ఈ ఆధునిక యుగంలో సమస్తానికీ మూలకారణం విద్య ఒక్కటే. చక్కటి విద్యకారణంగానే పిల్లలు సభ్యమానవులై, మంచి జీవితాన్ని గడపగలుగుతారు. భాషాజ్ఞానం, వాక్పటుత్వం, వాక్చాతుర్యం ద్వారానే వారు ఇతరులపై తమదైన ముద్ర వేయగలుగుతారు. పవిత్రంగా, మనస్పూర్తిగా, నిర్మలమైన మనస్సుతో అమ్మను ఆరాధిస్తే చాలు ఆ చదువుల తల్లి ప్రసన్నమై కోరిన విద్యలను ప్రసాదిస్తుంది.
సకల కళలకు, విద్యకు అధిదేవత శ్రీసరస్వతీదేవి. వివిధ పురాణాలలో సరస్వతీ ఆవిర్భావం గురించి వివిధ కథనాలు కనబడతాయి. గాయత్రీ ఉపాసనలో కూడా సరస్వతీదేవి ప్రస్తావన కనబడుతుంది. ‘‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి.....’’ అంటూ విధ్యాభ్యాసం ప్రారంభిస్తారు. అగ్నికార్యక్రమాలలో కూడా సరస్వతీదేవి ప్రార్థన కనిపిస్తుంది. ఈ విధంగా సరస్వతీదేవి ప్రస్తావన అన్ని ఙ్ఞాన సముపార్జన కార్యక్రమాలలో, దేవతాపూజా విధానాలలో కనిపిస్తుంది.
ఎవరైనా సరే, తమకుగాని, తమ హితులు, సన్నిహితులు, పుత్రులు, బంధుమిత్రులకు పాండిత్యం లభించాలన్నా, కోరిన కోరికలు నెరవేరాలన్నా, ఉన్నత విద్యాప్రాప్తి, ఉన్నతోద్యోగం, పదోన్నతి లభించాలన్నా వసంత పంచమి నాటి ఉదయమే స్నానాదికాలు ముగించుకుని, గణపతిని పూజించి, కలశంలో దేవిని ఆవాహన చేయాలి.
సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమె ప్రతిమ లేదా చిత్రపటాన్ని తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వులతో చేసిన లడ్లు, చెరుకురసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపళ్లు వంటి వాటిని నివేదిస్తే సరస్వతీదేవి ప్రసన్నురాలై కోరిన కోరికలు తీరుస్తుందని శాస్త్రోక్తి. లేదంటే ఎవరైనా పేద విద్యార్థులను చదివించే బాధ్యతను హృదయపూర్వకంగా తీసుకోవడం లేదా శక్తి కొలది ఎవరైనా పేద విద్యార్థులకు పుస్తకాలను కొనివ్వడం లేదా పండితులు, గురువులకు గ్రంథాలను బహూకరించడం.
(చదవండి: ఇవాల్టితో శబరిమల దర్శనం ముగియనుంది..!)


