ఇక్కడ పార్లమెంట్‌ ఉన్నా అధికారం రాజరికానిదే! | Bahrain Has A Parliament But Is Ruled By A Monarchy | Sakshi
Sakshi News home page

ఇక్కడ పార్లమెంట్‌ ఉన్నా అధికారం రాజరికానిదే!

Published Mon, Nov 21 2022 1:46 AM | Last Updated on Tue, Nov 22 2022 12:54 PM

Bahrain Has A Parliament But Is Ruled By A Monarchy - Sakshi

బహ్రెయిన్‌ నేను సందర్శించడానికి ఎంపిక చేసుకున్న గమ్యస్థానం కాదు. దాన్ని ఎమిరేట్స్, ఖతర్‌కు చెందిన పేద బంధువులాగా భావించేవాడిని. కానీ నాకు తెలిసిన వాస్తవం ఏమిటంటే ఆ ప్రాంతం గురించి నాకు ఏమీ తెలీదు. నా అభిప్రాయం నా అజ్ఞానానికి ప్రతిబింబంగా ఉండేది. గత వారాంతంలో నాదెంత తప్పుడు అభిప్రాయమో నేను కనిపెట్టాను. బహ్రెయిన్‌ వెచ్చని, సంతోషకరమైన, ఆకర్షణీయమైన దేశం. నమ్మలేనంత శుభ్రంగానూ, దుబాయ్, అబుదాబీ, ఖతార్‌ లాగే ఆధునికంగానూ ఉంది. కానీ బహ్రెయిన్‌  చాలా చిన్నదేశం. కేవలం 800 చదరపు కిలోమీటర్ల  విస్తీర్ణం మాత్రమే ఉన్న దేశం. వాస్తవానికి ‘బహ్రెయిన్‌ ద్వీపం’ అనే పేరు కలిగి ఉన్న ద్వీప సమూహం. కొద్ది కాలం క్రితం ఈ ద్వీపం 40 కిలోమీటర్ల పొడవు, 16 కిలోమీటర్ల వెడల్పు ఉన్న భూభాగంగా మాత్రమే ఉండేది. సముద్రం నుంచి ఏర్పడుతూ వచ్చిన ఈ దేశం (ఇప్పటికీ అలా జరుగుతూనే ఉంది) తన సైజును బహుశా రెట్టింపు చేసుకోగలిగింది. కానీ మాల్దీవులు, సింగపూర్‌ తర్వాత ఇది ఇప్పటికీ ఆసియాలో మూడో అతి చిన్న దేశంగా ఉంది.

బహ్రెయిన్‌ జనాభా 16 లక్షలు మాత్రమే. భారత దేశం నుంచే 4 లక్షల మంది ప్రవాసులు ఈ దేశానికి వచ్చారు. వీరిలో నాలుగింట మూడొంతుల మంది కేరళకు చెందిన వారే. ఈ దేశ జనాభాలో 43 శాతం మంది అరబ్‌ యేతర ఆసియన్లే అని వికీపీడియా పేర్కొంటోంది. వీరంతా ప్రవాసం వచ్చిన కార్మికులే అని నా అంచనా. స్థానిక జనాభా 47 శాతం మాత్రమే. 

ఈ చిన్న ద్వీపం గురించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. అరబ్‌ ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావి 1931లో ఇక్కడే బయటపడింది. ఈరోజు బహ్రెయిన్‌ ప్రముఖ చమురు ఉత్పత్తిదారు కాదు. కానీ ఈ చమురు బావి నిరుపయోగకరంగా ఉన్నప్పటికీ పర్యాటకులకు మాత్రం గర్వంగా తన్ను తాను ప్రదర్శించుకుంటోంది. బహ్రెయిన్‌ దీనార్‌ ప్రపంచంలోనే రెండో అతి శక్తిమంతమైన కరెన్సీ. ఒక దీనార్‌కి మీరు 2.65  అమెరికన్‌ డాలర్లు పొందవచ్చు. కాబట్టి బహ్రెయిన్‌ మరీ అల్లాటప్పా దేశం కాక పోవచ్చు.

బహ్రెయిన్‌లోని కేరళీయ సమాజం ఆహ్వానం మేరకు నేను ఆ దేశాన్ని సందర్శించాను. ఇది ఉజ్జ్వలమైన, అంకిత భావం కలిగిన సామాజిక సంస్థ. అలాగే డీసీ బుక్స్‌కి కూడా ఇది పేరుపొందింది. ద్వీపంలో జరిగే బుక్‌ ఫెస్టివల్‌లో కేరళీయులు ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. ఈ పుస్తక ప్రదర్శనశాల జాతీయ ఎన్నికలతో ముడిపడి ఉండటం నాకు ఆశ్చర్యాన్నీ, సంతోషాన్నీ కలిగించింది. మనదేశంతో పోలిస్తే ఇక్కడి ఎన్నికలు చాలా చాలా చిన్నవే కావచ్చు కానీ వాటిని వీరు నిర్వహించే తీరు మాత్రం నన్ను పరవశింపజేసింది.

బహ్రెయిన్‌లో ఉన్నది రాచరిక వ్యవస్థే. అది స్వభావ రీత్యా రాజ్యాంగబద్ధమైనదే కావచ్చు కానీ అధికారం మాత్రం రాజు హమీద్, అల్‌ ఖలీఫా రాజకుటుంబం చేతిలో మాత్రమే ఉంటుంది. అయితే 2002 నుంచి ప్రతి అయిదేళ్ల కోసారి పార్లమెంటును ఎన్నుకుంటూ ఉన్నారు. ఇది 40 సీట్ల సింగిల్‌ ఛాంబర్‌ హౌస్‌. ఎగువ, దిగువ సభల్లాంటివి ఉండవు. బహ్రెయిన్‌ రాజ్యంలో రాజకీయ పార్టీలు లేవు. పార్లమెంటుకు అభ్యర్థులు స్వతంత్రులుగానే పోటీ చేయాల్సి ఉంటుంది. ఫ్రాన్స్‌లాగే, ఇక్కడా ఎన్నికలు రెండు దశలలో ఉంటాయి. తొలివిడత ఎన్నికలు నేను రావడానికి ముందే నవంబర్‌ 12న జరిగాయి. 40 పోలింగ్‌ బూత్‌లలో 344 మంది అభ్యర్థులకు ఓటు వేయడానికి 3,44,713 మంది బహ్రెయిన్‌ పౌరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా ఈ 344 మంది అభ్యర్థుల్లో 40 మందిని ఎన్ను కోవడానికి ఓటింగ్‌లో పాల్గొన్నారు. 

ఇక్కడ విస్తరించి ఉన్న సీఫ్‌ మాల్‌లో విహారయాత్ర అత్యంత ప్రజాదరణ పొందింది. నేను ఈ దేశాన్ని సందర్శించినప్పుడు ఓటు వేయడానికి తమ వంతు సమయం కోసం ఎదురు చూస్తున్న ఓటర్లు స్టార్‌బక్స్‌ కాఫీలు సేవిస్తూ, హాగెన్‌–దాస్‌ ఐస్‌క్రీములను లాగించేస్తూ కనిపించారు. ఇక్కడ అన్నీ ఎయిర్‌ కండిషన్‌తో సౌకర్యవంతంగా ఉంటాయి!

ప్రవాసం వచ్చినవారు, గల్ఫ్‌ సహకార దేశాలకు చెందిన పౌరులు దేశంలో సొంత ఆస్తులను కలిగి ఉండి ఇక్కడే జీవిస్తూ ఉన్నట్లయితే వారు ఓటు వేసేందుకు బహ్రెయిన్‌ అనుమతిస్తుంది. నేను ఇక్కడ పర్యటించిన ప్పుడు జరిగిన ఎన్నికల్లో 73 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఇది చాలా అధిక శాతమట. ఇక రెండో విడత పోలింగ్‌ 13వ తేదీన ముగిసింది

తొలి రౌండ్‌ ఓటింగ్‌ తర్వాత, ‘ది వాయిస్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌’ అని తనను తాను పిలుచుకునే గల్ఫ్‌ డైలీ న్యూస్‌ పత్రిక, పోలింగ్‌ను విజయవంతం చేసినందుకు ఓటర్లకు రాజు అభినందనలు తెలిపారని రాసింది. ఇది 16 పేజీల ట్యాబ్లాయిడ్‌. రాజు తన సంతోషాన్ని రాజరికపు హుందా తనంతో ప్రకటించారు. ‘మన ప్రియతమ రాజరికం కోసం సాధించిన ఈ ఘన విజయం పట్ల మమ్ము మేమూ, మా విశ్వసనీయ ప్రజలనూ అభినందించుకుంటున్నాము’ అని రాజు పేర్కొన్నారు. యువరాజు, ప్రధానమంత్రి రాజును అభినందనలతో ముంచెత్తారని పత్రికలు నివేదించాయి. అంటే సముద్ర మట్టానికి సమాంతరంగా ఉండే ఈ ద్వీపంలో  సామరస్యం పొంగిపొరలుతోందన్న మాట.

బహ్రెయిన్‌లో రెండు అమెరికా స్థావరాలు ఉన్నాయి. పైగా ఇది ‘నాటో’ కూటమిలో ప్రముఖ మిత్ర దేశం కూడా! అయితే ఎంత గాలించినా ఒక్కరంటే ఒక్క అమెరికన్‌ సైనికుడు కూడా కనిపించలేదు. సౌదీ అరేబియన్లు తరచుగా కనిపిస్తుంటారు. 1980లలో చిత్తడినేలపై నిర్మించిన దారిలో అరగంట ప్రయాణిస్తే చాలు సౌదీ పౌరులు ఇక్కడికి చేరు కోవచ్చు. వారాంతపు సందర్శకులుగా వారు తరచూ ఇక్క డికి వస్తుంటారు. సౌదీ రాజరికం తమకు నిరాకరించిన ఆల్కహాల్‌ని బహ్రెయిన్‌ రాజు అనుమతించారు మరి! 

చివరగా, ఫోర్‌ సీజన్స్‌ షాపులో నేను గత కొన్ని సంవత్సరాలుగా దొరకని చక్కటి బర్గర్‌ని రుచి చూశాను.  గతంలో మీరు ఎమిరేట్స్‌ని సందర్శించి ఉన్నప్పటికీ షాపింగ్, సముద్ర క్రీడలు, ఎడారి, ఆధునిక నగరం వంటి వాటిని ఇంకా ఇష్టపడుతున్నట్లయితే మీ తదుపరి వారాం తపు సెలవుల్లో బహ్రెయిన్‌ రావడానికి ఎందుకు ప్రయత్నిం చకూడదు?

కరణ్‌ థాపర్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌
(బహ్రెయిన్‌ నుంచి రాసిన వ్యాసం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement