Mannu Bhandari: రాలిన రజనీగంధ

Mannu Bhandari: Hindi Novelist and Short Story Writer, Tribute - Sakshi

నివాళి

స్వాతంత్య్రానంతరం వచ్చిన రచయితల తరంలో మన్నూ భండారీ(3 ఏప్రిల్‌ 1931 – 15 నవంబర్‌ 2021) ఒక అద్భుతమైన మహిళ. కథకురాలిగా, నవలా రచయిత్రిగా పురుషాధిక్య ప్రపంచంలో ఆమె తలెత్తుకు నిలబడ్డారు. అజ్మీర్‌(రాజస్థాన్‌)లో కళాశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆమె స్వాతంత్య్రోద్యమపు బందులు, నిరసనలు, ఊరేగింపుల్లో పాల్గొన్నారు. వీధుల్లో అబ్బాయిలతో మార్చ్‌ చేస్తూ, స్లోగన్లు ఇస్తూ, రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్న ఆమె తీరును తండ్రి జీర్ణించుకోలేకపోయారు. కానీ నరాల్లో ఉద్యమావేశపు లావా ఉప్పొంగుతున్నప్పుడు ఆమెను ఎవరు ఆపగలరు? అదే కృతనిశ్చయాన్ని ఆమె తన సహ రచయిత రాజేంద్ర యాద వ్‌ను వివాహమాడటంలోనూ చూపారు. పై చదువులకు కోల్‌కతా వెళ్లినప్పుడు యాదవ్‌ను ఆమె కలిశారు. అదే కోల్‌కతాలో హిందీ టీచర్‌గా ఆమె కొన్నాళ్లు పనిచేశారు.

చక్కటి చదువరి అయిన మన్ను తన మొదటి కథ ‘మై హార్‌ గయీ’(నేను ఓడిపోయాను) అలా రాసేశారు. 1957లో ‘కహానీ’ మ్యాగజైన్‌లో దానికి వచ్చిన స్పందన ఆమెను గాలిలో తేలి యాడించింది. ప్రతిగా మరిన్ని కథలు రాశారు. అన్నీ కూడా తను పెరిగిన అజ్మీర్‌లోని మనుషులను ఆధారం చేసుకొన్నవి. రాజేంద్ర యాదవ్‌ 1951 నాటికే ‘సారా ఆకాశ్‌’ రాసివున్నారు. హిందీ రచయితలకు సాహిత్య వాతావరణం మరింత అనుకూలంగా ఉంటుందని వాళ్లు 1964లో ఢిల్లీకి మారిపోయారు. ఢిల్లీ యూనివర్సిటీలో మన్నూకు లెక్చరర్‌గా ఉద్యోగం దొరికింది. ఇక తర్వాతి సంవత్సరాల్లో మిరుమిట్లు గొలిపే కీర్తిశిఖరాలను ఆమె అధిరోహించారు. కథలు రాస్తూనే, నవలలకు మారి, అటుపై సినిమా రచన ల్లోనూ మునిగిపోయారు. యాభైకి పైగా ఉన్న ఆమె కథలు ముఖ్యంగా చిన్న పట్ట ణాల్లోని మధ్య, దిగువ తరగతి జీవితాలను అరుదైన సున్నితత్వంతో చిత్రిస్తాయి. సామాజిక బంధనాల్లో చిక్కుకున్న, వాటిని దాటడానికి పోరాడిన, అలసిపోయిన మహిళలు కూడా ఆమె రచనల్లో కనబడతారు.

1950ల మధ్యలో మొదలైన నవ్య కథా ఉద్యమంలో మన్నూ భండారీ కూడా భాగం. ఆమె భర్త రాజేంద్ర యాదవ్‌తో పాటు మోహన్‌ రాకేశ్, కమలేశ్వర్‌ ప్రారంభించిన ఈ ఉద్యమం స్వాతంత్య్రానంతర తరం వారి ఆందోళనలు, అనుభవాలను ఎత్తి చూపడానికి లక్ష్యించినది. ముగ్గురు కూడా అసమాన ప్రతిభావంతులు, అదే సమయంలో ఎవరి అహాలు వారికి ఉండేవి. యాదవ్‌కూ మోహన్‌ రాకే శ్‌కూ చెడినప్పుడు కూడా మోహన్‌తో మన్నూ స్నేహం కొనసాగించింది. ‘నా సొంత అస్తిత్వం నాకు ఉండదా?’ అని రాకేశ్‌ను ప్రశ్నించారు మన్నూ. అయితే ముప్ఫై ఏళ్ల సహ జీవనం తర్వాత యాదవ్‌తో ఆమె వివాహ బంధం ముగిసింది. కానీ యాదవ్‌ ఇచ్చిన సహకారాన్ని ఆమె ఎప్పుడూ గుర్తుంచు కున్నారు. ఇద్దరూ కలిసి ‘ఏక్‌ ఇంచ్‌ ముస్కాన్‌’(ఒక అంగుళం చిరునవ్వు) నవల కూడా రాశారు. అందులోని అమర్‌ పాత్ర భాగాలు యాదవ్‌ రాస్తే, అమల, రంజన కోణాల్లోవి మన్నూ రాశారు.

1970 నాటికి ఆమె నాలుగు కథాసంపుటాలు ప్రచురించారు. తల్లిదండ్రులు విడిపోదామని నిర్ణయించుకున్నప్పుడు తొమ్మిదేళ్ల పిల్లాడు బంటీ మానసి కోద్వేగపు ప్రయాణపు కోణంలో ‘ఆప్‌కా బంటీ’ రాశారు. అప్పటికి మన్నూకు కూడా తొమ్మిదేళ్ల పాప రచన ఉండటం కాకతాళీయం కాదు. ఈ నవల ధారావాహికగా ప్రచురితం అవుతున్నప్పడు వస్తున్న ఉత్తరాలను చూసి పోస్ట్‌మాన్‌... ఈ ఇంట్లోనే ఒక ఆఫీస్‌ తెరవకూడదా అన్నాడట. నవల మీద విప రీతమైన చర్చలు జరిగాయి. అయితే పాఠకుల స్పందన అధికంగా బంటీ మీదే కేంద్రీకృతమై... తన లక్ష్యానికీ, మాతృత్వానికీ మధ్య నలిగిపోయిన ఆధునిక స్త్రీ మీదకు ఎక్కువ ప్రసరించకపోవడం పట్ల ఆమె కొంత నొచ్చుకున్నారు కూడా.

1974లో బాసూ ఛటర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘రజనీగంధ’ ఆమెను మరో మెట్టు ఎక్కించింది. ఆమె కథ ‘యేహీ హై సచ్‌’(ఇదే నిజం) ఆధారంగా తీసిన ఈ సినిమా సిల్వర్‌ జూబ్లీ ఆడింది. అప్పటికి ఫ్యామిలీ ఫ్రెండ్‌ అయిన బాసూ ఛటర్జీ కోసం శరత్‌ కథ ‘స్వామి’ని తిరగరాశారు. సినిమా బాగా ఆడినప్పటికీ, క్లైమా క్స్‌లో భర్త కాళ్ల మీద భార్య పడే సీన్‌ పట్ల ఆమె పూర్తిగా విభేదించారు. భార్యను తన చేతుల్లోకి భర్త తీసుకోవడం ద్వారా కూడా అదే ఫలితం రాబట్టవచ్చని ఆమె వాదన. బాసూ ఛటర్జీ దూరదర్శన్‌ కోసం తీసిన ‘రజని’ సీరియల్‌ కోసం కూడా మన్నూ పని చేశారు. ఇది కూడా సంచలనం సృష్టించింది.

బిహార్‌లోని బెల్చి గ్రామంలో జరిగిన దళితుల ఊచకోత ఘటనకు కదలిపోయి 1979లో పూర్తిస్థాయి రాజకీయ నవల ‘మహాభోజ్‌’ రాశారు. ఇది నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా తరఫున అమల్‌ అల్లానా దర్శకత్వంలో నాటకంగా వచ్చి అరు దైన సమీక్షలు పొందింది. ఎన్‌ఎస్‌డీకి అది స్వర్ణయుగం. మనోహర్‌ సింగ్, సురేఖా సిక్రీ, ఉత్తర బావోకర్, రఘువీర్‌ యాదవ్‌ లాంటివాళ్లు అందులో ఉండి, నాటకంలో పాత్రధారుల య్యారు.

ఇంతటి విజయాలు చూసిన తర్వాత ఎవరిలోనైనా అహం పొడసూపడం సహజం. కానీ మన్నూలో లేశమాత్రం కూడా అది కనబడేది కాదు. అన్ని స్థాయుల వాళ్లతోనూ ఆమె తన జీవితాంతం స్నేహం చేశారు. చివరి దశలో అనారోగ్యం ఆమెను తినేసింది. నవంబర్‌ 15వ తేదీన ఆమె మరణించారు. కానీ చెరిగి పోని ఆమె వారసత్వం మనకు మిగిలివుంది.

– పూనమ్‌ సక్సేనా
పాత్రికేయురాలు, అనువాదకురాలు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top