మహిళా అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహిస్తే గ్రామీణ ఆర్థిక ప్రగతికి సరికొత్త ఊపు
తాజా పాలసీ పేపర్‌లో ఐసీఏఆర్–నార్మ్ వెల్లడి
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చటంలో ‘మహి ళా అగ్రిప్రెన్యూర్స్’పాత్ర అత్యంత కీలకమని, మహిళా అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహిస్తే గ్రామీణ ఆర్థిక ప్రగతికి సరికొత్త ఊపు వస్తుందని హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (ఐసీఏఆర్–నార్మ్) విడుదల చేసిన తాజా విధాన పత్రం స్పష్టం చేసింది. వ్యవసాయాన్ని కేవలం జీవనాధార వ్యాపకంగా కాకుండా లాభసాటి వాణిజ్యంగా తీర్చిదిద్దే సత్తా మహిళా పారిశ్రామికవేత్తలకు ఉందని, అడ్డంకులను తొలగిస్తే ఈ లక్ష్యం సాకారమవుతుందని ఈ పాలసీ పేపర్ నొక్కిచెప్పింది.
గ్రామీణ నిరుద్యోగానికి శాశ్వత పరిష్కారం
వ్యవసాయంలో మహిళల శక్తి సామర్థ్యాలను వ్యాపార రూపంలోకి మళ్లించినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. మహిళా అగ్రిప్రెన్యూర్లకు సరైన మౌలిక వసతులు, సాంకేతిక తోడ్పాటు, ఆర్థిక చేయూత అంది స్తే గ్రామీణ నిరుద్యోగానికి శాశ్వ త పరిష్కారం లభిస్తుంది.
– డా. రామన్ మీనాక్షి సుందరం, సంచాలకులు, ఐసీఏఆర్–నార్మ్, రాజేంద్రనగర్
ఎదురవుతున్న సవాళ్లు
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు నూతన అగ్రి–స్టార్టప్‌లు, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల తయారీలోకి అడుగుపెడుతున్నా, అనేక అడ్డంకులు ఎదురవుతున్నా యి. గ్లోబల్ స్టార్టప్ డేటా ప్లాట్‌ఫామ్ ప్రకారం, గత పదేళ్ల (2015–2024) మధ్య భారతీయ వ్యవసాయ స్టార్టప్‌ల సంఖ్య ఏటా 22% పెరుగుతున్నా, భారతీయ మహిళలు స్థాపించే వ్యవసాయ స్టార్టప్‌ల సంఖ్య సగటున 26% క్షీణించింది. దీనికి అనేక కారణాలున్నాయని నార్మ్ తెలిపింది. ఆస్తులు మహిళల పేరిట లేకపోవటంతో బ్యాంకుల నుంచి పూచీకత్తు లేని రుణాలు పొందలేకపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరఫరా గొలుసు, డిజిటల్ మార్కెటింగ్ పద్ధతులపై తగినంత శిక్షణ లభించడం లేదు.
కీలక సిఫారసులు
గ్రామీణ మహిళా అగ్రిప్రెన్యూర్లలో ఆత్మవిశ్వాసం పెంచడానికి ప్రత్యేకంగా మార్గదర్శకత్వం, ప్రాజెక్ట్ గైడె¯న్స్ అందించే ఇంక్యుబేషన్ కేంద్రాలను జిల్లా స్థాయికి విస్తరించాలి. సులభతర వడ్డీ రేట్లతో, ఎలాంటి పూచీకత్తు లేకుండా ప్రత్యేక రుణాలు అందించాలి. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగంపై సమగ్ర శిక్షణ ఇవ్వాలి. మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (మహిళా ఎఫ్‌పీవోలు) ఏర్పాటు చేసి, స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్‌తో అనుసంధానం
కలి్పంచాలని నార్మ్ సూచించింది.
– సాక్షి, స్పెషల్ డెస్క్


