చైనా సవాలును ఎదుర్కోవాలంటే...

Karan Thapar Special Article On India China Relations - Sakshi

కామెంట్‌

భారత్‌ను తోటి ఆధిపత్య శక్తిగా చైనా చూడటం లేదు. పైగా, శక్తిమంతమైన స్థానంలో ఉన్న చైనా, భారత్‌కు తనతో సమానమైన స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా భావించడం లేదు. బ్రిటిష్‌ వలసవాద కాలంలో విదేశీ శక్తి పాలనలో ఉంటున్న బానిస జాతిగా భారతదేశాన్ని చైనా చూస్తూ వచ్చింది. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, చైనాకు వ్యతిరేకంగా బ్రిటిష్‌ సైన్యం 19వ శతాబ్దిలో చేసిన పలు దాడుల సందర్భంగా భారతీయ సైని కులు బ్రిటిష్‌ పాలకులకు షాక్‌ ట్రూప్‌లుగా సేవ చేశారు. షాంఘై, హాంకాంగ్‌ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న పట్టణ కేంద్రాల్లో, భారతీయ నల్లమందు వ్యాపారులే తమ సంపదను ప్రదర్శించుకున్నారు.

ఇక్కడే భారత్‌పట్ల చైనా వ్యతిరేకతకు మూలం ఉందని చెప్పవచ్చు. సంకుచిత జాతీయవాద పెరుగుదల, మతపరమైన అసమ్మతిని దూకుడుగా అమలు చేయడం, భారత్‌ను విశిష్టమైనదిగా మార్చిన ఆస్తులను అమ్మేయడం వంటి చర్యలకు భిన్నంగా, భారత రాజ్యాంగంలో పొందుపర్చిన విలువలకు నిబద్ధత పాటించడం ద్వారానే చైనా సవాలును ఎదుర్కోవడానికి భారత్‌కు మెరుగైన అవకాశం ఉంటుంది. 

చైనా అత్యంత శక్తిమంతమైన మన పొరుగుదేశం. కానీ ఆ దేశం గురించి మనకు తెలిసింది తక్కువే. పైగా ఆ దేశం మనగురించి ఏమనుకుంటుందో మనకు అర్థమయింది మరీ తక్కువే. ఇంతకు మించిన అసంబద్ధత మరొకటి లేదు. గత 12 నెలల కాలంలో ప్రచురితమైన అద్భుత పుస్తకాలు మన కళ్లను బాగానే తెరిపించాయని చెప్పాలి. ఇవి బయటపెట్టిన విషయాలు మనకు అసౌకర్యం కలిగించడమే కాదు... చాలా ఆసక్తిని కలిగించాయి కూడా. కానీ ఈ పుస్తకాలు తమ విలువకు తగిన సావధానతను పొందాయా అని ఆశ్చర్యపడు తున్నాను.

ఈ రెండు పుస్తకాల్లో మొదటిది కాంతి బాజ్‌పేయి రాసిన ‘ఇండియా వర్సెస్‌ చైనా: వై దే ఆర్‌ నాట్‌ ఫ్రెండ్స్‌’. ఈయన సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీలో ఆసియన్‌ స్టడీస్‌ విల్మార్‌ ప్రొఫెసర్‌. ఇక రెండో పుస్తకం శ్యామ్‌ శరణ్‌ రాసిన ‘హౌ చైనా సీస్‌ ఇండియా: ది అథారిటేటివ్‌ అకౌంట్‌ ఆఫ్‌ ది ఇండియా–చైనా రిలేషన్‌షిప్‌’. ఈయన విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి. ఈ రెండూ ఒకేవిధమైన అంశాలను కలిగి ఉన్నాయి కానీ విభిన్నంగానూ, ఒకదానికొకటి వేర్వేరుగానూ ఉన్నాయి.

చైనా కొంచెం ఎక్కువ సమానం?
మనం చైనాగురించి ఎంత అజ్ఞానంతో ఉంటున్నాం అనే అంశంతో శరణ్‌ పుస్తకం మొదలవుతుంది. భారత్, చైనా శతాబ్దాలుగా ఒకదానికొకటి అపరి చితంగానే ఉంటూ వచ్చాయి. మనకు పొరుగునే ఉంటూ, శక్తిమంతమైన ప్రత్యర్థిగా ఉంటూ, బహు ముఖ రూపాల్లో తనను తాను వ్యక్తీకరించుకుంటూ సవాలు విసురుతూ మనతో ఘర్షిస్తున్న దేశం గురించి మనకు ఎంత తక్కువగా తెలుసని శరణ్‌ ప్రశ్నిస్తారు. ఇకపోతే, చాలామంది పరిశీలకులు అభినందిస్తున్నటువంటి లేదా గుర్తిస్తున్నటువంటి దానికంటే ఎక్కువ సంక్లిష్టంగానూ, మరింత అంధ కారంతోనూ ఉంటున్న చైనా–భారత్‌ సంబంధాలు ఎంత సంక్లిష్ట సంబంధాలుగా ఉంటున్నాయనే విషయాన్ని బాజ్‌పేయి పరిచయం మరింత గట్టిగా మనకు విడమర్చి చెబుతుంది.

చైనా రియర్‌ వ్యూ మిర్రర్‌లో భారత్‌ ఒక తిరోగమిస్తున్న చిత్రంగా ఉంటోందని శరణ్‌ చెబుతారు. ఒక ఉద్వేగ భరితమైన పదబంధంతో భారత్‌ వెనుకబడిందని సూచించడమే కాకుండా, మరింత మరింతగా విఫలమవుతోందని చైనా భావిస్తోందని చెబుతారు. తాను ఆధిపత్యం చలా యిస్తున్న ఆసియా ఖండంలో ఒక అధీనతా పాత్రలో భారత్‌ ఇమిడిపోవడాన్ని చైనా బాగా ఇష్టపడుతోందని శరణ్‌ చెపుతారు. బాజ్‌పేయి కూడా దీంతో ఏకీభవిస్తున్నారు. భారత్‌ను తోటి ఆధిపత్య శక్తిగా చైనా చూడటం లేదు. పైగా, శక్తిమంతమైన స్థానంలో ఉన్న చైనా, భారత్‌కు తనతో సమాన స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించడం లేదు... పరస్పర దృక్పథాలు, అధికార అసమానత అనేవి రెండు దేశాలమధ్య తీవ్రమైన సమస్యలు కావచ్చని బాజ్‌పేయి చెబుతారు.

గెలుపు రుచి చూసిన దేశంగా...
భారతదేశం చాలా గొప్ప ప్రభావం చూపుతు న్నప్పుడు, అంటే క్రీ.శ. 1000వ సంవత్సరం వరకు ఇరుదేశాల బాంధవ్యం ఎంత విభిన్నంగా ఉన్నప్ప టికీ, చైనా వైఖరి ఎంతగా మారిపోయిందీ శరణ్‌ పుస్తకం చెబుతుంది. బ్రిటిష్‌ వలసవాద కాలంలో విదేశీ శక్తి పాలనలో ఉంటున్న బానిస జాతిగా భారతదేశాన్ని చైనా చూస్తూ వచ్చింది. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, చైనాకు వ్యతిరేకంగా బ్రిటిష్‌ సైన్యం 19వ శతాబ్దిలో చేసిన పలు దాడుల సందర్భంగా భారతీయ సైనికులు బ్రిటిష్‌ పాలకులకు షాక్‌ ట్రూప్‌లుగా సేవ చేశారు. షాంఘై, హాంకాంగ్‌ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న పట్టణ కేంద్రాల్లో, భారతీయ నల్లమందు వ్యాపారులే తమ సంపదను ప్రదర్శించుకున్నారు. ఇక్కడే భారత్‌ పట్ల చైనా వ్యతిరేకతకు మూలం ఉందని చెప్పవచ్చని శరణ్‌ పేర్కొంటారు.

బాజ్‌పేయి అయితే మరింత కలవరపరిచే అంశాన్ని లేవనెత్తారు. ఒక రంగంలో మనమే ముందున్నామని నమ్ముతుంటాం. కానీ ఇక్కడ కూడా చైనా ఆధిపత్య దేశంగా ఉంటోంది. ఒక సాఫ్ట్‌ పవర్‌గా సాధారణంగా చెబుతూ వస్తున్న దానికి భిన్నంగా భారత్‌ కంటే చైనా మెరుగైన స్థానంలోనే ఉంది. ఇది చాలాకాలం కొనసాగేటట్టు కనబడుతోందని బాజ్‌పేయి చెబుతారు. 

ప్రపంచ కేంద్రస్థానంలో ఉన్నట్లు తనను తాను భావిస్తున్న చైనా దృక్పథాన్ని ఊహాత్మక చరిత్రేనని శరణ్‌ వివరిస్తారు. అయితే 1962 తర్వాత బీజింగ్‌కు విధేయంగా ఉండే అంచుల్లో భాగంగా భారత్‌ ఉండేటట్లుగా చైనా తన ఊహా త్మక చరిత్రను కాస్త పొడిగించింది. 1962లో భారత్‌ను చైనా ఓడించాక, భారత్‌ పొందిన అవమానభారాన్ని చూసిన చైనా తాను ఊహించినంత శక్తిమంతంగా కూడా భారత్‌ లేదని భావించింది. 

రాజ్యాంగమే దారి
బాజ్‌పేయి ఇక్కడే అసలు విషయం పట్టుకున్నారు. చైనా ఇప్పుడు 15 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఎదిగింది. భారత్‌ 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వెనకనే ఉండిపోయింది. ఈ అంతరం ఇంకా పెరగనుందని ఆయన నాతో అన్నారు. చైనాతో సమానంగా భారత్‌ ఎదగాలంటే నాగరిక మార్పునకు సన్నిహితంగా ఉండాల్సిన అవసర ముంది కానీ అది సాధ్యం అవుతుందని బాజ్‌ పేయికి నమ్మకం కలగడం లేదు. పవర్‌ గ్యాప్‌కు భారత్‌ దగ్గరగా వచ్చేంతవరకూ చైనాతో సయోధ్య గురించి భారత్‌కు పెద్దగా ఆశలు లేవు.

నరేంద్రమోదీ పాలనలో భారత్‌ ప్రస్తుత గమనం గురించి శరణ్‌ కలవరపడుతున్నారు. సంకుచిత జాతీయవాద పెరుగుదల, మతపరమైన అసమ్మతినీ, అసహనాన్నీ దూకుడుగా అమలు చేయడం... భారత్‌ను విశిష్టమైనదిగా మార్చిన ఆస్తులను అమ్మేయడం లాంటి చర్యలు మాని భారత రాజ్యాంగంలో పొందుపర్చిన విలువలకు నిబద్ధత పాటించడం ద్వారానే చైనా సవాలును ఎదుర్కోవడానికి భారత్‌కు మెరుగైన అవకాశం ఉంటుందని శరణ్‌ నమ్మకం.

ఈ రెండు పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయి. వీటిని చదవడం చాలా సులభం. ప్రతి పేజీ రివార్డుకు అర్హమైనదే. ఈ రెండు పుస్తకాలను చదివాక, నాకు చైనా బాగా అర్థమైందని భావిం చాను. ఈ ఊహే ఒక రుజువు. ఇది భారీ ప్రభావం కలిగిస్తుంది.


వ్యాసకర్త: కరణ్‌ థాపర్‌,
 సీనియర్‌ పాత్రికేయులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top