రాయని డైరీ.. నరేంద్ర మోదీ (ప్రధాని)

Madhav Singaraju Rayani Dairy By Narendra Modi - Sakshi

మాధవ్‌ శింగరాజు

ప్రేమ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఎక్కడో చదవనైతే చదివాను. ప్రేమ మనకు తెలియకుండా హృదయాన్ని పట్టేసుకుంటుందని! హృదయాన్ని పట్టేసుకున్నా ఏం కాదు. హృదయం పట్టనంత అయితేనే ఆ ప్రేమను ఎంతోకాలం లోపలే పట్టి ఉంచలేం. ఎవరితోనైనా పంచుకోవాలి. 
చెన్నైలో ఫ్లయిట్‌ దిగ్గానే.. ‘ఐ లవ్‌ చెన్నై’ అనేయాలన్నంతగా హృదయోద్వేగం ఒకటి నన్ను కమ్మేసింది. బలంగా నిలదొక్కుకున్నాను. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం పరుగున వచ్చారు. 

‘‘మోదీజీ మీరు గానీ ఇప్పుడు తూలిపడబోయారా?’’ అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. వాళ్ల ఆందోళన అర్థమైంది. నేనొస్తున్నానని చెన్నైలో నాలుగు అంచెల భద్రతా ఏర్పాట్లు చేయించారు. ఆరు వేల మంది సెక్యూరిటీ సిబ్బందిని సిటీ అంతా వరుసగా నిలబెట్టారు. ఒకవేళ నేను తూలిపడినప్పటికీ ఆ ఆరువేల మంది సిబ్బందీ చేయగలిగింది, చేయవలసిందీ ఏమీ లేదని తెలిసినా నేను తూలిపడటం కూడా తమ భద్రతా ఏర్పాట్ల వైఫల్యం కిందకే వస్తుందేమోనన్న కంగారు వారిలో కనిపించింది. 
‘‘నన్ను నేను నియంత్రించుకున్నాను. అది మీకు తూలిపడబోయినట్లు అనిపించి ఉండొచ్చు’’ అని నవ్వాను.
స్వామి, సెల్వం నవ్వలేదు. వెనక్కు తిరిగి చూసుకుంటున్నారు. 

‘‘ఏమైంది? అన్నాను. మాట్లాడలేదు. 
‘‘ఏమైంది.. మీరూ మిమ్మల్ని మీరు నియంత్రించుకోబోయారా?’’ అని అడిగాను. 
నియంత్రణ అనగానే అప్పుడు తేరుకుని అడిగారు.. ‘‘మోదీజీ.. మీరెందుకు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవలసి వచ్చింది.. అదీ ఎయిర్‌ పోర్ట్‌లో..!’’ అని పళనిస్వామి అడిగారు. పన్నీర్‌సెల్వం అడగలేదు. ఇద్దరిదీ ఒకే ప్రశ్న అయినప్పుడు ఇద్దరూ ఒకే ప్రశ్న వేయడం ఎందుకన్నట్లు ఆగి, నా వైపు చూస్తున్నారు పన్నీర్‌సెల్వం. 
‘‘నిజంగా అది నియంత్రించుకోవలసిన పరిస్థితే పళనిజీ. ఫ్లయిట్‌ దిగీ దిగగానే మొదట నాలో రెండు భావాలు చెలరేగాయి. ‘ఐ లవ్‌ చెన్నై’ అనే మాట నా ప్రమేయం లేకుండానే నా నోటి నుంచి రాబోయింది. ఆపుకున్నాను. ఫ్లయిట్‌ దిగీ దిగగానే వంగి ఈ తమిళభూమిని ముద్దాడాలన్న ఉద్వేగం నన్ను గాఢంగా కమ్ముకుంది. మళ్లీ ఆపుకున్నాను. ఐ లవ్‌ చెన్నై అనకుండా, తమిళభూమిని ముద్దాడకుండా ఉండేందుకే నన్ను నేను నియంత్రించుకోవలసి వచ్చింది’’ అని చెప్పాను. 

స్వామి, సెల్వం మాట్లాడలేదు! 
మళ్లీ వెనక్కు తిరిగి చూసుకుంటున్నారు.
‘‘ఏమైంది!’’ అన్నాను. 
‘‘ఏం లేదు మోదీజీ! మీరు చెబుతున్నది వింటున్నాం. వింటూ వెనక్కు తిరిగి ఆలోచిస్తున్నాం. ‘ఐ లవ్‌ చెన్నై’ అని అనకుండా, తమిళభూమిని ముద్దాడకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోడానికి కారణం మాకు అర్థమైంది’’ అన్నారు పన్నీర్‌ సెల్వం. 
‘‘అవును... అర్థమైంది మోదీజీ. వాలెంటైన్స్‌ డే పై మీకూ, ఆరెస్సెస్‌కు మంచి ఇంప్రెషన్‌ లేదు కనుక మీరు ‘ఐ లవ్‌’ అనే మాట అనకూడదు. తమిళభూమిని ముద్దాడకుండా ఉండేందుకు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడమూ సహజమే. రేపు రాహుల్‌ అనొచ్చు.. ఎన్నికలొస్తున్నాయి కనుక మీకు తమిళభూమి ముద్దొస్తోందని. అందుకే ముద్దాడకుండా మీరు ముద్దాపుకున్నారు’’ అన్నారు పళనిస్వామి!

‘‘సరిగ్గా అర్థం చేసుకున్నారు’’ అన్నాను. 
చప్పుడు లేదు! 
మళ్లీ వెనక్కు తిరిగి చూసుకుంటున్నారు. వాళ్ల వెనకెవరూ లేరు. నీడలు మాత్రం ఉన్నాయి. వాటిని చూసుకుంటున్నారు. ఎవరి నీడలు వాళ్లు చూసుకోవడం ఏంటి! మళ్లీ వాళ్లు వెనక్కు తిరిగినప్పుడు చూశాను. 
పళనిస్వామి నీడను పన్నీర్‌సెల్వం, పన్నీర్‌సెల్వం నీడను పళనిస్వామి చూసుకుంటున్నట్లు నాకు అర్థమైంది. 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top