వ్యవస్థ తప్పులకు క్షమాపణలుండవా?

Karan Thapar Special Article On Aryan Khan Drugs Case Issue - Sakshi

కామెంట్‌ 

మాదక ద్రవ్యాల కేసులో హిందీ నటుడు షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు విముక్తి లభించింది. అంతవరకూ మంచిదే. కానీ ఆర్యన్‌ విషయంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) వ్యవహరించిన తీరు ఆమోదనీయమైనదేనా? కేసులో సత్తా లేదని అర్థమైన తర్వాత, విచారణ జరిగితే డొల్లతనమంతా బయటపడుతుందని అనుకున్నారో ఏమో... ఆ యువకుడి పేరు ప్రఖ్యాతులకు మచ్చ తేవడానికి ఎన్సీబీ ప్రయత్నించింది. ప్రతి వ్యవస్థలోనూ పొరబాట్లు జరుగుతూంటాయి. అయితే మన వ్యవస్థల్లో మాత్రం ఘోరమైన తప్పిదాలు జరగడం సాధారణమైపోయింది. ఇలాంటి సందర్భాల్లో నిందితులకు వాటిల్లిన నష్టం గురించి వాటికి ఏ బాధ్యతా ఉండదా? అలాంటప్పుడు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ఆర్యన్‌కు జరిగిన నష్టాన్ని ఏదోలా భర్తీ చేయకపోవడం, క్షమాపణ కోరకపోవడం ఎంత వరకూ సబబు? చేసిన తప్పులకు కనీసం క్షమాపణ అడిగేంత ధైర్యం కూడా మన వ్యవస్థలకు లేకపోవడం తీవ్ర నిస్పృహకు గురి చేసే అంశమే!

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు మాదక ద్రవ్యాల కేసు నుంచి విముక్తి లభించింది. బాగానే ఉంది. కానీ... ఈ క్రమంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) ఆర్యన్‌ ఖాన్‌తో వ్యవహరించిన తీరుపై మాత్రం అనేకానేక విమర్శలు వెల్లు వెత్తాయి. నాకైతే వారి వ్యవహార శైలి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు కానీ... ఈ దేశంలోని ప్రభుత్వ సంస్థ చేతుల్లో ఇలాంటి వైఖరిని ఎదుర్కొన్నవారు కొన్ని లక్షల మంది ఉన్నారనడంలో అతిశయోక్తి ఏమీ ఉండదు. కాకపోతే అప్పుడప్పుడూ మనలాంటి ‘సామా న్యుల’కు అలాంటి ట్రీట్మెంట్‌ ఎదురైనప్పుడు మాత్రం షాక్‌కు గురవుతూంటాం. ఇదో కపటపూరితమైన వ్యవహారమని తెలుసు కానీ... వాస్తవం కూడా ఇదే. ఇదొక క్రూరమైన మేల్కొలుపు. ఈ కథనం రాయడానికి అది కూడా ఒక కారణమని ఒప్పుకుంటాను.

కట్టు కథలే!
అయితే ఈ కథనంలో చెప్పదలుచుకున్న విషయం మాత్రం అది కాదు. ఉదారబుద్ధి అనే చాలాపెద్ద మాటను కూడా నేను వాడటం లేదుగానీ...  కనీసం క్షమాపణ అడిగేంత ధైర్యం కూడా మన వ్యవస్థలకు లేకపోవడం మాత్రం నన్ను కదిలించడమే కాదు... తీవ్ర నిస్పృహకు గురి చేస్తోంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ఆర్యన్‌ ఖాన్‌కు జరిగిన నష్టాన్ని ఏదోలా భర్తీ చేయడం, క్షమాపణ కోరకపోవడం ఎంత వరకూ సబబు? ప్రతి వ్యవస్థలోనూ పొరబాట్లు జరుగుతూంటాయి. అయితే మన వ్యవస్థల్లో మాత్రం ఘోరమైన తప్పిదాలు జరగడం సాధారణ మైపోయింది. అయితే, ఆర్యన్‌ఖాన్‌ విషయంలో జరిగింది చిన్న తప్పేమీ కాదు. అయినాసరే... క్షమాపణ కోరాలనే నైతికమైన ఇంగితం కూడా ఆ సంస్థకు లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇరవై నాలుగేళ్ల యువకుడు ఆర్యన్‌ ఖాన్‌ విషయంలో వాస్తవంగా జరిగిందేమిటి? ఒక్క క్షణం ఆలోచించండి. అన్యాయమైన, సత్య దూరమైన ఆరోపణల నెపంతో అతడిని అరెస్ట్‌ చేసి ఏకంగా నాలుగు వారాల పాటు జైల్లో పెట్టారు. పెట్టిన కేసులన్నీ కట్టుకథలే. అంతర్జాతీయ మాదక ద్రవ్య కార్టెల్‌లో ఆర్యన్‌ ఖాన్‌ ఒక భాగమని ఆరోపించారు. మాదక ద్రవ్యాల సరఫరాకు కూడా కుట్రపన్నాడని అస్పష్టమైన ఆరోపణలు మోపారు. పరిస్థితి మరింత దిగజారిం దెప్పుడంటే... కేసు వివరాలను రోజూ కొంచెం కొంచెంగా తప్పుడు ఉద్దేశాలతో, వివరాలతో మీడియాకు లీకులివ్వడంతో! నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో లాంటిది ఇలాంటి వ్యవహారానికి ఎందుకు పాల్ప డింది? ఒకే ఒక్క వివరణ మాత్రమే ఆ సంస్థ ఉద్దేశాలను స్పష్టం చేస్తుంది. అదేమిటంటే... ఒక యువకుడి పరువు మర్యాదలను మంటలో కలపడానికి ప్రయత్నం చేసిందన్నమాట. కేసులో సత్తా లేదని వారికీ అర్థమై ఉంటుంది. విచారణ జరిగితే డొల్లతనమంతా బయటపడుతుందని అనుకున్నారో ఏమో! ఆ యువకుడి పేరు ప్రఖ్యాతులపై బురద చల్లారు. ప్రజల దృష్టిలో అతడిని ఓ విలన్‌గా చిత్రీకరించారు. తద్వారా న్యాయస్థానాన్ని కూడా ప్రభావితం చేయ వచ్చునని అనుకున్నారేమో మరి! తాము చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేని నేపథ్యంలో ఈ దుశ్చర్యలన్నింటి ఫలితంగా ఆర్యన్‌ ఖాన్‌కు శిక్ష పడుతుందని ఊహించివుంటారు వారు.

ఇంకా దుర దృష్టకరమైన విషయం ఏమిటంటే... మీడియా కూడా ఎన్సీబీ ఆడమన్నట్టు ఆడటం. రోజూ ఆర్యన్‌ఖాన్‌పై చర్చోపచర్చలు జరిపి అతడిని హింసించింది మీడియా. ఉదయాన్నే వార్తాపత్రికల పతాక శీర్షికల్లోనూ అవే వివరాలు! తాము రాస్తున్న కథనాలకూ, చేస్తున్న ఆరోపణలకూ ఆధారాలెక్కడ అని ఒక్క ఛానల్, వార్తా పత్రిక కూడా ఆలోచించలేదు. ఊరూ పేరూ లేని అధికారులు చెప్పారన్న సాకుతో బోలెడంత తప్పుడు సమాచారం తెచ్చి కాగితాల్లోకి ఎక్కించారు. వీరిలో ఏ ఒక్క అధికారికీ తాము ప్రచారం చేస్తున్న తప్పుడు ఆరోప ణలను బయటికి సమర్థించే ధైర్యం లేకపోయింది. క్షమార్హం కూడా కానీ అభూత కల్పనలను వండివార్చారన్నమాట. ఎన్సీబీ తానా అంటే... మీడియా కూడా తందానా అని పనిగట్టుకుని మరీ ఆర్యన్‌ ఖాన్‌ను బద్నామ్‌ చేసింది. 

అర్హుడు అవునా, కాదా?
ఇప్పుడు చెప్పండి... ఆర్యన్‌ ఖాన్‌కు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత, నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఎన్సీబీకి ఉందా, లేదా? ఎన్సీబీకి మాత్రమే కాదు... మీడియాకూ ఇది వర్తిస్తుంది. అయితే నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎన్‌. ప్రధాన్‌ ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి... ఆర్యన్‌ ఖాన్‌ కేసు ప్రాథమిక విచారణలో లోపాలూ, అక్రమాలూ బోలెడన్ని ఉన్నాయనీ, సంబంధిత సిబ్బందిపై చర్యలు చేపడతామనీ బహిరంగంగా ఒప్పుకున్నారాయన. అయితే, ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ సమర్థనీయమేనా? అన్న ఎన్‌డీటీవీ ప్రశ్నకు మాత్రం చిత్రమైన సమాధానమిచ్చారు – ‘‘విచారణలో... ఆ తరువాత అందే వాస్తవాలు విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. కాబట్టి ప్రాథమిక విచారణను నిందించడానికి నేను తొందర పడను’’ అనేశారు. బహిరంగంగా చేసిన తన ప్రకటనకు భిన్నంగా ఇలా మాట్లాడగలిగిన వ్యక్తిని ఇదే చూడటం!

ఆర్యన్‌ ఖాన్‌ తరఫున కేసు వాదించిన మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ నాతో మాట్లాడుతూ ఈ ఉదంతం మొత్తమ్మీద రెండు పాఠాలు నేర్పుతోందని అన్నారు. మొదటిది... తప్పుడు అరెస్ట్‌లు జరిగినప్పుడు బాధితుడికి నష్టపరిహారం పొందే హక్కును చట్టబద్ధం చేయాల్సిన అవసరముంది! ఇక రెండోది... అరెస్ట్‌ చేసే అధికారం ఉంది కదా అని పోలీసులు లేదా ఇతర విచారణ సంస్థలు ఆదరా బాదరాగా ఆ పని చేయకూడదు. కొంచెం స్థిమితంగా ఆలోచించి... కేసులో దమ్ము ఉందా, లేదా అన్నది విచారించుకున్న తరువాత మాత్రమే అరెస్ట్‌ గురించి యోచించాలి. 

బాధ్యులను నిలబెట్టాలి
సుప్రీంకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ ఇంకో అడుగు ముందుకెళ్లి మరో మాట చెబుతారు. ప్రాథమిక విచారణ జరిపినవారిని విచారించాలి అని! ఆర్యన్‌ ఖాన్‌ కేసు విషయంలో ప్రశాంత్‌ విస్పష్టంగా సమీర్‌ వాంఖడే పేరును ప్రస్తా వించారు. దుర్బుద్ధితో విచారణ జరపడం, అధికార దుర్వినియో గానికి పాల్పడటం ఇంకోసారి జరక్కుండా ఉండాలంటే విచారణ జరగాల్సిందేనని వాదించారు ఆయన. 

చేసిన తప్పునకు శిక్ష పడటం ఒక్కటే ఇంకోసారి ఇలాంటి తప్పులు జరక్కుండా నిలువరిస్తుందన్న నమ్మకం ప్రశాంత్‌తోపాటు చాలామందికి ఉంది. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని కారణంగా అడ్మిరల్‌ బైంగ్‌ను ఉరితీయడాన్ని తన కాండీడ్‌ పుస్తకంలో తత్వవేత్త వోల్టేర్‌ కూడా విస్పష్టంగా సమర్థించుకున్న విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో వోల్టేర్‌ వ్యాఖ్య ఒకటి ఎప్పటికీ గుర్తుండిపోయేదే... ‘‘పౌర్‌ ఎన్‌కరేజర్‌ లెస్‌ అటర్స్‌’’ (ఇతరులను ప్రోత్సహించేందుకు) అన్న ఆ వ్యాఖ్య ఆర్యన్‌ ఖాన్‌ కేసు విషయంలోనూ వర్తిస్తుంది మరి!


వ్యాసకర్త: కరణ్‌ థాపర్‌, సీనియర్‌ పాత్రికేయులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top