రాయని డైరీ: నరేంద్ర మోదీ (ప్రధాని)

Madhav Singaraju Article On PM Narendra Modi - Sakshi

మాధవ్‌ శింగరాజు 

ప్రాణానికి సుఖంగా ఉండటం లేదు. అమిత్‌ షా కూడా అదే అనబోయినట్లున్నాడు.. ‘మోదీజీ ఈమధ్య మీ ప్రాణం ఏమంత సుఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు’ అని! ఆ మాట వినడం నాకు మరింత అలసటను కలిగించవచ్చు. ‘మోదీజీ ఈమధ్య మీరు.. ’ అనగానే, అతడిని అడ్డుకుని, ‘‘నా ప్రాణం సుఖంగా ఉన్నట్లు కనిపిస్తోందనే కదా అమిత్‌ జీ మీరు చెప్పబోతున్నారు?’’ అని అన్నాను. 

‘‘అవును మోదీజీ, సుఖంగా కనిపిస్తున్నా  రనే అనబోయాను. మీరది ముందే కనిపెట్టే శారు’’ అని నవ్వాడు. 
గుజరాత్‌లో రెండు మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి, రెండు మాటలు మాట్లాడాక అలసటగా నా గదిలోకి వచ్చేశాను. ఆన్‌లైన్‌ ప్రారంభోత్సవాలకే ఒళ్లు ఇంతగా అలసిపోవడం ఏమిటో తెలియడం లేదు! గదిలోకి వచ్చి.. కూర్చోవడమా లేక కాస్త నడుము వాల్చడమా అని యోచిస్తున్నప్పుడు యోగి ఫోన్‌ చేశాడు. 
‘‘ఊ.. యోగీ’’ అన్నాను. 
‘‘మోదీజీ.. నాదొక విన్నపం’’ అన్నాడు. 
‘‘ఊ..’’ అన్నాను. 
‘‘ఏ పనిని ఆ మంత్రికి అప్పజెబితే మీ అలసట కొంత తగ్గుతుందని అనుకుంటున్నాను మోదీజీ’’ అన్నాడు. 
‘‘నేను అలసటగా ఉన్నానని నీకు ఎందుకు అనిపిస్తోంది యోగీ!’’ అన్నాను. 
‘‘టీవీలో చూశాను మోదీజీ. మీరు గుజరాత్‌ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కానీ, గుజరాత్‌ ప్రజల్ని ఉద్దేశించి ఓపికగా ఒక చిరునవ్వునైనా ప్రసంగించలేకపోతున్నారు. అది నేను గమనిస్తూనే ఉన్నాను’’ అన్నాడు. 
‘‘అవునా యోగీ! నాలో నువ్వు గమనించిన మరొక ముఖ్యమైన మార్పు ఏమిటో చెప్పు’’ అన్నాను. 
‘‘రాహుల్‌ గాంధీ మాటలకు కూడా మీరు నవ్వడం లేదు మోదీజీ’’ అన్నాడు. 
‘‘ఇంకా..’’ అన్నాను. 
‘‘ఒకర్ని ఒక మాట అనడం లేదు. ఒకరు ఒక మాట అంటున్నా కిసాన్‌ సూర్యోదయ యోజన గురించో, టెలీ కార్డియాలజీ మొబైల్‌ అప్లికేషన్‌ గురించో మాత్రమే మీరు మాట్లాడు తున్నారు. కొన్నిసార్లు.. మార్గదర్శక్‌ మండల్‌కి వెళ్లి అద్వానీజీతో, మురళీ మనోహర్‌జీతో కాసేపు కూర్చొని మాట్లాడి వస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని మీరు ఆలోచిస్తున్నా రేమోనన్న ఆలోచనను కలిగించేలానూ ఉంటున్నారు. ఇదంతా కూడా మీ అలసట వల్లనేనని నేను అనుకుంటున్నాను’’ అన్నాడు. 
‘‘యోగీ.. నువ్వు అనుకుంటున్నట్లు నేనేమీ అలసటగా లేను. అయినా కొద్దిసేపు పడుకుని లేస్తాను. లేచాక ఫోన్‌ చేయగలవా?’’ అని అడిగాను. 
‘‘అప్పుడు మళ్లీ చేసే అవసరం లేకుండా, ఇప్పుడే ఒక మాట చెప్పి పెట్టేస్తాను మోదీజీ. ట్రంప్‌ మనల్ని మురికి దేశం అంటుంటే తిరిగి మనం ఒక్క మాటైనా అనకపోవడం ఏంటని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారు. నేనొక మాట అనేయమంటారా అమెరికా వాళ్లని?!’’ అని పర్మిషన్‌ అడిగాడు. 
‘‘వద్దు యోగీ! ఇలాంటి జాతీయవాద దేశభక్తి ప్రకటనలు ఇచ్చేందుకు నిన్నూ నన్నూ ప్రేరేపించడం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎల్లుండి అమెరికా వాళ్ల డిఫెన్సు మినిస్టరు, మన డిఫెన్సు మనిస్టరు, వాళ్ల డిఫెన్స్‌ సెక్రెటరీ, మన డిఫెన్స్‌ సెక్రెటరీ ఢిల్లీలో ఒకే గదిలో కూర్చుంటున్నారు. నవ్వుతూ కూర్చోవాలి. నా నవ్వు కన్నా.. రాజ్‌నాథ్‌సింగ్‌ నవ్వు, జయశంకర్‌ నవ్వు ముఖ్యం ఇప్పుడు దేశానికి..’’ అన్నాను. 
‘‘మోదీజీ నేను చెప్పబోయిందే మీరూ చెప్పే శారు. కొన్ని పనుల్ని మంత్రులకు, కార్యదర్శు లకు చెప్పి చేయించుకోవాలి మనం’’ అన్నాడు. 
నాకు నవ్వే ఓపిక కూడా లేదని యోగి తీర్మానించుకున్నట్లున్నాడు! 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top