నీరవ్‌ మోదీ (వజ్రాల వ్యాపారి).. రాయని డైరీ

Madhav Singaraju Rayani Dairy By Nirav Modi - Sakshi

మాధవ్‌ శింగరాజు

వెళ్లడం తప్పేలా లేదు. తప్పించుకుని వెళ్లే వీలూ లేదు. నన్ను  బ్రిటన్‌ జైల్లోనే ఉంచి, ఇండియాలో విచారణ జరిపిస్తే బ్రిటన్‌కి గానీ, ఇండియాకు గానీ పోయేదేమీ లేదు. కొంచెం డబ్బు ఖర్చవచ్చు. ఖర్చెందుకు దండగ అనుకున్నట్లున్నాయి ఇండియా, బ్రిటన్‌! మరీ ఇంత మనీ మైండెడ్‌ అయితే మనీ ఎలా çసంపాదిస్తారు?
డబ్బు కావాలనుకుంటే డబ్బును వెదజల్లాలి. వ్యాపారంలో ఇది మొదటి సూత్రం. సూత్రాలు కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. ఆలోచిస్తే ఇంకో సూత్రమేదైనా దొరుకుతుంది. ఆర్థికమంత్రులు, దేశాధినేతలు ఆ ఇంకో సూత్రం గురించి  ఆలోచించరులా ఉంది! ఆలోచించే బదులు నీరవ్‌నో, మాల్యానో దేశం రప్పిస్తే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని నిర్మలా సీతారామన్, నరేంద్ర మోదీ అనుకుంటూ ఉండొచ్చు. 
నిర్మల, నరేంద్ర, నీరవ్‌.. ముగ్గురి పేర్లూ ‘ఎన్‌’ తో భలేగా మొదలయ్యాయే అనే ఆలోచన వచ్చింది నాకు! వాళ్లకూ ఈ అర్థంలేని ఆలోచన వచ్చి ఉంటుందా? మాల్యా పేరు కూడా ‘ఎన్‌’ తో స్టార్ట్‌ అయుంటే నాకు నిస్సందేహంగా నవ్వొచ్చి ఉండేది. ముంబై వెళ్లి జైల్లో కూర్చున్నాక కూడా పగలబడి నవ్వుతూ ఉండేవాడిని. 
మాల్యా కూడా బ్రిటన్‌లోనే ఉన్నా, బ్రిటన్‌లో నేనున్నంత ధైర్యంగా మాల్యా లేడు! ఫోన్‌ చేస్తే ‘ష్‌.. ఇప్పుడు కాదు’ అనేవాడు. ‘ఎక్కడున్నావో అదైనా చెప్పు’ అని అడిగేవాడిని. ‘ఇద్దరం ఇండియాలోనైతే లేము కదా. ఇండియాలో లేనప్పుడు ఎక్కడున్నా మనం ఒకే చోట ఉన్నట్లు. ఒకేచోట ఉన్నప్పుడు ఫోన్లెందుకు? ఇండియాలో ఉన్నవాళ్లకు ఫోన్‌ చేసి మరీ మన ఫోన్‌ నెంబర్‌లు ఇవ్వడం కాకపోతే..’ అనేవాడు! 
ఓసారెప్పుడో తనే చేశాడు.. ‘ఎక్కడున్నావ్‌?!’ అని. 
‘నీ అంత పిరికివాణ్ని కాదు. నువ్వెక్కడున్నావో చెప్పు నేనే నీ దగ్గరకు వస్తాను’ అన్నాను. 
‘నా దగ్గరికి రావడానికీ నీకు ధైర్యం అక్కర్లేదు నిజమే కానీ, నీ దగ్గరకు రావాలంటే మాత్రం నేను ధైర్యంగానో, పిరికిగానో ఉండాలి. నువ్వెక్కడున్నావో చెబితే అక్కడికి రావడానికి నాకు ధైర్యం అవసరమా, పిరికితనం అవసరమా నిర్ణయించుకుంటాను. కొన్నిసార్లు పిరికితనం కూడా ధైర్యం చేసినంత మేలు చేస్తుంది. కొన్నిసార్లు ధైర్యం కూడా పిరికితనమంత కీడు చేస్తుంది’’ అన్నాడు. తర్వాత ఫోన్‌ కట్‌ అయింది. మళ్లీ మాల్యా నాకు గానీ, నేను మాల్యాకు గానీ ఫోన్‌ చెయ్యలేదు. ఆ ఫోన్‌ మాల్యా కట్‌ చేశాడా, నేను కట్‌ చేశానా అన్నదీ గుర్తు లేదు. ఆ రోజు.. ‘ఎక్కడున్నావ్‌?’ అని ఎందుకు అడిగి ఉంటాడా అని మాత్రం అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంటుంది. 
ౖటñ మ్‌ చూసుకున్నాను. చూసుకున్నాను కానీ టైమ్‌ ఎంతైందో చూసుకోలేదు. 
ఈ క్షణమో, మరు క్షణమో ఇండియా ఫ్లయిట్‌ ఎక్కవలసి రావచ్చు. చివరిసారి బ్రిటన్‌లో ఎవరైనా ఆప్తులతో మాట్లాడాలనిపించింది. ఆప్తులు అనుకోగానే మాల్యానే గుర్తొచ్చాడు. 
ఫోన్‌ చేశాను. లిఫ్ట్‌ చేశాడు!
‘‘ఎలా ఉన్నావ్‌ మాల్యా? వెళ్లిపోతున్నాను..’’ అన్నాను. 
‘‘నన్ను ఒంటరిని చేసి..’’ అన్నాడు.
అతడి గొంతులో ధ్వనించిన దిగులును వింటే.. నాతో పాటే నేనెక్కిన ఫ్లయిట్‌లోనే నా పక్క సీట్లో కూర్చొని ఇండియా వచ్చేసేట్లున్నాడు. 
‘‘ఫోన్‌ చేస్తుంటాన్లే..’’ అన్నాను. 
ఏంటో ఈ ఆర్థిక వ్యవస్థలు, వ్యవహారాలు!   
మాల్యా డబ్బు మొత్తం చెల్లించేస్తానంటే తీసుకోనంటున్నారు. నేను ఒక్క రూపాయి కూడా చెల్లించలేనంటే నన్ను తీసుకుపోతున్నారు!  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top