Gruha Saradhi: అనూహ్య వ్యూహం ‘గృహ సారథి’

Gruha Saradhi: YS Jagan New Concept in Andhra Pradesh - Sakshi

అభిప్రాయం

‘గృహ సారథి’ పేరుతో ఈ ఏడాది 5.20 లక్షల మంది యువతను సూక్ష్మ (గ్రాస్‌ రూట్స్‌) స్థాయి క్రియాశీల రాజకీయాల్లో భాగస్వామ్యుల్ని చేయాలని ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న  వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. ఈ ‘గృహ సారథులు’ ప్రతి 50  కుటుంబాలకు ఇద్దరు చొప్పున వారి అవసరాలు ప్రభుత్వం వద్ద ‘పెండింగ్‌’ కనుక ఉంటే, వాటి పరిష్కారం కోసం పార్టీ తరఫున పనిచేస్తారు. ఆ కుటుంబాల్లోని మహిళా సభ్యుల అవసరాలు తెలుసుకోవడం కోసం వీరిలో ఒక యువతి కూడా ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఎన్నికల ముందు– ‘మా పార్టీ మీ గుమ్మం వద్ద’ అన్నట్టుగా వీరు ప్రజలకు అందుబాటులో ఉంటారు. వీరి పనితీరును సమీక్షించడానికి మరో 45 వేల మంది ‘కన్వీనర్లు’ ఉంటారు. ఎనభై శాతం పైగా నిర్లక్ష్యానికి గురైన వర్గాల యువత గత మూడేళ్ళుగా వలంటీర్లు, గ్రామ సచివాలయాలల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది సర్వీస్‌ ఇప్పటికే ప్రభుత్వం ‘రెగ్యులరైజ్‌’ చేసింది. మళ్ళీ అవే వర్గాలకు ఆ వ్యవస్థతో సమాంతరంగా, అధికార రాజకీయ పార్టీ శ్రేణులుగా పని చేయడానికి మరో కొత్త అవకాశం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రంగంలో ఇంత పెద్ద ‘రిక్రూట్మెంట్‌’ జరగడం ఇది ప్రథమం.  

ఈ ‘గృహ సారథి’ వ్యవస్థ వల్ల తాత్కాలిక ప్రయోజనం వారిని నియ మించిన పార్టీకి ఉంటే, దీర్ఘకాలిక ప్రయోజనం పెద్ద సంఖ్యలో రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తున్న ఈ యువతది అవుతుంది. ఇన్నాళ్లూ పార్టీ శ్రేణులుగా తలల లెక్కకు తప్ప దేనికీ పనికిరాని ఈ యువతకు, ఇక ముందు ‘బూత్‌’ స్థాయిలో అధికార పార్టీ ప్రతినిధులుగా కొత్త గుర్తింపు రాబోతున్నది. అంటే– భవిష్యత్‌ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేయడానికి వర్ధమాన వర్గాల నుంచి వైసీపీ ‘నర్సరీ’లో సరికొత్త మానవ వనరు సిద్ధమవుతున్నదన్న మాట!  

సరిగ్గా ఇక్కడే తెలుగునాట మూడు దశాబ్దాల దళిత బహుజన రాజకీయాల ప్రస్తావన అనివార్యం అవుతున్నది. అప్పట్లో క్షేత్రస్థాయి శ్రేణుల పాటవ నిర్మాణాన్ని (కెపాసిటీ బిల్డింగ్‌) పట్టించుకోకుండా, కేవలం కొందరు నాయకుల వ్యక్తిగత ‘ఫోకస్‌’ తాపత్రయం కారణంగా, అప్పటి ఆ రాజకీయాల ఆయుష్షు అర్ధంతరంగా ముగిసింది. ఈ నేపథ్యంలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పలుకుబడి వర్గాల ‘లాబీయింగ్‌’కు ‘చెక్‌’ పెట్టి మరీ, సాంఘిక సంక్షేమంలో– అర్హులైన అన్ని ఉపకులాలకు ఫలాలు అందే విధంగా ‘హైబ్రిడ్‌ మోడల్‌’ ప్రవేశపెట్టింది. దాంతో కాలం చెల్లిన ఒత్తిడి పెంచే ‘ట్రిక్స్‌’ ఇక్కడా మొదలయ్యాయి. ‘ఒకప్పటి ఎస్సీ కార్పొరేషన్‌ కాలం నాటి బడ్జెట్‌ ఏది? ఆ పథకాలు ఇప్పుడు ఏవి?’ అని ఇటీవల కొందరు వాపోతున్నారు. దామాషా మేరకు పంపిణీ లక్ష్యం కోసం, స్వీయ సామాజిక వర్గాల ఒత్తిళ్లనే జగన్‌ పట్టించుకోవడం లేదు. లొంగడం లేదు. చిత్రం– ఇప్పటికీ ఇక్కడ సమస్య ఏమంటే – ‘రాజ్యాధికారం’ అంటే, కాపుకొచ్చిన తోటలో పంట దింపుకోవడం కాదనీ, వీరికి అర్థం కావడం లేదు. దాన్ని ఆశించేవారు, అందుకు తమదైన నేల బాగుచేసి, అందులో అనువైన విత్తనాలు జల్లి ముందుగా మనదైన పంట పండించాలి. 

రాష్ట్ర విభజన తర్వాత, మారిన సమీకరణాలతో– ‘పోస్ట్‌ మండల్‌’ ‘పోస్ట్‌ ఎకనామిక్‌ రిఫారమ్స్‌’ కాలానికి తగిన సరి కొత్త రాజకీయాలు... కేవలం సాంప్రదాయ రాజకీయాలు మాత్రమే తెలిసిన ఈ పార్టీలకు అవగాహన లేదు. నిశ్శబ్దంగా ఆ ఖాళీ జాగాను ఆక్రమించి, గత మూడున్నర ఏళ్లుగా తన సంక్షేమ–అభివృద్ధి ప్రయోగాలను ఇక్కడ అమలు చేస్తున్నారు జగన్‌. గత ఏడాది జరిగిన తొలి పార్టీ సమీక్షలో– జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘అవుట్‌ రీచ్‌ అప్రోచ్‌’తో మనం పనిచేయాలి అని ఒక కొత్త పదప్రయోగం చేశారు. దాని భావం అర్థమైతే, ఆయన విమర్శకులకు సగం పని భారం తగ్గుతుంది! 

ఇటీవల బహిరంగ సభల్లో జగన్‌ ‘ఇది కులాల మధ్య యుద్ధం కాదు, వర్గాల మధ్య యుద్ధం’ అన్న తర్వాత, ఆ ప్రకటనపై వ్యాఖ్యానించలేని దశలో ఇక్కడి రాజకీయ పక్షాలు మిగిలిపోవడం, ‘అకడమిక్‌’ వర్గాల్లో అధ్యయనం అవసరమైన అంశం. (క్లిక్ చేయండి:  రోడ్‌ షోలు – పౌర హక్కులు – కోర్టు తీర్పులు)

‘గృహ సారథి’ నియామకం ప్రపంచీకరణ దుష్పరిణామాలను ఎదుర్కోవడానికి సామాజిక శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్న – ‘గ్రీన్‌ పాలిటిక్స్‌’ దిశలో ఒక ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే – ‘సోషల్‌ కేపిటల్‌’, ‘ఫంక్షనల్‌ పాలిటిక్స్‌’ థియరీల ఆచరణకు ఇదొక పెద్ద ముందడుగు అవుతుంది. లోతులు తెలియని విమర్శకులు కురచ దృష్టితో దీన్ని తక్కువచేసి చూడ్డం తేలికే గానీ, వీరిని నియమించిన పార్టీ కంటే, ఆ పార్టీ శ్రేణులకు దీనివల్ల కలిగే ప్రయోజనం విలువైనది.


- జాన్‌సన్‌ చోరగుడి 
అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top