడు మాత్రమే ఈ సమస్య చుట్టూ ఉన్న మత పరమైన ఎజెండాను సామూహికంగా పాతరేయవచ్చు. హైదరాబాద్‌ చేరిక ఒప్పందంపై ఇరువురూ సంతకాలు చేశాక సర్దార్‌ పటేల్, నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ పక్కపక్కనే నడుచుకుంటూ వెళుతున్న చక్కటి ఫొటోగ్రాఫ్‌ కనబడుతుంది. పైగా జునాగఢ్‌ పాలకుడిలా కాకుండా, ఉస్మాన్‌ అలీఖాన్‌ భారత్‌లోనే చివరివరకూ ఉండిపోయారు. ఆయన గానీ, ఆయన కుటుంబం గానీ పాకిస్తాన్‌ పట్ల ఎన్నడూ విశ్వాసంతో లేరు. ఆయన కుటుంబ ఆస్తిలో చాలా భాగాన్ని భారత యానియన్‌కే ఇచ్చేశారు. ఢిల్లీలోని సుప్రసిద్ధమైన హైదరాబాద్‌ హౌజ్‌ కూడా భారత ప్రభుత్వానికి నిజాం ఇచ్చిందే. అమృతోత్సవాలుగా పిలుస్తున్న ఈ కాలంలోనూ నిజాంనూ, ముస్లిం సమాజాన్నీ దూషించడం ఎందుకు?

పాత గాయాలను మర్చిపోవడంలో రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. జాతీయవాదం అంటే స్వాతంత్య్ర పూర్వ కాలపు గాయాలను మళ్లీ కెలికి, వాటిపై కారం పూయడం కాదు. జాతీయవాదం అంటే ప్రజలు నిత్యం కొట్టుకునేలా చేయడం కాదు. ఈ సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపుకొందాం. సర్దార్‌ పటేల్‌కూ, ఆనాటి సమరంలో అన్ని వైపులా మరణించిన అమరులకు నివాళులు అర్పిద్దాం.

- ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్‌
ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top