త్రికళింగ చరిత్ర – సరికొత్త కోణం!

Abk Prasad Article On Kalinga Dynasty - Sakshi

రెండో మాట

మానవ చరిత్ర ఎంత ప్రాచీనమో దాని మీద వ్యాఖ్యానం అంత నిత్యనూతనం.  మరిన్ని ఆధారాలు బయటపడుతున్నకొద్దీ చరిత్ర కొత్త వెలుగులు సంతరించుకుంటూ ఉంటుంది. అయితే ఆధారాలు ఒక్కటే సరిపోవు. చరిత్రకారుల పరిమితులు, భావజాలాలు బద్దలైనప్పుడే ఇతిహాసపు చీకటి కోణాల్లో దాగిన కథనాలు బయటకు వస్తాయి; కనుమరుగైనవి తెరమీదికి తోసుకొస్తాయి. ఈ కోవలోకి వచ్చే రచన ‘త్రికళింగ దేశ చరిత్ర’. త్రికళింగం ఒకప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా సర్వస్వతంత్రంగా వర్ధిల్లింది. బౌద్ధానికి అవసరమైన ఆర్థిక, రాజకీయ మూలాధారాన్ని అందించింది. విదేశీ వాణిజ్యానికి, నౌకా వాణిజ్యానికి అనువుగా ఉన్న ఈ తూర్పుతీరం క్రీస్తుపూర్వమే ఎగుమతి, దిగుమతులతో వైభవాన్ని చాటింది. ఆర్యుల దాడిని సమర్థంగా ఎదుర్కొంది. ఇలాంటి ఎన్నో వ్యాఖ్యానాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు చరిత్రకు సర్వసమర్థనీయ వెలుగులు అద్దేవాళ్లే కావాలిప్పుడు!

‘‘ఇతిహాసపు చీకటి కోణం / అట్టడుగున పడి కాన్పించని / కథలన్నీ కావాలిప్పుడు! / దాచేస్తే దాగని సత్యం’’

ఆ మరుగున పడి ప్రజలకు కనుమరుగైపోయిన ఆ చీకటి కోణాలలో ఒకటి ‘త్రికళింగ దేశ చరిత్ర’! ఇంతవరకూ సాధికారికంగా ఆ ప్రజా చరిత్రకు న్యాయం జరగని ఘడియలలో– తెలుగు, దక్షిణ మధ్య ద్రావిడ ముండారి ప్రజల చరిత్రకు ఇంత కాలానికి వెలువడిన సామాజిక శాస్త్రాధ్యయన వ్యాఖ్యానం ఇది. రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త, పరిశోధకుడు ప్రొఫెసర్‌ కె.ఎస్‌. చలం కలం నుంచి వెలువడిన గ్రంథ రాజం ఇది! ఆ మాటకొస్తే సింధూనదికి అవతలి నుండి వలస వచ్చిన ఆర్యులు, సింధుకు ఈవలనున్న ద్రావిడ జాతుల, మూలవాసుల జీవనాన్ని, జీవితాలను నాశనం చేస్తున్న దశలో ఆ శత్రువులను వీరో చితంగా ఎదుర్కొని నిలబడి వర్ధిల్లిన తెలుగు ప్రాంతం ‘త్రికళింగ’ దేశమే. దాచినా దాగని ఈ చారిత్రక సత్యాన్ని తిరుగులేని అనేక ఆధారాలతో, బహుశా ఈ కోణంలో త్రికళింగ దేశ చరిత్రను వెలార్చిన మొదటి చరిత్ర కారుడు – ఆచార్య చలం. 

ఎప్పుడైతే మహాకవులు గురజాడ, శ్రీశ్రీలు ప్రజాచరిత్రల నిరూ పణకు సిద్ధమయ్యారో ఆనాడే స్వార్థపూరిత చీకటి కోణాల అట్టడు గున పడిపోయి కనిపించని మానవ కథల ప్రాదుర్భావ పతనాలకు కారణాల్ని బయటకు లాగారు. జీవనదుల ఆధారంగా విలసిల్లిన నాగరికతలలో సామాన్యుడి జీవనం గురించి మనసుపెట్టి శోధించడం దాని ఫలితమే. ఇంతకూ తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల గురించి, ప్రభువులెక్కిన పల్లకీల గురించి కాదు... వాటిని మోసే బోయీల గురించి చారిత్రక కోణం నుంచి వాకబు చేసుకున్నారు! తల మున్కలుగా సాగిన ఈ తవ్వులాట నుంచే సామాజిక చరిత్రలకు చోద కాలు, చోదకులు ప్రభవిల్లుతూ వచ్చారు. అలా త్రికళింగ దేశ చరిత్రకు తిరుగులేని సాక్ష్యాలను ప్రొఫెసర్‌ చలం ఈ పుస్తకంలో బలంగా పొందుపరిచారు. 

ఇంతవరకూ ‘త్రికళింగం’ స్వతంత్రమైన ఉనికి, ఉచ్ఛ స్థితిగతులు పరిశోధకుల కంటికి కానరాకపోవడానికి లేదా కంటికి ఆనకపోవడా నికి గల లోతైన ఎన్నో కారణాలను చలం మొత్తం ఆంధ్రదేశం ఉనికి ఉచ్ఛస్థితులకు కారణాలతో సహా ‘త్రికళింగ దేశ చరిత్ర’లో బలంగా నిరూపించగలిగారు. ఆర్య సంప్రదాయ వాదులైన కొందరు చరిత్ర కారుల ముసుగులో ప్రతి అవశేషాన్నీ ఉత్తరాదికి, ఆర్య సంప్రదాయా నికి ముడి పెడుతూ రావడాన్ని ప్రొఫెసర్‌ చలం బలంగా ఖండిం చారు. భారతదేశంలో తొలి నివాసుల ఉనికి దక్షిణ భారత ప్రాంత జనావాసాలకు ఎలా చెందినదో ఇంతకు ముందు కొంతవరకు రాళ్ల బండి సుబ్బారావు అనే చరిత్రకారుడు నిరూపించారు. ఆ తర్వాత ‘త్రికళింగం’ ఆవిర్భావం, అది ఉనికిలోకి వచ్చిన తీరుతెన్నులు, క్రీస్తు పూర్వం 3–5 శతాబ్దాల నాటి బౌద్ధం, అంతకుముందే తూర్పు కను మలలో మానవ సంచారం ఉనికిలో రూఢ్యమయింది. 

ఈ ‘త్రికళింగం’ చరిత్ర ఎంత ప్రాచీనమైనదంటే, ఎంతగా ఆర్యుల సాంస్కృతిక దాడులకు కూడా అందనంత ఎత్తులో ఉందంటే– ‘మూడు కళింగల’ మాట క్రీ.పూ. 3వ శతాబ్దానికే, అంటే బౌద్ధయుగం నాటికే ప్రాచుర్యంలో ఉండటం చరిత్ర రచనకు ఎంత కీలకమైనదో చలం మరోసారి సిద్ధాంతీకరించారు ఈ గ్రం«థంలో! అసలు కళింగం అన్నమాటకు చాలా విస్తృతార్థం ఉన్నదని చలం భావన. ఎందుకంటే, ‘కళింగ’ శబ్దం క్రీ.పూ. 2వ శతాబ్ది శాసనాల్లో కూడా లభించడం. మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత (క్రీ.పూ. 322), క్షత్రియులు కాని శూద్రులు (అంతకుముందు అణగార్చబడిన జాతులు) పరిపాలకులుగా గ్రీకు రాజ్యాల సరిహద్దుల నుండి దక్షిణా దిన మైసూరు దాకా విస్తరించి ఉండటం భారతదేశంలో స్థానిక తెగల, జాతుల శక్తి, సామర్థ్యాల, పాలనా సత్తా వైశిష్ట్యాన్ని నిరూపించింది! 

చంద్రగుప్త మౌర్యుని కాలంలో ‘కళింగం’ స్వతంత్ర దేశంగా ఉన్నందున, అందునా తూర్పున సముద్ర తీరస్థ ప్రాంతంలో ఉన్నం దున– విదేశీ వాణిజ్యానికి, నౌకా వాణిజ్యానికి, తూర్పుతీరం అను వుగా ఉండేది. వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, ఉద్యాన, అటవీ సంపద, ఎగుమతి, దిగుమతి వాణిజ్యంలో ఆర్థికంగా, రాజకీయంగా సర్వస్వతంత్రంగా కళింగం వర్ధిల్లిందని మరచిపోరాదు! ఇంతకూ అసలు విశేషమేమంటే, ఈ వాణిజ్య కార్యక్రమాలకు బౌద్ధ, జైన ధర్మ ప్రచారకులు చేదోడు, వాదోడు కావటం! ఇలాంటి పరిణామం హేతువాద వ్యతిరేక వర్గాలకు, పురాణ కల్పిత గాథలకు బద్ధ విరుద్ధం. అశోకుడిని గురించి, జాతీయ చిహ్నంగా అశోకచక్రం గురించి మనం ఎంతగా మురిసిపోతున్నా శ్రీశ్రీ అన్నట్టు కళింగ యుద్ధానంతరమే (క్రీ.పూ. 260) అశోకుడు శాంతి ప్రవచనాలు వల్లిం చాల్సి వచ్చింది. అప్పటికిగాని, జాతి ప్రజలకు జరిగిన నష్టం అతనికి తెలిసి రాలేదు! 

ఆ మాటకొస్తే బౌద్ధానికి అవసరమైన ఆర్థిక, రాజకీయ మూలా ధారాన్ని అందించిందీ ‘త్రికళింగ’ దేశ చరిత్రేనని మనం మరచి పోరాదు! ఆనాటి త్రికళింగ గణరాజ్యాలు ఆ యుద్ధం తర్వాత చెట్టుకొకటి పుట్టకొకటిగా చీలిపోయాయి. కనుకనే మన రాజ్యాంగం మౌలిక సూత్రాలకు అసలు ఆధారం– అశోక చక్రమే కాదు, బుద్ధుని లౌకికతత్వం, ప్రజాస్వామ్య విలువలు అలా అలా నిలిచి ఉండటం కారణమని ప్రొఫెసర్‌ చలం వ్యక్తం చేశారు. ‘త్రికళింగం’ వ్యాప్తి ఒక్క ఆంధ్రదేశంతోనే సరిపెట్టుకున్నది కాదు. అది ‘మూడు కళింగులు’గా ఎలా విస్తృతి చెందిందో ఈ గ్రంథంలో వివరించారు. ఈ ‘త్రికళింగం’ అటు 1) మిడ్నపూర్‌ దాకా ‘దామోదర నది’ని ఆనుకొని ఉన్న ప్రాంతం నుంచి సువర్ణరేఖ వరకు, 2) మహానది కుడి కాల్వ నుంచి రిషికుల్య నది దాకా, 3) బరంపురం, గంజాం మొదలు కళింగపట్నం దాకా ఉన్నదే ‘త్రికళింగం’. సంస్కృతం నడమంత్రంగా చేరి ‘మూడు కళింగల’ మాటను ‘త్రికళింగం’గా మార్చింది. 

అంతేకాదు ద్రావిడ భాషల ఆవిర్భావ వృద్ధి దశల వివరణలో భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ ప్రజల సామాజిక అంశాల విపులీ కరణలో, విశదీకరణలో ప్రొఫెసర్‌ కె. వెంకటేశ్వర్లు (ఆంధ్ర యూని వర్సిటీ), రొమిలా థాపర్‌ల కృషి ప్రశంసనీయం. ద్రావిడ భాషా కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉండి, పెద్ద పీట వేయించుకున్నది తెలుగేనని నిరూపించిన ఘనతతో పాటు, త్రికళింగ దేశ చరిత్రను నూతన కోణం నుంచి పరిశీలించి ఇతిహాసపు చీకటికోణానికి సర్వ సమర్థనీయమైన వెలుగులు దిద్దిన ప్రొఫెసర్‌ చలం సదా అభినంద నీయులు! ‘పరమాణువు సంకల్పంలో ప్రభవం పొందిన మానవుడి’కి ఈ గ్రంథమే ఒక అంకితం! ఎన్నదగు లింగములు మనకెన్నిలేవు? తత్కోటిలో మూడు లింగ ముల వలన లెక్కకుంతెచ్చి ఒకడు ‘త్రిలింగ’ శబ్ద సృష్టిగావించె, దంత పుష్టికొరకు!! – ‘తెనుగు లెంక’ తుమ్మల సీతారామమూర్తి  

వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

వివరణ: టంగుటూరి శ్రీరామ్‌ రచన ‘రాజకీయ క్షేత్రంలో ఒక కేసరి’ (ఆగస్టు 23 సంచిక)లో కొన్ని పొరపాట్లు దొర్లాయి. ఆ పొరపాట్లకు రచయిత ఇచ్చిన వివరణ... ప్రకాశం చేపట్టిన కార్యక్రమాలపై ‘కేసరులకే సాధ్యం’ అని బాపూజీ అన్న ఘటన స్వరాజ్యం వచ్చిన 1947 కన్నా ముందే ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ కాలంలో జరిగింది. ఇక, 1953లో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి తొలి సీఎంగా ప్రకాశం ఉన్నప్పుడు చేసిన ఖైదీల విమోచన నాటికి గాంధీ మరణించారు. గమనించగలరు. – ఎడిటర్‌

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top