Polavaram Project: పడిలేచిన కెరటం... ‘పోలవరం’

Polavaram Project Work Progressing Rapidly: C Ramachandraiah - Sakshi

‘పోలవరం’ ప్రాజెక్టు తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం. 2005లో నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖర రెడ్డి చొరవతో 1941 నుంచి కాగితాలకు, శంకుస్థాపన లకు పరిమితం అయిన పోల వరంకు చలనం కలిగింది. ఆనాడు ముఖ్యమంత్రిగా కేంద్రంలో తనకున్న పరపతిని ఉపయోగించి... వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకొని... వారు వెలిబుచ్చిన అన్ని అభ్యంతరాలకు సమాధానాలు అందించి 14 అనుమతులు సాధించి... పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టించింది వైఎస్సారే. 

2009 సెప్టెంబర్‌లో డా. వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రమా దవశాత్తూ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించడంతో... పోలవరంకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. 2014లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో... పోలవరం మళ్లీ తెరపైకి వచ్చింది. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా... మొత్తం ఖర్చును కేంద్రమే భరించేటట్లు ఒప్పందం కుదిరింది. కానీ, 2014లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు దాదాపు ఏడాదిన్నర వరకు పోలవరంను పక్కన పెట్టి పట్టిసీమ ఎత్తిపోతలు చేపట్టారు.

అంతేకాదు... రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ చాలునని ఒప్పుకొన్న చంద్రబాబు... కేంద్రం కట్టాల్సిన పోలవరంను తన భుజాలకెత్తుకొని తప్పు చేశారు. కేంద్రం ఏదయితే 2014 నాటి అంచనాల ప్రకారం రూ. 16,000 కోట్లు మాత్రమే ఇస్తానన్నదో దానికి తలూపి ఒప్పుకొన్నారు. అందుకే ప్రస్తుతం కేంద్రం పోలవరంకు రూ. 29,027 కోట్లు మాత్రమే ఇస్తానంటోంది. కానీ, ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2017–18కి సంబంధించిన ధరల ప్రకారం మొత్తం రూ. 55,656 కోట్లు ఇవ్వాలని కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు.

తానొక విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు పోలవరం నిర్మాణంలో చేసిన తప్పులు పోలవరంకు ప్రతికూలంగా మారాయి. ఆయన కాలంలో ఒకవైపు స్పిల్‌వే పని పూర్తి చేయకుండానే మరోవైపు కాఫర్‌ డ్యామ్‌లను కట్టడం ప్రారంభించారు. దాంతో, వరదనీళ్లు దిగువకు పోవడానికి అవకాశమే లేకుండా పోయింది. మధ్యలో కొచ్చేసరికి ముంపు గ్రామాలు మునిగిపోతాయని అర్థం కావడంతో ఆ పనుల్ని మధ్యలో ఆపేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవకతవకల వల్ల వర్షాలు, వరదలు వచ్చిన ప్రతి సారీ నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతోంది. అంతే కాదు... ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 2,340 మీటర్ల వెడల్పుతో కట్టాలి. కానీ, ఒకచోట 480 మీటర్లు, రెండోచోట 400 మీటర్ల గ్యాప్‌ మేర కట్టకుండా వదిలేశారు. దీనివల్ల ఆర్థికంగా నష్టంతోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది. 

ప్రణాళికబద్దంగా పనులు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పోలవరం పనులు గాడిలో పడ్డాయి. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు అతి తక్కువ కాలంలోనే పూర్తి అయ్యాయి. గత యేడాది (2021) జూన్‌ 11న గోదావరిని విజయవంతంగా స్పిల్‌వే మీదుగా మళ్లించారు. దాంతో, మెయిన్‌ డ్యామ్‌ పనులు చాలా వేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమం అయింది. డిజైన్స్‌కు అనుమతి రావడమే తరువాయి... పనులు మొదలవుతాయి. వరద కారణంగా మెయిన్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో పడ్డ భారీ గుంతలను ఎలా పూడ్చాలన్న దానిపై ఈ నెలాఖరులోగా డిజైన్లు ఖరారు అవుతాయని కేంద్రం చెప్పడం ఒక శుభవార్త! 

తాము అధికారంలో ఉన్న ఐదేళ్లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాకనే ప్రాధాన్యతా క్రమంలో నిర్వాసితులకు పునరా వాసం కల్పిస్తున్నారు. ప్రాజెక్టులో మొత్తం 373 జనావాస ప్రాంతాలు ముంపునకు గురవుతుంటే, ఇప్పటికి 27 జనావాస ప్రాంతాలను పునరావాస కాలనీలకు తరలించడం జరి గింది. 

ప్రస్తుతం, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తయిన నేపథ్యంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది కనుక... తొలుత 20,496 కుటుంబాలను తరలించాలని అధికారులు లెక్క వేశారు. అందులో ఇప్పటికే 7,962 కుటుంబాలను తరలిం చడం జరిగింది. వన్‌టైం సెటిల్‌మెంట్‌ క్రింద 3,228 కుటుం బాలకు పునరావాసం కల్పించారు. మరో 17,268 కుటుం బాలకు పునరావాసం కల్పించేందుకు ఇళ్లను వేగంగా కట్టిస్తున్నారు. కేంద్రం నిర్వాసిత కుటుంబాలకు రూ. 6.50 లక్షల పరిహారం ఇస్తుంటే, దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 3.50 లక్షలు చేర్చి మొత్తం రూ. 10 లక్షలు అందిస్తోంది.  

ఇక పనుల్లో ప్రగతిని చూసినట్లయితే... చంద్రబాబు హయాంలో అసంపూర్తిగా వదిలేసిన స్పిల్‌వేను, స్పిల్‌వే చానెల్‌ను జగన్‌ ప్రభుత్వం పూర్తి చేసింది. అప్రోచ్‌ చానెల్‌ను సేఫ్‌ లెవల్‌కు పూర్తి చేశారు. స్పిల్‌ చానెల్‌లో 48 గేట్లు అమర్చారు. ప్రధాన డ్యామ్‌ లో గ్యాప్‌ 3ను పూర్తి చేశారు. అన్నిటికీ మించి కీలకమైన ఎగువ కాఫర్‌ డ్యావ్‌ును పూర్తి చేశారు. నదిని స్పిల్‌వే మీదుగా మళ్లించడం పూర్తయింది. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
 
అదేవిధంగా, హైడల్‌ పవర్‌ (జల విద్యుత్‌) ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. కీలక టన్నెల్‌ నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఎడమ, కుడి కాలువకు కనెక్టివిటీ పనులు కొనసాగుతున్నాయి. (చదవండి: పోలవరం తొలిదశకు లైన్‌ క్లియర్‌)

కేంద్ర ప్రభుత్వ సహకారం లభిస్తే వచ్చే ఖరీఫ్‌ నాటికి ‘పోలవరం’ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం ఖాయం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన తండ్రి డా. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ చారిత్రాత్మక ప్రాజెక్టును ఆయన కుమారుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పూర్తి చేయడం ఆయనకు లభించిన గొప్ప అవకాశం. ‘పోలవరం’ నిర్మాతలుగా వారిద్దరూ చరిత్రలో, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. పడిలేచిన కెరటంలా పోలవరం పరుగులు తీయడం అన్నివిధాలుగా శుభ పరిణామం!  (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం)

- సి. రామచంద్రయ్య 
ఏపీ శాసన మండలి సభ్యులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top