Andhra Pradesh: రోడ్‌ షోలు – పౌర హక్కులు – కోర్టు తీర్పులు

Andhra Pradesh: Roadshows, Civil Rights, Court Verdict - Sakshi

అభిప్రాయం

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్‌ షోలపై పరిమితులు విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం సహేతుకమైనదేనా? ఇది ఎమర్జెన్సీని తలపిస్తోందా? ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనా? ఈ జీఓ బ్రిటిష్‌ కాలం నాటిదా? మరి కోర్టు తీర్పులు ఈ అంశాలపై ఎలా ఉన్నాయి? రోడ్‌ షోలు, ర్యాలీల పేరుతో ఎక్కడపడితే అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, ప్రభుత్వాన్నీ, మంత్రులనూ అన్‌ పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో తూలనాడుతూ, చెప్పు చూపుతూ హెచ్చరికలు చేయడం, బూతులు తిట్టడం, ‘వర్కవుట్‌’ కాకపోతే ఎవరు ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చనే రీతిలో మాట్లాడటం, మంత్రులను బూతులతో సంబోధించడం... ఇవన్నీ చట్టబద్ధత కిందికే వస్తాయా? భావప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్‌ 19(1)ఏ, ఆర్టికల్‌ 19(1)బీ కిందికి వస్తాయా? మరి న్యాయస్థానాల తీర్పులు ఏం చెబుతున్నాయి? ఒకసారి పరిశీలిద్దాం!

ఈ దేశంలో ఏ శాసనాలు అయినా, వాటిని అనుసరించి జారీ చేసే ఏ ఉత్తర్వులు అయినా భారత రాజ్యాంగం ప్రకారమే ఉంటాయి తప్ప... ఇతర దేశాలకు చెంది ఉండవు అనేది సగటు మనిషికి కూడా తెలుసు. భారత రాజ్యాంగ రూపకల్పనలో  బ్రిటిష్, అమెరికా వంటి దేశాల రాజ్యాంగాల్లోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటి అంశాలు కొన్ని అవసరమైన మార్పులతో స్వీకరించారు. ఆ విధంగా ఈ దేశంలో బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలు ఎన్నో కొనసాగుతున్నాయి. ఇవి భారతదేశ చట్టాలు గానే పరిగణించాలి. అంతేకానీ వాటిని బ్రిటిష్‌ చట్టాలు అని ప్రచారం చేయడం ప్రజల్ని తప్పుదారి పట్టించడం అవుతుంది.

పౌరుల హక్కులను అతిక్రమించి రోడ్‌ షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నప్పుడు వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అనీ, మరీ ముఖ్యంగా పోలీసుల దేననీ న్యాయస్థానాలు వివిధ కేసుల్లో తీర్పులు ఇచ్చాయి. ఉదాహరణకు కేరళ హైకోర్టులో ‘పీపుల్స్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ కేసులో రోడ్‌షోలఫై దాఖలైన ‘రిట్‌ అఫ్‌ మాండమస్‌’పై జస్టిస్‌ కె. బాలకృష్ణన్, జస్టిస్‌ పి. సుబ్రమణియన్, జస్టిస్‌ జె. కోషితో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమగ్ర విచారణ జరిపి తీర్పునిచ్చింది.

ఈ విచారణలో కొన్ని ఇతర రాష్ట్రాల తీర్పులను కూడా  ఉటంకించారు. కాగా కామేశ్వర ప్రసాద్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ కేసులో, ప్రదర్శనలు– నినాదాలు కూడా భావ ప్రకటనా స్వేచ్ఛకిందికి వస్తాయా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. డిమాన్‌స్ట్రేషన్‌కి సంబంధించి, భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానాలను కూడా పేర్కొంది. ఆ ప్రకారం చూస్తే, పవన్‌ కల్యాణ్‌ మంత్రులను గాడిదలని సంబోధించడం, చెప్పులు చూపుతూ హెచ్చరికలు చేయటం వంటివన్నీ ఆర్టికల్‌ 19(1)ఏ ఆర్టికల్‌ 19(1)బీకి విరుద్ధమైనవీ, శిక్షార్హమైనవీ.

ఇక కేసు విషయానికి వస్తే... వాహనదారులు, పాదచారులు సంచరించే ప్రధాన రహదారులపై రోడ్‌ షోలు, ర్యాలీలు అంటే పౌరుల హక్కులను కాలరాయడమే అనీ, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, బస్సుస్టేషన్, రైల్వేస్టేషన్‌ వంటి ప్రదేశాలకు పౌరులు సంచరించకుండా చేయడం అంటే పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేననీ ధర్మాసనం పేర్కొంది. పౌరుల ఈ హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వం మరీ ముఖ్యంగా పోలీసులదేననీ, ట్రాఫిక్‌ను నియంత్రించే హక్కు ఎవరికీ లేదు అని కోర్టు అభిప్రాయ పడింది. సభను నిర్వహించుకునే హక్కు పార్టీలకు ఉన్నా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించటానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. 

ఈ నిబంధనలు ఉల్లంఘించే వారు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 49, పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 29 కింద శిక్షార్హులు. వీధుల్లో కవాతులు, ప్రదర్శనలు నియంత్రించే అధికారం పోలీసులకు ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తుల రక్షణ చట్టం(ప్రివెన్షన్‌ ఆఫ్‌ డ్యామేజ్‌ టు పబ్లిక్‌ ప్రాపర్టీ) 1984, సబ్‌ సెక్షన్‌ 3 ప్రకారం, ఊరేగింపులు ప్రదర్శనల పేరుతో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే, ఐదేళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది.

ఈ వివరాలన్నీ ఉటంకిస్తూ, రోడ్‌ షోలు, ఊరేగింపులు, ప్రదర్శనలకు సంబంధించి ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలనీ, ఆ ప్రకారం కఠిన నిబంధనలను అమలు చేయాలనీ, లేదంటే పోలీసులకు కష్టసాధ్యమనీ కోర్ట్‌  అభిప్రాయపడింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడినట్టే అని వ్యాఖ్యానించింది.

రోడ్‌ షోలు, ర్యాలీలు నిర్వహించదలచుకున్నవారు ముందుగా కనీసం ఆరు రోజుల ముందు పోలీసు అధికారుల అనుమతి పొందాలి. అనుమతి  పొందినా  రోడ్డు మొత్తం ఆక్రమించడానికి వీలు లేదు. ర్యాలీ ఏం జరుగుతున్నా ట్రాఫిక్‌కి అంతరాయం కలగకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సర్క్యులర్లు జారీ చేయాలి. ర్యాలీలో పెద్ద పెద్ద బ్యానర్లు నిషిద్ధం. పోలీసులు బ్యానర్‌ సైజులు నియంత్రించాలి. ఇదీ రోడ్‌ షోలు, ర్యాలీలకు సంబంధించి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. మరి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవో గౌరవ న్యాయస్థానం తీర్పునకు లోబడి ఉందా? అప్రజాస్వామికంగా ఉందా? ప్రజాస్వామ్యవాదులు ఒకపరి ఆలోచించండి!!


- పి. విజయ బాబు 
కానిస్టిట్యూషన్‌ లా నిపుణులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top