Venkampalli: వెల్‌కమ్‌ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ

Venkampalli of Kamareddy District, A Model Village SPECIAL STORY - Sakshi

పట్టణాల్లో నాగరికత  రోడ్లై.. వీథిలో లైట్లై.. వాడల్లో లే అవుట్లై..అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజై.. కూడళ్లలో పార్కులై.. 
కుళాయిలై.. బడులు.. కాలేజీలు.. కాలక్షేపానికి థియేటర్లు.. షాపింగ్‌ మాల్సై కనపడుతుంది!
వానలు.. వంతలు వచ్చినప్పుడు వరదలై ఉప్పొంగుతుంది కూడా!
కానీ ఈ పల్లెలో నాగరికత.. ఇళ్లల్లో ఇంకుడు గుంతలై.. కూడళ్లలో పరిశుభ్రతై.. ఆలోచనల్లో విజ్ఞత, విచక్షణై.. నడక, నడతల్లో సంస్కారమై.. కొలుపులు, కొట్లాటలకు నిర్వాసితై.. స్త్రీ, పురుష సమానత్వమై వెల్లివిరుస్తోంది! 
అదెక్కడో అభివృద్ధి ఆకాశాన్నంటిన.. హ్యాపీ ఇండెక్స్‌లో పైనున్న  దేశాల్లో లేదు!
తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నూరు కిలోమీటర్ల పై దూరంలో ఉంది!
పేరు.. వెంకంపల్లి! దాని గురించిన వివరాలను తెలుసుకునేందుకు వెల్‌కమ్‌ చెప్తోంది!! 

భగవంతుడి మీద నమ్మకం.. ఆధ్యాత్మికత.. ఈ రెండూ మనిషిని మనిషిగా నిలబెట్టే ప్రయత్నాలు.. మార్గాలు కూడా! ఈ మార్గాలను అనుసరించే మనిషి .. సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాడు. మాటలతో కాదు చేతలతో! అలా భక్తిని.. ఆధ్యాత్మికతను సరిగ్గా అర్థం చేసుకుని వ్యక్తిగత పరివర్తనతో పాటు పరిసరాల అభివృద్ధికీ పాటుపడ్డ.. పడుతున్న ఊరే వెంకపల్లి!

మంజీర ఒడ్డున ఉన్న ఓ చిన్న పల్లెటూరు ఇది. తెలంగాణలోని కామారెడ్డి – మెదక్‌ జిల్లాల సరిహద్దుల్లోని మారుమూల గ్రామం. చుట్టూరా పచ్చని పంట పొలాలతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇదివరకు ఇది తాండూర్‌ పంచాయతీ పరిధిలో ఉండేది. పంచాయతీల పునర్విభజన జరిగి 2018 ఆగస్టు 2న పంచాయతీగా ఏర్పడింది. 172 కుటుంబాలు నివాసం ఉంటాయిక్కడ. పురుషుల సంఖ్య మూడు వందల యాభై మూడు, మహిళల సంఖ్య మూడు వందల డెబ్భై తొమ్మిది. దీన్ని బట్టే చెప్పొచ్చు ఇది లింగ వివక్ష లేని ఊరని! గ్రామస్థుల ప్రధాన వృత్తి వ్యవసాయం. సూర్యోదయంతోనే పొలాన్ని చూసుకోనిదే వాళ్ల దినచర్య మొదలవదు. ఊళ్లో అందరూ ఎంతో కొంత చదువుకున్నవారే! ఉన్నత చదువులు చదివి వ్యవసాయం చేస్తున్నవారూ ఉన్నారు.

మంజీర ముంచేసింది.. 
1989లో కురిసిన భారీ వర్షాలకు మంజీర పొంగి వెంకంపల్లిని చుట్టేసింది. ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరడంతో గ్రామస్థులంతా ప్రాణాలు అరచేతపట్టుకుని పరుగులు తీశారు. పైభాగన ఉన్న ప్రాంతంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో పెద్దగా వ్యవసాయం నడిచేది కాదు. ఇళ్లన్నీ నీట మునగడంతో ఎగువ భాగాన ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు.

1990 ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఒక్కో కుటుంబానికి రూ.6 వేల చొప్పున సాయం అందించిందని గ్రామస్థులు చెప్పారు. అలా ఇళ్లు కట్టుకొని తమ ఊరిని పునర్నిర్మించుకున్నారు. ఏదో పొలం పనులు చేసుకుంటూ మునుపటిలాగే జీవనం సాగించేవారు. పరిసరాల శుభ్రత.. ఊరును ఓ జట్టుగా ఉంచుకునే వంటి వాటి మీద అవగాహన.. ప్రయత్నంలాంటివి లేకుండా! 

ఆ సమయంలోనే అంటే 1994లో..
వెంకపల్లిని బాన్స్‌వాడ పట్టణానికి చెందిన తాడ్కొల్‌ గంగారం, ఆర్‌ఎంపీ డాక్టర్‌ నాగభూషణం ఆధ్వర్యంలోని స్వాధ్యాయ బృందం సందర్శించింది. వాళ్లకు ఈ గ్రామంలో.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక.. ఎక్కడ పడితే అక్కడ మురికి నీటి గుంటలు కనిపించాయి. ఇళ్లు..చుట్టూ పరిసరాలు కూడా దోమలు, ఈగలకు ఆలవాలంగా అనిపించాయి. ఆధ్యాత్మిక వచనాల కన్నా ముందు గ్రామానికి పరిశుభ్రత పాఠాలు అవసరమని గ్రహించింది స్వాధ్యాయ బృందం. వాన నీటి సంరక్షణకే కాదు.. మురికి నీటిని తోలేందుకూ ఇంకుడు గుంతలే పరిష్కారమని బోధించింది. ఆ ఊళ్లో చక్కటి డ్రైనేజీ వ్యవస్థకు రూపకల్పన చేసింది.

ఆ సమస్య తీరాక స్వాధ్యాయ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. ఆ బృందం ఆశించినదాని కంటే గొప్ప ఫలితాలనే చూపించడం మొదలుపెట్టింది ఆ ఊరు. పరిసరాల పరిశుభ్రతలోనే కాదు.. ఊరి అభివృద్ధిలో కూడా! భక్తిని మూఢ విశ్వాసంగా కాకుండా దైనందిన జీవితానికి అన్వయించడం తెలుసుకున్నారు. స్వాధ్యాయ నేర్పిన ఆధ్యాత్మికతను తమ గ్రామ ప్రగతికి సోపానంగా మలచుకున్నారు. క్రమశిక్షణను అలవరచుకున్నారు. కష్టించి పనిచేయడాన్ని మించిన దైవారాధన లేదని నమ్మారు. తోటి వారిని గౌరవించడాన్ని మించిన మతం లేదనే విశ్వాసాన్ని అనుసరించడం మొదలుపెట్టారు.

ఒకరికొకరు సాయంగా ఉంటే ఊరంతా బాగుంటుందనే సత్యాన్ని అమలు చేయడం ఆరంభించారు. అదే ఆ ఊరికి నిర్ణయించని కట్టుబాటుగా మారింది.  ప్రతిఒక్కరూ వారి ఇళ్ల వద్ద స్వచ్ఛందంగా ఇంకుడుగుంతలను నిర్మించు కున్నారు. దీనివల్ల గ్రామంలో భూగర్భజలాలు పెరగడంతో పాటు మురుగు సమస్య లేకుండా పోయింది. ఇప్పటికీ ఈ గ్రామంలో ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా ఆవరణలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాల్సిందే! ఆధ్యాత్మిక చింతనలో భాగంగా సొంతడబ్బులతో గ్రామస్థులు 2001లో అమృతాలయాన్ని కట్టుకున్నారు.

దానికి ప్రత్యేకంగా పూజారి అంటూ ఎవరు ఉండరు. ప్రతి 15రోజులపాటు ఉదయం, సాయంత్రం గ్రామానికి చెందిన ఒక జంట(దంపతులు) ఆ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. ఈ 15రోజులూ ఆ దంపతులు మాంసం, మద్యం ముట్టుకోరు. గ్రామానికి చెందిన స్వాధ్యాయ భక్తులు కొందరు తీర్థయాత్రల పేరిట వారంరోజులపాటు ఇతరప్రాంతాలకు వెళ్లి స్వాధ్యాయ కార్యక్రమాలు, అందులో భాగంగా స్వయం సమృద్ధి, స్వావలంబన మీద అవగాహన కల్పిస్తుంటారు.  

ఇప్పుడు ఆ ఊళ్లో.. 
.. ఎక్కడా మురికి కాలువలు కనిపించవు. వంట గదిలో వాడిన నీరైనా, బాత్‌రూమ్‌లోంచి వెళ్లే మురికి నీరైనా భూమిలోకి ఇంకిపోతాయి. బయట మురికి కాల్వలు లేకపోవడంతో  దోమలు, ఈగల బెడద లేదు.  ఏ ఇంటికి వెళ్లినా ఇంటి ఆవరణలో కూరగాయలు, ఆకు కూరల మొక్కలు కనిపిస్తాయి. సీజనల్‌ పండ్ల చెట్లూ పలకరిస్తుంటాయి. టేకు చెట్లు, కొబ్బరి చెట్లను కూడా పెంచుతున్నారు. కరివేపాకు చెట్టు లేని ఇల్లు లేదంటే నమ్మండి! అందరూ ఆర్థికంగా ఎదిగినవారే. పిల్లలంతా ఉన్నత చదువులు చదివిన.. చదువుతున్నవారే. దాదాపు ఇంటికొకరు అన్నట్టుగా దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

వారిలో చాలామంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే. జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో 15 మంది పనిచేస్తుండగా, మరో 30 మంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అలాగే ఇంకొందరు ప్రైవేట్‌ ఉద్యోగాల్లో ఉన్నారు. గ్రామంలో దాదాపు ఇంటికొకరు అన్నట్టుగా ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నత చదువులు చదువుతున్న వారు మరో నలభై మంది వరకు ఉన్నారు. ఇంజనీరింగ్‌ వైపే ఎక్కువ మంది వెళ్లారు. ఒకరిద్దరు మెడిసిన్‌ వైపు వెళ్లినట్టు గ్రామస్థులు పేర్కొన్నారు. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదివిస్తున్నారు. గ్రామానికి చెందిన పలువురు యువతులు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఊళ్లో యాభై ఏళ్లు పైబడిన వాళ్లే కనిపిస్తారు. అంతా కలసిమెలసి ఉంటారు.


సాగులో ఆదర్శం..
వెంకంపల్లి అంటేనే వ్యవసాయం. ఇక్కడ ఆదర్శ సేద్యం చేస్తారు. ఈ గ్రామస్థులకు వెంకంపల్లి సహా తాండూర్, లింగంపల్లి కలాన్‌ గ్రామాలతో కలిపి  దాదాపు 780 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. అప్పట్లో చెరకు పంట ఎక్కువగా సాగయ్యేది. రైతులంతా బెల్లం తయారు చేసేవారు. అనకాపల్లి బెల్లం తయారీలో వెంకంపల్లి రైతులు ముందుండేవారు. పుట్లకొద్ది బెల్లం వండి మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు సరఫరా చేసేవారు. ప్రభుత్వం బెల్లంపై ఆంక్షలు విధించిన తరువాత బెల్లం తయారీ నిలిచిపోయింది. గతంలో నాలుగైదు వందల ఎకారల్లో చెరకు సాగయ్యేది. ఇప్పుడు కేవలం వంద ఎకరాల్లోనే సాగవుతోంది.

చెరకును గాయత్రీ చక్కెర కర్మాగారానికి తరలిస్తారు.  అయితే చెరకు సాగుకు కూలీల సమస్య, గిట్టుబాటు లేకపోవడంతో చాలా మంది రైతులు వరివైపు మొగ్గుచూపారు. ఇప్పుడు గ్రామంలో దాదాపు 550 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో చెరకును సాగు చేస్తున్నారు. మిగతా భూమిలో ఆరుతడి పంటలు సాగవుతాయి. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తారు. అధిక దిగుబడులు సాధిస్తున్నారు ఇక్కడి  రైతులు. రెండు చెరకు హార్వెస్టర్లు, పది వరకు వరి కోత మిషన్లు, 30 వరకు ట్రాక్టర్లు ఉన్నాయి. 

పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కరు..
గొడవలు.. గట్టు పంచాయతీలు.. గృహ హింస లేని ఊరుగా వెంకంపల్లిని పేర్కొనవచ్చు. గొడవలకు ఆస్కారమే లేదు కాబట్టి పోలీస్‌ స్టేషన్‌ మాటే రాదు ఆ ఊళ్లో.  చిన్న చిన్న సమస్యలు ఎదురైతే ఊర్లోనే కూర్చుని మాట్లాడుకుంటారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న సంఘటనలు తక్కువే. ఎన్నికల సమయంలో పోటాపోటీ రాజకీయాలు ఉంటాయి. తరువాత ఎవరి పని వారు చేసుకుంటారు. ఏదైనా సమస్య తలెత్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లినా గ్రామ పెద్దలు కూర్చుని సమస్యను పరిష్కరించేస్తారు. కుటుంబాల్లో తగాదాలు కూడా పెద్దగా ఉండవు. కాబట్టే తమ ఊరు వివాదాలు, తగాదాలకు అతీతమైందని చెప్తారు వెంకంపల్లి వాసులు.  

ఇంతకన్నా గొప్ప ప్రతిష్ఠ 
ఏం ఉంటుంది!!
మా వాళ్లకు హక్కుల కన్నా బాధ్యతలు బాగా తెలుసు. అందుకే మా ఊరు క్రమశిక్షణ, శ్రమ, ఐకమత్యానికి మారుపేరుగా నిలిచింది. ఇంతకన్నా గొప్ప ప్రతిష్ఠ ఏం ఉంటుంది ఏ ఊరికైనా! 
– శుభాకర్‌రెడ్డి,
గ్రామసర్పంచ్‌ 

పండగవేళ సందడే సందడి.. 
గ్రామంలోని దాదాపు అన్ని ఇళ్లూ ఆధునిక సౌకర్యాలతో కట్టినవే. బంధువులు, స్నేహితులు వస్తే పార్టీ చేసుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసుకున్నారు. ఏదేని పరిస్థితుల్లో  కరెంటు పోతే ఇన్‌వర్టర్లు వాడతారు. ఫ్రిజ్‌లు, టీవీలు లేని ఇళ్లు దాదాపు లేవు. గ్రామంలో 45 వరకు కార్లు ఉన్నాయి. వందకు పైగా ద్విచక్ర వాహనాలున్నాయి. పట్టణాల్లో, విదేశాల్లో ఉన్న పిల్లలంతా పండుగల సమయంలో ఊరికి వస్తారు. అప్పుడు వెంకంపల్లి అంతా  సందడిగా మారుతుంది.

ఇలా ఎప్పుడో జానపద కథల్లో విన్నట్టుగా.. ఊహల్లో కన్నట్టుగా ఉన్న ఈ ఊరు కనిపిస్తున్న సత్యం! ఆల్‌ ఈజ్‌ వెల్‌.. ఫీల్‌ గుడ్‌ను భావనల్లోనే కాదు ప్రాక్టికల్‌గా సాక్షాత్కరింపచేసుకుని వెంకంపల్లి ఇతర పల్లెలకే కాదు.. నాగరికతకు చిహ్నంగా భావించే నగరాలకూ స్ఫూర్తి! కులం, మతం పేరుతో మనుషులను దూరం చేస్తున్న సిద్ధాంతాలకు, మూఢభక్తితో నేరప్రవృత్తిని పెంచుతున్న, పెంచుకుంటున్న తత్వాలకు చెంప పెట్టు ఈ పల్లె!
∙సేపూరి వేణుగోపాలచారి
సాక్షి, కామారెడ్డి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top