
మహాత్ముల జననం కూడా మామూలుగానే ఉంటుంది. కానీ వారి జీవన ప్రయాణంలో వారు ఎదుగుతూ మానవాళిని తమ వెంట తీసుకువెళతారు. తెలుగు రాష్ట్రాలు మరువ లేని, మరచిపోని మహానాయకులలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి అతి ముఖ్యులు.గంభీరమైన రూపం, ఆయన మనసులా తెల్లని దుస్తులు, ముఖం మీద చెరగని చిరు నవ్వు, ఆప్యాయమైన పలకరింపు, అందరితో కలసిపోయే తత్త్వం, మృదుభాషణం, నిగర్వం, సహనం, సమయ స్ఫూర్తి ఇలా అన్నీ కలిపితే ఆయనే పులివెందుల డాక్టరు, రాష్ట్ర ప్రజల జీవన విధానాన్ని సంస్కరించిన సామాజిక వైద్యుడు, ప్రజల రాజన్న, రైతుల హృదయ మెరిగిన రైతన్న.
1949 జూలై 8న వై.ఎస్. జన్మించాడు. చారిత్రక మలుపునకు ఆరంభం ఆ రోజు. ఆ బాలుడు అజేయుడు, అనితర సాధ్యుడు అవు తాడనీ, ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు ఎదుగుతాడనీ, రాష్ట్రాన్ని, ప్రజల మనసులను ఏలుతాడనీ ఎవరు ఊహించారో గానీ రాజులలో శేఖరుడు కావాలని ‘రాజశేఖరు’డని నామకరణం చేశారు. సాధనతో సార్థకనామధేయుడే అయ్యాడు.
రూపాయి డాక్టర్
కర్ణాటకలోని గుల్బర్గాలో వైద్య విద్యను పూర్తి చేసుకుని, 1972లో తిరుపతి రుయా ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా చేరారు. అప్పట్లో ‘రుయా‘ కన్నా పెద్ద ఆసుపత్రి రాయలసీమలో లేదు. అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే సీమవాసులందరినీ చూసే అవ కాశం ఆయనకు లభించింది. ఆయన నిత్య విద్యార్థి. ఆ గుణం వల్ల ప్రజల సమస్యలు, పేదరికం మరింతగా అర్థమయ్యాయి.
పులివెందులలో ఆసుపత్రి ప్రారంభించాడు. ఉన్న ఊరు, కన్న తల్లి రుణం తీర్చుకోలేమని కేవలం ఒక్క రూపాయికి వైద్యం చేసే వాడు. రూపాయి డాక్టరుగా ఆయన పేరు మారు మోగిపోయింది.వైద్యుడిగా రాత్రింబవళ్లు సేవ చేస్తున్నా ఆయనలో ఏదో అసంతృప్తి. సమాజానికి వైద్యం చేయాలి, తన పరిధి మరింత పెంచు కోవాలి, అపుడే అందరికీ అన్ని సౌకర్యాలు అందించగలం అని భావించిన రాజశేఖర రెడ్డి రాజకీయాలలోకి అడుగు పెట్టాడు. రాజకీయాలు ఈనాడే కాదు, ఆనాడు కూడా అంత స్వచ్ఛంగా ఏమీ లేవు.
అవినీతి, బంధు ప్రీతి, అహంకారం, స్వార్థం– ఇవే రాజ్య మేలుతున్నాయి. కానీ నిజాయితీ గెలుస్తుందనీ, ప్రజల ప్రేమ గెలిపిస్తుందనీ భావించాడు.రాజీలేని పోరాటం చేయడం, విమర్శలను నవ్వుతూ ఎదుర్కొ నడం, అందర్నీ కలుపుకొనిపోవడం, స్థిరంగా నిలబడటం ఆయన నైజం. అందుకే ఆరుసార్లు శాసనసభ్యుడిగా, నాలుగుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నాయకుడిగా శాసనసభలోనూ, పార్లమెంటులోనూ తన గళం వినిపించారు.
క్షమించడం నేర్చుకున్నాడు!
ముక్కుసూటితనం ఆయన తత్త్వం. బెదరడం, పదవి కోసం తలదించుకుని ఒదిగి ఒదిగి వుండటం ఆయనకు రాదు. అందుకే సొంత పార్టీలో కూడా ఆయనను కొందరు కంటకులు ఇబ్బందులకు గురి చేశారు. వారిపై తిరగబడ్డాడు, వారే తోక ముడిచేలా చేశాడు. అయితే ఆయన శత్రువులను క్షమించడం నేర్చుకున్నాడు.ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన తండ్రి వై.ఎస్. రాజారెడ్డిని చంపిన హంతకులపై ప్రతీకారం తీర్చుకోలేదు. హత్యానంతరం వారికి ఆశ్రయం కల్పించింది చంద్రబాబు అని ఆయనకు స్పష్టంగా తెలుసు. అలాంటిది 2003 అలిపిరి వద్ద చంద్రబాబుపై హత్యా ప్రయత్నం జరిగితే వెంటనే హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చిచంద్రబాబును పరామర్శించాడు. అంతేకాదు, తిరుపతి గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై కూర్చుని నిరసన తెలియచేశాడు.
సహృదయత, సచ్ఛీలత, సంస్కారం, క్షమాగుణం, కార్యదక్షత, పట్టుదల ఇవన్నీ ఆయనలోని అంతర్లీన గుణాలు. విమానం ఎక్క గలడు, అవసరమైతే రిక్షాలోనూ కూర్చోగలడు. అధికార దండాన్నే కాదు, కార్యకర్త చేతిజెండాను కూడా మోయగలడు. అందుకే 33 ఏళ్ల చిన్న వయసులోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. 1985 నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉప నాయకుడుగా ఉన్నాడు.కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయన చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావును ఓ సందర్భంలో సెక్రటేరియట్ ముందు నడిరోడ్డులో నిలువరించాడు. ఆ ధైర్యం, ఆ తెగువ చూసి దేశమే ఆశ్చర్యపోయింది.
చంద్రబాబు ప్రపంచ బ్యాంకుకు గుత్తేదారుడనీ, జన క్షేమంకన్నా తన వారి క్షేమం గురించి ఆలోచిస్తాడనీ ఆనాడే గ్రహించాడు. ఆనాడు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ 9 మంది శాసన సభ్యులతో 9 రోజులు నిరాహార దీక్ష చేయించాడు.రాయలసీమ ప్రజలకు సాగునీరు, తాగునీరు అందాలనీ, కరువునేల సస్యశ్యామలం కావాలనీ ఎంతో తపించాడు. రాయల సీమకు ప్రధానంగా నీరు అందించేది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెనాల్. అప్పట్లో దాని సామర్థ్యం 1,105 క్యూసెక్కులు మాత్రమే. దాన్ని లక్ష క్యూసెక్కులకు పెంచాలని పోరాటం చేసిన ముఖ్యుడు రాజశేఖర రెడ్డి.
1986లో లేపాక్షి నుండి 22 రోజులు పాదయాత్ర చేశాడు. ఈ పోతిరెడ్డిపాడు కోసం ఎం.వి. రమణా రెడ్డి, మైసూరా రెడ్డి, భూమన్, శ్రీధర్ ఇంకా అనేకమంది ఇతర నాయకులు ఆయనను అనుసరించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరు వాతనే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 43 వేల క్యూసెక్కులకుపెంచాడు. నేడు రాయలసీమ మీద కపట ప్రేమ ఒలకబోస్తున్నచంద్రబాబు ఆనాడు ఈ పెంచడాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు.
అందరివాడు
నిస్సత్తువతో కుళ్లి కునారిల్లిన కాంగ్రెస్ పార్టీని ఆయన ఒక్కడే భుజం మీదికి ఎత్తుకున్నాడు. తన పోరాట పటిమతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోశాడు. తాను నాయకుడిననీ, అధికారంలో ఉన్నాననీ ఏనాడూ భావించలేదు. కడప జిల్లాలోని ఓ మారుమూల పంచా యితీ ఎన్నికలలో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న తన అనుచరునికి ఇబ్బంది కలిగింది. రిగ్గింగ్ ద్వారా అతడిని ఓడించాలని ప్రత్యర్థులు ప్రయత్నించారు. అది తెలిసిన రాజశేఖర రెడ్డి స్వయంగా వెళ్ళి ఎన్నికల బూత్‌లో ఏజెంటుగా కూర్చున్నాడు. సింహం ఎదురుగాఉంటే చిట్టెలుకల సమూహాలు ఏం చేస్తాయి! తన వారిని కాపాడు కోవటానికి ఆయన ‘సిరికిం జెప్పడు, శంఖ చక్ర యుగముం జేదోయి సంధింప’ అన్నట్లు దిగివస్తాడు.
తానే ఎదగాలని ఆయన ఎన్నడూ అనుకోలేదు. తన వారి చేయిని ఎన్నడూ వదలలేదు. తనను నమ్మినవారిని, వెంట ఉన్న వారిని అందరినీ భుజాలమీద ఎత్తుకుని ఉన్నత స్థానాల్లో కూర్చో బెట్టాడు. నాతోపాటు ఉండవల్లి అరుణ్‌కుమార్, బొత్స సత్యనారా యణ, ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క, అంబటి రాంబాబు, జక్కంపూడి రామ్మోహనరావు, కోమటిరెడ్డివెంకటరెడ్డి, దానం నాగేందర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, సునీతా లక్ష్మా రెడ్డి, ఉదయభాను, వట్టి వసంతకుమార్, రఘువీరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సబితా ఇంద్రారెడ్డి – ఇలా ఇంకాఎందరినో ఎదిగేలా చేశాడు. ఎదుగుతూ వుంటే మురిసిపోయాడు.
తనకు అపకారం చేసిన వారిని, తాను ఓడిపోవాలి అని కోరు కున్న వారికి కూడా సహాయం చేశాడు. రాజకీయ ప్రత్యర్థులను ఓడించాలనుకున్నాడు తప్ప, వారి నాశనం కోరుకోలేదు. ‘పగవారు శరణు జొచ్చిన – మగ తనములు నెరుప, తగునె మగవారలకున్’ అని మహాకవి పోతన అన్నట్లు పగవాడిని కూడా ప్రేమించిన మగవాడు వైఎస్. అలాంటి నాయకుడు ‘న భూతో న భవిష్యతి’.2003 – రాష్ట్ర రాజకీయాలలో పెద్ద మలుపు, చరిత్రలో ఓ కుదుపు.
ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోవాలని, కష్టసుఖాలుతెలుసుకోవాలని పాదయాత్రకు నడుము కట్టాడు. నిలువునా కాల్చే స్తున్న 50 డిగ్రీల ఎండ, వేడిగాలులు, ఏమాత్రం సహకరించని వాతా వరణం. అయినా సరే కదిలాడు, పేదల కన్నీళ్లను చదవటానికి. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 67 రోజులు 1,673 కిలోమీటర్లు అవిశ్రాంతంగా, మధ్యలో ఆరోగ్యం క్షీణించినా పట్టుదలతో నడిచాడు. ఎన్నో అనుభవాలు, ఎన్నో వినతులు, ఎన్నో వేదనలు విన్నాడు. నీళ్లు, కన్నీళ్లు ఎండిన ప్రాంతాలు చూశాడు.
నడిచే చరిత్ర!
2004లో అఖండ మెజారిటీతో ఆయనను గెలిపించుకున్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు రహస్యం అందరికీ తెలుసు, జనం గెలిపించింది రాజన్నను అని. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణం చేసిన క్షణం నేను ఆయన పక్కనే ఉన్నాను. ఆయనలో ఏదో మార్పు గమ నించాను. అధికారంలోకి వస్తే అహంకారం తలకెక్కుతుంది చాలా మందికి. కానీ వైఎస్ ముఖంలో అది లేదు. దైవదర్శనం లభించిన మహర్షి ముఖంలోని ప్రశాంతత, పరిపక్వత కనిపించాయి.
ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచన, నమ్మిన ప్రజలకు అన్నీ తాను కావాలన్న అభిలాష. ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ లాంటి పథకా లను రూపకల్పన చేశాడు, జలయజ్ఞం చేశాడు. పేరుకే ప్రారంభమై ఆగిపోయిన ఎన్నో ప్రాజెక్టులను పరుగెత్తించాడు. ఆయన అందలం ఎక్కినందువల్లనేమో వరుణ దేవుడు ఆనందపడి కావాల్సినన్ని వర్షాలు కురిపించాడు. రైతుల్లో ఆనందం, రాష్ట్రంలో ఆనందం.
ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రతి పని ఓ చరిత్ర. ఎన్నోసంవత్సరాలుగా రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్య నక్సలిజం. ఎప్పుడూ ఎక్కడో ఒకచోట కాల్పులు, మరణాలు. మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, పౌర హక్కుల నేతలు చేసిన విజ్ఞప్తిని ఆయన విన్నారు. నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపారు. ప్రభుత్వం తరఫున ఏర్పాటైన సంఘంలో ఇతర పెద్దలతో పాటు నేనూ ఒక సభ్యుడిని. అధికారంతో కాల్చి చంపడం కాదు, అనురాగంతో నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకువద్దాం అని ఆయన కోరుకున్నాడు.
2009 ఎన్నికలలో అధిష్టానం భయపడింది ఏమవుతుందోనని. వారికి భరోసా ఇచ్చి ఒంటి చేత్తో తిరిగి అధికారంలోకి వచ్చాడు. ప్రజల పట్ల ఆయన నమ్మకం అది. ప్రజలకు ఆయన చేసిన మేలు పట్ల ఉన్న విశ్వాసం అది. అంత గొప్పవ్యక్తి సాహచర్య, స్నేహం, ఆత్మీయత, అభిమానం నాకు లభించాయి అంటే అది నా అదృష్టం. ఆయన చిరునవ్వు నా ఆస్తి. నా భుజం మీద ఆయన చేయి వేసి ‘కర్ణా’ అని పిలవడమే నా ధైర్యం. ఆయన గురించి ఎంత చెప్పినా నాకుఇంకా ఏదో మిగిలే ఉంటుంది. మంచితనం కలకాలం నిలిచిఉంటుంది అన్న అక్షరాలకు ఆయన మూలధనం. మానవుల కన్నీరు మాన్పగా కదిలిన ఆ మహా మనిషికి నేడు జన్మదినం.
-వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్
-భూమన కరుణాకర రెడ్డి