సిరాచుక్కల సిరిచుక్క | Tributes to Telugu Literary Stalwart Sharada Ashokavardhan | Sakshi
Sakshi News home page

సిరాచుక్కల సిరిచుక్క

May 16 2026 5:51 AM | Updated on May 16 2026 5:51 AM

Tributes to Telugu Literary Stalwart Sharada Ashokavardhan

నివాళి

కుంతీపుత్రిక, ఈ తరం నది, జూనియర్‌ ఆర్టిస్ట్, అశ్రుతర్పణ, జీవితం గెలుపు నీది, మనస్విని, పిపాసి, వెన్నెల తేటి వంటి విభిన్నమైన 26 నవలలు, ఎనిమిది కథాసంపుటాలు, పలు నృత్య నాటికలు, నాటకాలతో సహా మొత్తం 82 పుస్తకాలు వెలువరించారు. ప్రముఖ సినీనటి భానుమతికి అత్యంత ఆత్మీయమైన స్నేహితురాలు,  తెలుగు సినిమాకి పాట రాసిన మొదటి మహిళ శారద అశోక వర్ధన్‌ గురువారం కన్ను మూశారు. ఆమెకు నివాళిగా...

భక్త ధ్రువ మార్కండేయ, గోడ మీద బొమ్మ వంటి చిత్రాలకు పాటలు రాసినా ఉద్యోగ ధర్మంగా పూర్తిగా అటు వెళ్లలేదు. వీరి ‘వినాయక సుప్రభాతం’ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గళంలో నేటికీ సుప్రసిద్ధం. అలాగే ఆంధ్రభూమి దినపత్రికలో ‘మరమరాలు’ పేరిట కాలమ్‌ నిర్వహించారు. 13 ఎపిసోడ్స్‌ సీరియల్‌ రాసి ఉత్తమ రచయిత్రిగా 1990. 1997, 2000లో నంది అవార్డులు పొందారు. వచన కవితలకేగాక నాటక రచయిత్రిగా  తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అందుకున్నారు. రాజ్యలక్ష్మి అవార్డు, సుశీలా నారాయణరెడ్డి అవార్డు, గృహలక్ష్మి స్వర్ణ కంకణం వంటి ఎన్నో అవార్డులు పొందిన ప్రతిభామతి శారద అశోక వర్ధన్‌. 

ఆకాశవాణిలో పని చేసిన కాలంలాగే ఆ తర్వాత జవహర్‌ బాల భవన్‌ డైరెక్టర్‌గా శారద అశోక వర్ధన్‌ పని చేసిన కాలం ఓ స్వర్ణయుగమే. బాలచంద్రిక పత్రికతోపాటు సాహిత్యానికి ఎంతో ప్రోత్సాహం కల్పిస్తూ వందలాది గ్రంథాలు ప్రచురింపజేయడమేగాక తానే స్వయంగా పిల్లలకోసం బాలవికాస గ్రంథాలు రాశారు. పన్నెండుకుపైగా కవితాసంపుటులు వెలువరించారు. 

28 జులై 1938లో సికిందరాబాద్‌లో జన్మించిన శారద తన జీవితమంతా ఆ నగరంతోనే పెనవేసుకున్న నేపథ్యంలో ఆత్మకథనాత్మక రచనగా నా (సుధామ) ముందుమాటతో బాటు ‘నా సిరిచుక్క సికింద్రాబాద్‌’ అనే గ్రంథాన్ని వెలువరించి ఒక నగర చరిత్రను కూడా అక్షర నిక్షిప్తం చేసిన వారయ్యారు. 

ఆమె తొలిసారిగా రాసిన ‘ఆత్మార్పణం’ అనే నాటకం స్థానం నరసింహారావుగారి దర్శకత్వంలో రేడియో నాటకంగా ప్రసారమైంది. సమాచారశాఖ లో చేరాక ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అనేక కథలు, కవితలు, నవలలు వెలయించారు. డిప్యుటేషన్‌పై ఆకాశవాణి కుటుంబ సంక్షేమ విభాగంలో కొన్నేళ్లు పని చేశారు. ‘మనసాయెరా మాధవా’ వంటి లలిత గీతాలెన్నింటినో రచించి ఒక కవయిత్రిగానూ ఖ్యాతి పొందారు. కుటుంబ సంక్షేమం గురించి ఆరుద్ర, సినారె, శశాంక వంటి వారి చేత పాటలు రాయించి, ‘గీత మాలిక’ గా ప్రసారం చేయించిన ఘనత ఆమెదే. బుర్రకథలు సైతం కుటుంబ నియంత్రణ ఇతివృత్తంగా రాసిన ఘనత వారిదే! ఆ సామర్థ్యంతోనే ఎన్‌.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనపై బుర్రకథ రచించి, నాజర్‌ బృందంతో ప్రశంసలందుకున్న ఘనత ఆమెది. 

అతి పిన్న వయసులో వచ్చిన టీచర్‌ ఉద్యోగాలు తనకు సరిపడవని వినమ్రంగా తిరస్కరించి అనంతర కాలంలో అదే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలో జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయిలో ఉద్యోగ విరమణ చేశారు. 

భర్త అశోక వర్ధన్‌ లేకున్నా తమ నలుగురు ఆడపిల్లలనూ ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారి వివాహాలు చేసి నలుగురు మనుమలు, నలుగురు మనుమరాండ్రతో ఉద్యోగ విరమణానంతరం విశ్రాంత జీవనాన్ని గడుపుతూ కొంత అస్వస్థతతో 88వ ఏట గురువారం పెద్దకుమార్తె అరుణ ఇంట కన్నుమూశారామె. శ్రీమతి శారద అశోకవర్ధన్‌ నింగికెగసిన సికిందరాబాద్‌ సిరిచుక్క మాత్రమే కాదు.. తెలుగు సాహిత్యలోకం మరువలేని మంచి సాహితీవేత్త. మరపురాని మహిళామణి. సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తుతున్న అశ్రు నివాళులే సాక్షి. 

– సుధామ
 

Advertisement
 
Advertisement
Advertisement