నినాదాలు కాదు, విధానాలు కావాలి | Sakshi
Sakshi News home page

నినాదాలు కాదు, విధానాలు కావాలి

Published Thu, Jul 21 2022 12:10 PM

C Ramachandraiah Writes on Rupee Depreciation, Financial Uncertainty - Sakshi

దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితి మాటలలో వివరించలేనంత ఆందోళనకర స్థాయిలో ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ. 80కి చేరింది. రూపాయి పతనాన్ని ఆపడానికి 1.5 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని కుమ్మరించినా పరిస్థితిలో ఎటువంటి మెరుగుదలా లేదు. ముడిచమురు, బొగ్గు, ఆహార ధాన్యాలు వంటివాటి దిగుమతులు గణనీయంగా పెరిగి దేశం నుండి జరిగే ఎగుమతులు తగ్గాయి. దాంతో, విదేశీ మారక ద్రవ్యం వేగంగా హరించుకు పోతోంది. విదేశీ రుణం రికార్డు స్థాయికి చేరింది. ఫలితంగా విదేశీ చెల్లింపుల సమతౌల్యం దెబ్బతిని కరెంట్‌ ఖాతా లోటును నిర్వహించడంలో ఆర్థిక శాఖ సతమతం అవుతోంది. 

దేశంలో చిల్లర విపణి ధరలు, వంట గ్యాస్, కిరోసిన్, బొగ్గు ధరలు అదుపు తప్పాయి. అన్ని సరుకుల టోకు ధరల సూచీ 15 శాతం పైకి ఎగబాకింది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాల కారణంగా దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. చాలామంది కేంద్రం, రాష్ట్రాలు చేస్తున్న అప్పుల గురించే మాట్లాడుతున్నారుగానీ... కుటుంబాలు చేస్తున్న అప్పుల గురించి మాట్లాడ్డం లేదు. కోవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయి గత్యంతరం లేక పేదలు, మధ్య తరగతి ప్రజలు అప్పుల ఊబిలో దిగిపోయారు.

దేశం ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక దుస్థితి హఠాత్తుగా వచ్చి పడింది కాదు. అలాగని కరోనా దెబ్బతోనూ, రష్యా ఉక్రెయిన్‌ల యుద్ధంతోనూ పూర్తిగా ఈ స్థితి దాపురించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి స్థిరమైన ఆర్థిక విధానం లోపించడమే దీనికి ప్రధాన కారణం. ప్రధాని నరేంద్రమోదీ 2014లో అధికారం చేపట్టేనాటికి దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 7.4 శాతం వృద్ధిరేటుతో ఆరోగ్యకరంగానే ఉంది. పైగా, 2014 తర్వాత దాదాపు నాలుగేళ్లపాటు అంటే 2018 వరకు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా... కేంద్ర ఖజానాకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి.

కానీ, ఈ అనుకూలతను ఆర్థిక రంగ పటిష్టతకు విని యోగించుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలం అయింది. 2016 నవంబర్‌లో నల్లధనం అరికట్టడం లక్ష్యంగా హఠాత్తుగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ఓ విఫల కార్యక్రమంగా మిగిలి పోయింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలోని అసంఘటిత రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది. నిరు ద్యోగం పెరిగింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ విశ్వసనీయత సన్నగిల్లడంతో అనేక మంది డిపాజిట్‌దారులు తమ డబ్బును బ్యాంకుల నుండి ఉపసంహరించుకొని డాలర్ల రూపంలో విదేశీ బాంకుల్లో దాచుకున్నారు. అంటే, భారత బ్యాంకుల్లో ఉండాల్సిన డిపాజిట్లు విదేశాలకు తరలడం వల్ల ‘రూపాయి’పై  భారం పెరగడమే కాక.. దేశ ఆర్థిక ప్రగతికి గొడ్డలిపెట్టుగా పరిణమించింది. కోట్లాదిమందికి ఉపాధి కల్పించే దేశీయ అసంఘటిత రంగాలను దెబ్బతీయడమే పెద్దనోట్ల రద్దు విజయంగా మిగిలి పోయింది.

స్థిరమైన పెట్టుబడులు మాత్రమే ఆర్థిక వ్యవస్థను బలో పేతం చేస్తాయి. కానీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే తాపత్రయంతో నిబంధనలను పూర్తిగా సరళీకృతం చేశారు. వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులను 50 శాతం నుంచి 90 శాతం వరకు అనుమతి ఇస్తున్నారు. మరో పక్క స్టాక్‌ మార్కెట్‌ లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులను (ఎఫ్‌ఐఐలు) ప్రోత్సహి స్తున్నారు. అయితే ఎప్పుడైతే రూపాయి విలువ క్షీణిస్తుందో... అప్పుడు స్టాక్‌ మార్కెట్‌ల నుండి ఎఫ్‌ఐఐల ఉపసంహరణ ఊపందుకుంటుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్ప గూలడం అనేకసార్లు చూశాం. డాలర్‌తో రూపాయి మారకం విలువ వేగంగా పతనం కావడంతో అనేక రంగాలలో ఈ దుష్ఫలితాలు కనపడుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కు వగా అమెరికన్‌ డాలర్‌ చుట్టూ పరిభ్రమించడం వల్లనే ఈ దుస్థితికి ప్రధాన కారణం. అమెరికన్‌ డాలర్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో భారత్‌ అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా బంగారం, ఇతర విలాస వస్తువులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం ఎక్కువైంది. ఇక, దేశాన్ని పన్ను ఉగ్రవాదం నుండి విముక్తం చేయడమే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) లక్ష్యం అని చెప్పుకున్న ఎన్డీఏ ప్రభుత్వం హేతుబద్ధత లోపించిన ఆచరణతో ప్రజలపై పెనుభారం మోపింది.

గత 8 ఏళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు కొండలా పెరిగిపోయాయి. 2014 జూన్‌ నాటికి దాదాపు 2 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు ప్రస్తుతం 10 లక్షల కోట్లకు చేరాయన్న నివేదికలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడతాయి. మొండి బకాయిలు పేరుకుపోతున్నాయంటే అర్థం.. ఆర్‌బీఐ తన బాధ్య తను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నదనే. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్తలను వెనక్కి రప్పించి వారి ఆస్తులను జప్తు చేయించడంలో కూడా కేంద్రం విఫలం అయింది. కాగా, నష్టాల్ని తగ్గించు కోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియ చేపట్టడం అనేక విమర్శలకు గురైంది. తాజాగా, ఎస్‌బీఐ మినహా దేశంలోని అన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే కలిగే అనర్థాలు అనేకం. ఉద్యోగ భద్రత లోపించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు వర్తించవు.

ప్రధాని మోదీ ‘డబుల్‌ ఇంజన్‌ గ్రోత్‌’ వంటి పసలేని నినాదాలకు తాత్కాలికంగానైనా స్వస్తి పలికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. జీఎస్టీని సరళతరం చేయాలి. రూపాయిని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి. నల్లధనాన్ని వెనక్కు రప్పించాలి. అధిక వ్యయంతో కూడిన దిగుమతులను నిలుపుదల చేసి వైవిధ్యభరితమైన ఎగుమతులపై దృష్టి పెట్టాలి. దేశంలోని మానవ వనరులను సద్వినియోగ పర్చుకొని పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడంపైనే దృష్టి పెట్టాలి. రాష్ట్రాలను కలుపుకొని ఉమ్మడిగా దేశం ఎదుర్కొంటున్న ఈ అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి స్థిరమైన ఆర్థిక విధానాలతో తగిన కార్యాచరణ రూపొందించాలి. (క్లిక్: ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!)


- సి. రామచంద్రయ్య 
ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యులు

Advertisement
 
Advertisement
 
Advertisement