గెలుపు

The win is this weeks story in Sakshi Funday Magazine

విక్రాంత్‌కి మెలకువ వచ్చింది. తాను చనిపోయాడని అతనికి తెలుసు. ఇది స్వర్గమా లేక మధ్యలో ఏదైనా మజిలీనా.. అనుకుంటూ చుట్టూ చూశాడు. అది ఒక గది. విక్రాంత్‌ ఆ గదిలోని ఒక కిటికీ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఏదో ఆఫీస్‌ రూమ్‌లా ఉందా గది. కాస్త దూరంలో ఉన్న ఇంకో చైర్‌లో ఎవరో వ్యక్తి కూర్చుని టేబుల్‌ లైట్‌ వెలుగులో ఏదో రాసుకోవడం కనిపిస్తోంది. తాను చనిపోయిన విషయం విక్రాంత్‌కి స్పష్టంగా గుర్తుంది.

అర్ధరాత్రి వేళ ఇంటికి వెళుతుంటే.. స్కూటీ మీదనించి ఎగిరి పడటం, రోడ్డు పక్కనున్న డివైడర్‌కి తల గుద్దుకోవడం, ఆ ఫోర్స్‌ తెలియడంతోనే ప్రాణం పోతోందని అర్థంకావడం, కళ్ళ మీంచి కారిపోతున్న రక్త ధారల మధ్యలోంచి తనని గుద్దిన కారు వేగంగా అక్కడినించి వెళ్లిపోవడాన్ని మసక మసకగా చూడటం.. ఇవన్నీ అతనికి గుర్తున్నాయి. ఆ యాక్సిడెంట్‌లో అతను బతికే అవకాశమే లేదు.

తాను నిజంగా చనిపోయాడని అతనికి తెలీడానికి కారణం అదొక్కటే కాదు. తనకి శరీరం లేని విషయం, ఇప్పుడు ఆలోచిస్తున్నది తన ఆత్మ మాత్రమేనన్న సంగతి అతనికి బాగా అర్థమవడం కూడా! తన సెన్సరీ ఆర్గాన్స్‌ అన్నీ చాలా గొప్ప వృద్ధి పొందినట్టుగా, బతికి ఉన్నప్పటి అనుభూతికి భిన్నమైన గ్రాహ్యత ఏదో అతనికి తెలుస్తోంది. ఎక్కడున్నాడు మరి! కొంచెం వెనక్కి జరిగి కిటికీ కర్టెన్‌ని జరిపి బయటకి చూశాడు. అంతా చీకటి. 

వీధి లైట్లు కూడా వెలగడం లేదు. ఇంతలో అతనున్న గదిలో కదలికకి మళ్ళీ తిరిగి చూశాడు. ఆ గదిలో కూర్చుని ఉన్న వ్యక్తి.. భయం, అయోమయం నిండిన ముఖంతో కదిలిన కర్టెన్‌లోంచి లోపలికి వస్తున్న వాహనాల హెడ్‌ లైట్‌ల వెలుగును చూస్తున్నాడు. ఆ వెలుగు నీడల మధ్య ఆ వ్యక్తిని గుర్తు పట్టాడు విక్రాంత్‌. అతను రఘు. తండ్రి అతనికి విక్రాంత్‌ అని పేరు పెట్టినప్పుడు అందరూ నవ్వారట. ‘నీ రాతల పైత్యం నీ కొడుకు పేరులో కూడా కనిపిస్తోందిరోయ్‌’ అంటూ స్నేహితుల్లాంటి శత్రువులు వెటకారం చేశారట.

‘నా కొడుకు ఈ జీవితమనే యుద్ధాన్ని గెలిచి విక్రాంతుడవాలి. అందుకే ఆ పేరు పెట్టాను’ అనేవాడట తండ్రి. అతను స్కూల్‌ చదువుకి వచ్చినప్పుడు కూడా పిల్లలు ‘వికారం వికారం’ అని ఏడిపించేవారు. తెలుగు మాస్టారు విశ్వనాథంగారు మాత్రం ‘మంచి మోడరన్‌ పేరు పెట్టాడురా మీ నాన్న!’ అన్నరోజు తాను పడిన సంతోషం ఇంకా గుర్తుంది విక్రాంత్‌కి. ఇంటికెళ్లి తండ్రికి ఎంతో గొప్పగా చెప్పాడు ఆ విషయం.

మురిపెంగా నవ్వి ముద్దు పెట్టుకున్న తండ్రి, ప్రేమగా, గారంగా తనని చూసుకున్న తండ్రి అనుకోకుండా అనారోగ్యం బారిన పడ్డాడు. పెద్దగా ఆస్తులేవీ లేని, కో ఆపరేటివ్‌ బ్యాంక్‌లో క్లర్క్‌ ఉద్యోగం చేస్తున్న తండ్రికి సరైన వైద్యం అందలేదు. అసలు రోగమేమిటో కూడా తెలీకుండానే నెల తిరక్కుండా తననీ,  అమాయకురాలైన అమ్మనీ అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు. ఉన్న ఒక్క మేనమామే వాళ్ళకి దిక్కయ్యాడు.

‘ఒక్కడే మగపిల్లాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది’ అని చుట్టుపక్కల వాళ్ళు అనుకోవడం విక్రాంత్‌కి తెలుసు. ఆ మేనమామ కొడుకే రఘు. రఘు ముఖంలో కనిపిస్తున్న ఆ భయం చూస్తుంటే విక్రాంత్‌కి అదో విధమైన ఆనందం కలిగింది. మెల్లగా కర్టెన్‌ వదిలేశాడు. రఘు ఓసారి గదంతా కలియజూసి, తిరిగి రాసుకోవడం మొదలుపెట్టాడు.

మరోసారి కర్టెన్‌ జరిపి రఘు రియాక్షన్‌ ఏమిటో చూడాలనిపించింది విక్రాంత్‌కి. ‘చిన్న పిల్లాడిలా ఏంటిది!’ అనుకుని తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు. చనిపోయాడు సరే, తన ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? స్వాతి ఎంత కంగారు పడుతూంటుందో, తను యాక్సిడెంట్‌లో చనిపోయిన విషయం ఇంకా తెలిసిందో లేదో, సహజ తన కోసం ఎదురు చూసీ చూసీ నిద్రపోయి ఉంటుంది.

సూపర్‌ మార్కెట్‌లో ఆ ఉద్యోగం వల్ల వచ్చే సంపాదనతో గడవక, పిజ్జా డెలివరీలు చేస్తుండటంతో ఇంటికి వెళ్ళడానికి ఒక టైమంటూ లేకుండాపోయింది. తను ఎప్పటిలాగే తిరిగి వస్తాడని అనుకుంటూండి ఉంటుంది స్వాతి. ఎదురుగా టేబుల్‌ మీద ఉన్న సెల్‌ మోగడంతో విక్రాంత్‌ అటువైపు చూశాడు. రఘు ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తూనే ఏం విన్నాడో గానీ ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు.

‘ఎప్పుడు? ఎక్కడ? వస్తున్నా...’ అంటూ రూమ్‌ లోంచి బయటకి పరుగుతీశాడు. తిరిగి చూసేసరికి హాస్పటల్లో ఉన్నాడు విక్రాంత్‌. ఎదురుగా బెడ్‌ మీద పదిహేడు, పద్దెనిమిదేళ్ల అబ్బాయి వెంటిలేటర్‌ మీద కనిపించాడు. దగ్గరికి వెళ్ళాడు విక్రాంత్‌. ముఖానికి కూడా బాగా గాయాలయ్యాయి. బతకడం కష్టంలాగే అనిపిస్తోంది. తర్వాతి నిమిషంలో పోలీస్‌ యూనిఫామ్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు రఘుతో మాట్లాడుతూండటం కనిపించింది విక్రాంత్‌కి.

ఈసారి హాస్పిటల్లోని విజిటింగ్‌ రూమ్‌లో ఉన్నాడు విక్రాంత్‌. ఈ మార్పులు, ప్లేస్‌లు, టైమ్‌ ఒక్కసారిగా ముందుకు జరిగిపోవడం ఇవన్నీ సహజంగానే అనిపిస్తున్నాయి విక్రాంత్‌కి. బతికి ఉన్నప్పుడే కనుక ఇలా జరిగి ఉంటే, తనకేవో అద్భుత శక్తులు లభించాయని అనుకునేవాడేమో! ‘చాలా స్పీడ్‌గా వెళ్లి.. ఆగి ఉన్న లారీని గుద్దుకున్నాడు. పైగా డ్రింక్‌ చేసి ఉన్నాడు. మైనర్‌ కదా. అసలు కారెలా ఇచ్చారు మీరు అబ్బాయికి?’ ఇద్దరిలో కొంచెం పొడుగ్గా ఉన్న పోలీస్‌ అడుగుతున్నాడు రఘని. ‘వాడు కారు తీసుకెళ్లిన విషయమే నేను గమనించలేదు సార్‌.

ఎప్పుడు తీశాడో ఏమో!’నిజమో అబద్ధమో తెలీదు గానీ రఘు శరీరం వణకడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కుర్రవాడు రఘు కొడుకన్నమాట. పోలీస్‌ ఇంకా గట్టిగా గదమాయిస్తున్నాడు. కొంచెం పక్కకి తిరిగి చూస్తే కాస్త అవతలగా చైర్‌లో కూర్చుని కనిపించింది రేఖ. ఎటో చూస్తోంది. ఆమె శరీరంలో అసలు చలనం ఉందా అనిపిస్తోంది. కళ్ళు ఎర్రబడి వాచిపోయి ఉన్నాయి.

చెంపల మీదనించి ఇంకా నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆమె వల్లనే కదా తను దొంగయ్యాడు! ఒకే కాలేజ్‌లో కలిసి చదువుకున్నారు విక్రాంత్, రఘు, రేఖలు. అప్పట్లో అమ్మాయిలు.. అబ్బాయిలతో పెద్దగా మాట్లాడేవారు కాదు. లైబ్రరీ బుక్స్‌లో అక్కడక్కడా కవితలు రాసి కింద పేరు రాసుకునేవాడు విక్రాంత్‌. అలా చూసిందట రేఖ.. అతని కవిత ఒకటి.

నిజానికి అది కవిత కూడా కాదు, ఏదో ఒక ఆలోచనలాంటిది అంతే! అలా ఏదైనా ఊహ తోచినప్పుడు ఒక పుస్తకంలోనో, అక్కడో ఇక్కడో రాసేస్తూ ఉండేవాడు. లైబ్రరీ పుస్తకంలో రాసింది ఆమెకి బాగా నచ్చిందట. వచ్చి పలకరించింది. మెల్లగా పరిచయం పెరిగింది. అది ఇష్టంగా మారింది. ప్రేమ మాటలూ, చూపులూ దొర్లాయి. ప్రపంచం అంత అందంగా అంతకు ముందెప్పుడూ కనిపించలేదు విక్రాంత్‌కి. కానీ... అనుకోకుండా ఓ రోజు కాలేజ్‌లో ఇన్‌స్పెక్షన్‌ జరిగింది.

అతని బ్యాగ్‌లో, రాబోయే సంవత్సరపు పరీక్ష పేపర్‌ దొరికింది. విక్రాంత్‌ కాలేజ్‌నించి ఎక్‌స్పెల్‌ అయ్యాడు. ఇంట్లో కూడా బీరువాలో ఉండే వెండి కంచం కనిపించకుండా పోయింది. మెడ పట్టి గెంటకపోయినా మేనమామ కాస్త మర్యాదగానే ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు. అప్పటికే అతని తల్లి చనిపోయి రెండేళ్ళవుతోంది.

ఉండటానికి చోటు లేక, తినడానికి తిండి లేక ఫుట్‌పాత్‌ మీద పడుకున్నాడు నాలుగైదు నెలలు. చివరికి కూలి పనికి వెళ్ళాడు ఆకలి తీర్చుకోవడానికి. కానీ అన్నింటికంటే పెద్ద బాధ రేఖ కోసం పడ్డదే. ఆమె మళ్ళీ అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఎందుకో కూడా అతనికి తెలీదు. ప్రేమలో ఉన్నామన్న ఆ భావం వల్ల, అది పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ కంటే ఏదీ ఎక్కువ కాదేమో! నిద్ర పట్టేది కాదు.

ఒకటే దుఃఖం. ఏం చెయ్యాలో ఎందుకు బతకాలో తెలీని స్థితి. చివరికి ఎలాగో అందులోంచి  బయట పడ్డాడు. జీవితంలో కొంత స్థిరపడ్డాడు. తనలాగే స్వాతికి కూడా తల్లితండ్రులు లేరు. కులం ఒక్కటీ లెక్క చూసుకుని ఆమెని తనకి ముడేసి వదిలేసి, చేతులు దులుపుకున్నారు ఆమె దగ్గరి బంధువులు. తమ మధ్య అద్భుతమైన ప్రేమ బంధం ఏర్పడకపోయినా ఒక ఒప్పందంలాంటి జీవితం ఉంది.

ఒకరికి ఒకరున్నారన్న ధైర్యం, ఆసరా ఉన్నాయి. సహజ పుట్టాక ఆ బంధం మరింతగా బలపడింది. ఇప్పుడు స్వాతి ఒంటరి. పైగా పసితనం ఇంకా వీడని సహజ బాధ్యత ఒకటి. స్వాతి పెద్దగా చదువుకోలేదు. తను లేకుండా ఎలా బతుకుతారో ఇద్దరూ...! అతనా ఆలోచనలో ఉండగానే ఏదో ఒక సందేశం లాంటిది అడ్డు తగిలింది. 

‘నీ ముందు ఇప్పుడు రెండు మార్గాలున్నాయి’ అంది అదృశ్య శక్తి. ‘ఏమిటవి?’ అన్నాడతను, జరుగుతున్నది అతి సహజమైన విషయంలాగా.  ‘ఆ కుర్రవాడిని బతికించే చాయిస్‌ నువ్వు తీసుకుంటే పదేళ్ల పాటు ఒక చీకటి ప్రదేశంలో ఆకలి దప్పికలతో, ఒంటరితనంతో బాధ పడుతూ బతకాల్సి వస్తుంది’ అందా శక్తి. అంటే నరకమా... అనుకున్నాడు.

అంతలోనే అవన్నీ మనిషిగా ఉన్నప్పటి నమ్మకాలని గుర్తొచ్చి, ‘మరి రెండో చాయిస్‌ ఏమిటీ?’ అడిగాడు. కుర్రవాడి చావుకి అతన్ని వదిలేసి నీదారి నువ్వు చూసుకుంటే ఆకలి దప్పికలు లేని వెలుగులోకంలో ఎప్పటికీ ఉండిపోయే అవకాశం. స్వర్గమన్నమాట... ఈసారి కావాలనే అనుకున్నాడు. ‘ఎందుకు అలా? మంచి పని చేస్తే శిక్షా! ఇదేం న్యాయం?’ అన్నాడు. 

‘కుర్రవాడికి ఆయుష్షు లేదు. నీ కరుణతో అతన్ని బతికించి ఆ శిక్ష నువ్వు తీసుకోగలవా?’ అంది అదృశ్య శక్తి. ‘నిర్ణయం పూర్తిగా నీ ఇష్టం’ అంటూ మౌనం వహించింది. కళ్ళ ఎదురుగా మళ్ళీ రేఖ కనిపించింది. అప్పట్లో ఆమె తనని ఎందుకు దూరం పెట్టిందో తెలీలేదు. నిన్న చనిపోయే వరకు కూడా ఆ ప్రశ్నకి సమాధానం దొరక్క చాలా బాధపడేవాడు.

ఇప్పుడు ఎంతో సహజంగానే, అప్పట్లో అన్నీ చూసినట్టుగానే తెలుస్తోంది.రఘు... రఘు కూడా ఆమెని ఇష్టపడ్డాడు. విక్రాంత్‌కి ఆమె దగ్గర కావడం సహించలేకపోయాడు. ఆ క్వశ్చన్‌ పేపర్‌ విక్రాంత్‌ బ్యాగ్‌లోకి రావడానికి, ఇంట్లో వెండి కంచం పోవడానికి  కూడా రఘునే కారణం. కవిత్వం కూడా రఘు రాసిందే విక్రాంత్‌ దొంగిలించినట్టుగా ఆమెని నమ్మించాడు.

విక్రాంత్‌ని చూసి అంతో ఇంతో రాయాలని రఘు కూడా ప్రయత్నించేవాడు అప్పట్లో. విక్రాంత్‌ని రోడ్డు మీద పడేశాకా, జీవితంలో స్థిరపడ్డాకా విక్రాంత్‌ పాత కవితల పుస్తకాన్ని అచ్చు వేయించుకుని సో కాల్డ్‌ సాహితీ ప్రపంచానికి దగ్గరయ్యాడు. ఒక కవిగా, రచయితగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని కొడుకుని బతికిస్తే తనకి పదేళ్ల నరకం. తనకి ఎంతో ద్రోహం చేసినవాడికి మంచి చేసే అవకాశం.

తన గొప్పతనానికి పరీక్ష. ఇప్పుడు తనకి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటే మాత్రం తను కోల్పోయిన జీవితం వెనక్కి వస్తుందా! తను పడ్డ బాధ, కష్టాలు మాయమై పోతాయా! చీకటీ, ఆకలిదప్పికలూ తనకి కొత్తేమీ కాదు. ఇంకో పదేళ్లు భరిస్తే ఒక చిన్న కుర్రవాడు బతుకుతాడు. నిండు జీవితాన్ని అనుభవిస్తాడు. ఇద్దరు మనుషులకి కడుపు కోత తప్పుతుంది.

అది రఘు కన్న ప్రేమ అయితేనేం... కత్తికి కత్తి, కన్నుకి కన్ను ఎలా సమాధానం అవుతాయి! తిరిగి పొడిస్తే పడిన పోటు మానిపోదు. అవతలి కన్ను కూడా పోగొడితే, పోయిన చూపు తిరిగి రాదు. నిర్ణయం తీసుకోవడానికి విక్రాంత్‌కి ఎక్కువ సమయం పట్టలేదు. లేకపోతే పట్టిందా...  ఏమో... ఆ లెక్క ఇప్పుడు పెద్దగా తెలీడం లేదు. 

‘సరే. నరకమే’ అన్నాడు అదృశ్య శక్తితో. అప్పుడు ఆ శక్తి ఇంకో విషయం కూడా  చెప్పింది. ఈసారి ఆ కాస్త కూడా ఆలోచించకుండానే, ‘అయినా పర్లేదు’ అన్నాడు. అప్పుడే అతనికి ఒక విజన్‌ వచ్చింది. కలలాగా భవిష్యత్తు కనిపించింది. తన కొడుకు బతకడానికి కారణం విక్రాంత్‌ అని రఘుకి తెలియడం, విక్రాంత్‌ కుటుంబాన్ని ఆదుకుంటానని అతను మాట ఇవ్వడం, అంతేకాక సహజ తన ఇంట్లోనే తన బిడ్డలా పెరుగుతుందని చెబుతూ రఘు, విక్రాంత్‌ కూతుర్ని కన్నీళ్లతో దగ్గరికి తీసుకోవడం... ‘ఆపండి!’ అన్నాడు విక్రాంత్‌ వెంటనే.

‘ఇంకా తనకి మానవ సహజమైన రియాక్షన్స్‌వదిలినట్టు లేవు’ అనుకున్నాడు. ‘ఈ చాయిస్‌ తీసుకోవడానికి నాకు ఒక కండిషన్‌ ఉంది’ అన్నాడు విక్రాంత్‌. ఏమిటో చెప్పమంది అదృశ్య శక్తి. ‘నాకారణంగా రఘు కొడుకు బతుకుతాడన్న విషయం రఘు కుటుంబానికి తెలియకూడదు’ అన్నాడు. ‘నీ కుటుంబం ఏమవుతుంది?అతను ఆదుకుంటాడు కదా’ అంది అదృశ్య శక్తి. ‘వద్దు’ అన్నాడు విక్రాంత్‌. ‘సరే’ అంది అదృశ్య శక్తి.

తండ్రి పోయాక తల్లి చెయ్యి పట్టుకుని మేనమామ ఇంటికి వెళ్లినప్పటినించీ అక్కడ ఎదుర్కొన్న అవమానాలన్నీ గుర్తొచ్చాయి అతనికి. పరాయి ఇంట్లో ఉంటూ, తింటూ, ఎంత చాకిరీ చేసినా, పెద్దగా మాటల రూపంలో వినకపోయినా, అవతలినించి ఎదురొచ్చిన నిర్లక్ష్యం, చులకన భావం, విసుగులూ, అసహనాలూ, లోకువతనాలూ అన్నీ అతన్ని ఒక్కపెట్టున చుట్టుముట్టాయి.

ఆ బెంగతోనే కదా అతని తల్లి బతికున్నప్పుడు కూడా చనిపోయినట్టే ఉండేది. అటువంటి స్థితి మళ్ళీ స్వాతికి, సహజకి రాకూడదు. మరి వాళ్ళు ఎలా బతుకుతారు? ఏమో అది అతనికి తెలీదు. ఇంతలో ఎవరో చిటికె వేసినట్టుగా చాలా వేగంగా కొన్ని సంఘటనలు జరిగిపోయాయి. అతను చూస్తూ నిలబడ్డాడు. విక్రాంత్‌ ఆర్గాన్స్‌తో రఘు కొడుక్కి సర్జరీ అవడం, కుర్రవాడు తొందరలోనే కోలుకోవడం, ఆర్గాన్స్‌డొనేట్‌ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తిని తలుచుకుని రఘు, రేఖ కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకోవడం... అలా సెకన్ల మీద అతని కళ్ళ ముందు... కాదు కాదు ఊహ ముందు కదిలిపోయాయి. 

ఇక ఇప్పుడు చీకటిలోకానికి ప్రయాణం. ఆ ప్రయాణంలో మరో విజన్‌ కలిగిందతనికి. మరో భవిష్యత్‌ దృశ్యం. స్వాతి, సహజ.. ఇండియాలో ఒక పెద్ద చైన్‌ అఫ్‌ హోటల్స్‌కి ఓనర్స్‌. వాళ్ళు ఎంతో సంతోషంగా, దర్జాగా, హుందాగా జీవిస్తున్నారు. తనకి తెలుసు. స్వాతి దగ్గర ఆ శక్తి ఉంది. ఆమె వంటలు చాలా బాగా చేస్తుంది. అతను పోయిన కొత్తలో కొంత ఇబ్బంది పడ్డారు. కానీ మెల్లగా పచ్చళ్ళు చెయ్యడం, ఉద్యోగులకి క్యారేజ్‌లు వండి పంపడం మొదలుపెట్టింది స్వాతి.

అది చాలా తొందరగా వృద్ధిలోకి వచ్చి ఒక హోటల్‌ కూడా పెట్టింది. అది చైన్స్‌గా విస్తరించింది. సహజ కూడా ఎంబీఏ చేసి ఆ బిజినెస్‌ నడపడంలో తల్లికి సహాయంగా ఉంది. విక్రాంత్‌  మనసు తృప్తితో నిండిపోయింది. ఈ బెంగ కూడా ఇక తనకి అవసరం లేదు. ‘రఘు కుటుంబానికి చెందిన భవిష్యత్తు కూడా చూస్తావా?’ అంది అదృశ్య శక్తి. ‘వద్దు’ అన్నాడు విక్రాంత్‌. అది తనకి సంబంధం లేని విషయం. 

తన ప్రయాణం ముగుస్తోందని విక్రాంత్‌కి అర్థం అయింది. అతను మెల్లగా.. ఏమీ లేని, ఏమీ తెలియని స్థితిలోకి జారిపోతున్నాడు. ఆ చివరి నిమిషంలో అతనికి ఓ విషయం అర్థమయింది. బహుశా ఆ చీకటి లోకం గురించి అదృశ్య శక్తి చెప్పిందంతా ఒక పరీక్ష. తాను ఆ నరకానికి వెళ్ళబోవడం లేదు. అలాగని స్వర్గంలోనూ అడుగు పెట్టడం లేదు. నిజానికి ఆ రెండూ ఉన్నాయో లేదో కూడా! తాను పూర్తిగా ఒక తెలియనితనంలోకి వెళ్ళిపోతున్నాడు.

ఏమీ లేకపోవడంలోకి. ఒక కథని, తన కథని తనే రాసుకుని పూర్తి చేసుకుంటున్నాడు. జీవితంలో ఓడిపోయి మరణంలో గెలుస్తున్నాడు. తన తండ్రి పెట్టిన పేరుని సార్థకం చేసుకుంటున్నాడు. 

ఆ ఆఖరి క్షణంలో అదృశ్య శక్తి చెప్పిన ఇంకో విషయం గుర్తొచ్చింది అతనికి. తాగిన మత్తులో యాక్సిడెంట్‌ చేసి, అతని చావుకి కారణమైంది రఘు కొడుకే. ఆ కంగారులో కాస్త దూరం వెళ్ళాకా, ఆగి ఉన్న లారీని గుద్దుకున్నాడు.ప్రయాణంతో పాటుగా, అతని ఆలోచన కూడా అక్కడితో అలా అంతమైపోయింది. ఇప్పుడతను పూర్తిగా విక్రాంతుడయ్యాడు. -భవానీ ఫణి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top